గంటాకు మళ్లీ లైన్ దొరికిందట… ?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుత రాజకీయ హోదా ఏంటి అంటే ఆయన రాజీనామా చేసిన విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే అనే చెప్పుకోవాలి. తన రాజీనామా పత్రం [more]

Update: 2021-05-14 06:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుత రాజకీయ హోదా ఏంటి అంటే ఆయన రాజీనామా చేసిన విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే అనే చెప్పుకోవాలి. తన రాజీనామా పత్రం స్పీకర్ పరిశీలనతో ఉంది కాబట్టి తాను అంతవరకూ మాట్లాడను అంటున్నారు గంటా శ్రీనివాసరావు. అదే సమయంలో ఆయన టీడీపీలో కూడా యాక్టివ్ గా లేరు. అయితే ఆయన రాజీనామా చేసి మూడు నెలలు అయినా ఆమోదముద్ర పడలేదు. ఇప్పట్లో ఆ పని జరిగేది కూడా లేదు. దాంతో కరోనా తగ్గాక తన భవిషత్తు కార్యాచరణకు పదును పెట్టడానికి గంటా శ్రీనివాసరావు రెడీ అవుతున్నారు.

అక్కడ ఖాళీ …?

మాజీ ఎంపీ సబ్బం హరి ఆకస్మిక మృతితో భీమిలీ నియోజకవర్గంలో పార్టీకి నాధుడు లేకుండా పోయాడు. హరి విశాఖలో ఉంటున్నా అపుడపుడు భీమిలీకి వెళ్ళి వస్తూండేవారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ గెలుపు కొరకు కొంత కష్టపడ్డారు. పైగా ఆయన భీమిలీ ప్రాంత వాసి కావడంతో ప్లస్ పాయింట్ గా ఉండేది. హరి లేకపోవడంతో ఇపుడు కంచుకోట లాంటి భీమిలీకి ఇంచార్జి ఎవరూ లేరు. పైగా ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భీమిలీ టీడీపీలో ఉన్నవారంతా ద్వితీయ శ్రేణి నేతలే. గట్టి నేత అవసరం అయితే ఉంది.

అక్కడ నుంచే …?

ఈ నేపధ్యంలో గంటా శ్రీనివాసరావును మళ్ళీ భీమిలీ నుంచి పోటీ చేయమని పలువురు నాయకులు ఆహ్వానిస్తున్నారు. మీరే ఇంచార్జిగా ఉండాలి అంటూ ఆయనకు సన్నిహితమైన నేతలు కోరుతున్నారు కూడా. 2014 నుంచి 2019 వరకూ అయిదేళ్ల పాటు మంత్రిగా భీమిలీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు మంచి నెట్ వర్క్ అక్కడ ఉంది. దాంతో ఆయననే ఇంచార్జిగా నియమిస్తే పార్టీ దూసుకుపోతుంది అన్నది తమ్ముళ్ల మాట. గంటా కూడా దీని మీద సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అంటున్నారు. గత ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తారని తప్పుకున్న గంటా ఈసారి మాత్రం ముందుగానే తేల్చుకుని అక్కడ నుంచే ఫ్యూచర్ పాలిటిక్స్ కి తెరతీయాలని చూస్తున్నారు అన్నది ఆయన వర్గం మాట.

బాబు మదిలో…?

ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు ఇప్పటికీ టీడీపీకి అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఆయనకూ చంద్రబాబుకూ మధ్య ఎడం బాగా ఉందని అంటున్నారు. మరో వైపు గంటా శ్రీనివాసరావుకు మళ్ళీ భీమిలీ బాధ్యతలు అప్పగించే విషయంలో చంద్రబాబు మదిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలియడంలేదు అంటున్నారు. 2019 తన కుమారుడి పోటీకి భీమిలీ అనుకున్న బాబు 2024 నాటికి దానినే నిజం చేయవచ్చు అన్న మాట కూడా ఉంది. పైగా అది టీడీపీకి సేఫెస్ట్ ప్లేస్ కూడా. అంతే కాకుండా కొత్త వారి మీద కూడా బాబు చూపు ఉందని టాక్. మొత్తానికి గంటా శ్రీనివాసరావు మనసు పడిన భీమిలీ సీటు విషయంలో కధ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News