వారి మధ్య గ్యాప్ బాగా పెరిగింది

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ నేడు అనేక రాష్ట్రాల్లో కనుమరుగవుతోంది. దీనికి ప్రధాన కారణం [more]

Update: 2020-08-12 17:30 GMT

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో ఉంది. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ నేడు అనేక రాష్ట్రాల్లో కనుమరుగవుతోంది. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ స్వయంకృతా పరాధమే. ఓటముల నుంచి కాంగ్రెస్ ఎప్పటికీ గుణపాఠం నేర్చుకోదు కూడా. ప్రజల్లో అవతలి పక్షంపై వ్యతిరేకత వచ్చి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాలే కాని పార్టీ దానంతట అది కోలుకునే అవకాశాలను ఆ పార్టీ నేతలే ఇవ్వరు. వరసగా రెండు దఫాలు కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయినా ఇంకా ఆ పార్టీ నేతలకు జ్ఞానోదయం కలగలేదు.

జరుగుతున్న పరిణామాలు చూసైనా?

మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో జరుగుతున్న పరిణామాలను చూసి చక్కబెట్టాల్సిన అధిష్టానం సయితం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీలో ప్రధానంగా సీనియర్లు, జూనియర్ల మధ్య దూరం పెరుగుతుంది. సీినియర్లు ఉన్నంత కాలం తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావిస్తున్న యువనేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో అనేక రాష్ట్రాల్లో యువనేతలు డీలా పడ్డారు.

డిగ్గీరాజా ట్వీట్ తో….

సీనియర్ నేతలంటేనే జూనియర్ నేతలకు పడటం లేదు. తాజాగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ కూడా పార్టీలో కలకలం రేపింది. కరోనా సమయంలో పార్లమెంటు సమావేశాల్లో యాక్టివ్ కావాలని రాహుల్ గాంధీని ఉద్దేశించి దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ పై మండిపడుతున్నారు. సీనియర్ నేతలు అనేక మంది రాహుల్ గాంధీని తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని సూచిస్తున్నారు. అయినా రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారు.

ధ్వజమెత్తుతున్న జూనియర్లు….

తాజాగా జూనియర్లు సీనియర్లపై ధ్వజమెత్తారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి సీనియర్లే బాధ్యత వహించాలని సోనియా గాంధీ ఎదుటే వారు పేర్కొనడం విశేషం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశించి వారు ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీనియర్ నేతల వైఖరి కారణంగానే ఓటమి చవిచూశామని వారు చెబుతున్నారు. ఇకనైనా సీనియర్లు పక్కకు తప్పుకుని యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు, జూనియర్లకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పదవులు, లేకుంటే పార్టీ పదవులన్నీ సీనియర్లకే దక్కుతుండటంపై జూనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News