గంటా ఒక్కరే కాదట.. గ్యాంగ్ తో సహా…?

గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ ఒంటరిగా పార్టీలు మారరు. మారుతున్న పార్టీలో తనకు గ్రిప్ దొరకాలంటే వీలయినంత మందిని తనతో పాటు తీసుకెళ్లే నైజం ఉంది. గంటా శ్రీనివాసరావు [more]

Update: 2020-08-08 06:30 GMT

గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ ఒంటరిగా పార్టీలు మారరు. మారుతున్న పార్టీలో తనకు గ్రిప్ దొరకాలంటే వీలయినంత మందిని తనతో పాటు తీసుకెళ్లే నైజం ఉంది. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి మారుతున్నారు. ఆయనతో పాటు మరికొందరు వెళ్తారన్న ప్రచారంతో తెలుగుదేశం పార్టీలో కంగారు మొదలయింది. ఎవరెవరు వెళతారన్న దానిపై ఇప్పటికే టీడీపీ ఆరా తీస్తుంది. పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పార్టీ ఎమ్మెల్యేలందరితో ఫోన్ లో నిత్యం మాట్లాడుతూ వారికి పార్టీ తరుపున భరోసా ఇస్తున్నారు.

మరికొందరు కూడా……

అయితే గంటా శ్రీనివాసరావు వెంట మరికొందరు కూడా వైసీపీలోకి వెళతారన్న ప్రచారం మాత్రం బాగా ఉంది. గంటా శ్రీనివాసరావు వెంట టీడీపీ ఎమ్మెల్యే తో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు వెళతారన్న టాక్ నడుస్తోంది. విశాఖ నగరానికి చెందిన వారే ఎక్కువగా వైసీపీ కండువా కప్పుకోవడానికి గంటా శ్రీనివాసరావుతో పాటు రెడీ అవుతున్నారు. ఈ మేరకు వైసీపీ అధినాయకత్వానికి గంటా శ్రీనివాసరావు తెలియజేసినట్లు తెలుస్తోంది.

ఏ పార్టీలోకి వెళ్లినా…..

గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉన్నా తన కంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లినప్పుడు, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక్కరే రాలేదు. అనేక మంది నేతలతో కలసి పార్టీ కండువాలను కప్పుకున్నారు. ఇప్పుడు కూడా వైైసీపీలోకి గంటా శ్రీనివాసరావు తన గ్యాంగ్ తోనే వెళతారన్నది వాస్తవం. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు ఒక జాబితాను రూపొందించి వైసీపీ హైకమాండ్ కు పంపారు. వారి ఆమోదం పొందిన తర్వాత వారితో కలసి తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరు?

గంటా శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ప్రస్తుత ఎమ్మెల్యే గణబాబులు చేరేందుకు రెడీ అవుతున్నారని చెబుతున్నారు. గణబాబు ఇప్పటికే టీడీపీ అధినాయకత్వంతో టచ్ లో లేకుండా పోవడం అనుమానాలకు దారి తీస్తుంది. గంటా శ్రీనివాసరావుతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న టాక్ టీడీపీ నుంచే విన్పిస్తుంది. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా యాక్టివ్ గా లేరు. వీరంతా విశాఖ పరిపాలన రాజధానిగా మారిన తర్వాత వైసీపీ కండువాలు కప్పుకుంటారని కూడా చెబుతున్నారు. మొత్తం మీద గంటా శ్రీనివాసరావు తన గ్యాంగ్ తోనే వైసీపీలోకి వెళుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధినేత వారిని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News