వారందరినీ ఏకం చేసే పనిలో గంటా..?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు, దివంగత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి కొన్ని పోలికలు ఉన్నాయనిపిస్తోంది. ఈ ఇద్దరూ నేతలూ అధికారంలో ఉన్నా చర్చలోకి వస్తారు, విపక్షంలో [more]

Update: 2021-03-18 12:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు, దివంగత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి కొన్ని పోలికలు ఉన్నాయనిపిస్తోంది. ఈ ఇద్దరూ నేతలూ అధికారంలో ఉన్నా చర్చలోకి వస్తారు, విపక్షంలో కూడా కూడా అలాగే తమ ఉనికిని బలంగా చాటుకుంటారు. ఇక గంటా శ్రీనివాసరావు అనుకున్న టార్గెట్ ని రీచ్ అవడానికి ఎంతవరకైనా వెళ్తారు. అలా ఆయన ఎంపీగా ఎంట్రీ ఇచ్చిన పదేళ్ల లోపే రాష్ట్ర మంత్రి అయ్యారు. పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు కూడా . ఈ రెండూ ఎలా చూసుకున్నా రికార్డులే మరి.

ఆ గ్యాప్ లో అలా ….

ఏపీ రాజకీయాలు అంటే కులాల సమీకరణలు తప్ప మరోటి కావు. ఏపీలో టీడీపీ కమ్మ వారికి వైసీపీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాయని అంటారు. అయితే రాష్ట్రంలో 27 శాతం ఉన్న కాపులకంటూ ఒక ధీటైన నాయకత్వం కావాలన్న భావన ఉంది. ముద్రగడ పద్మనాభం అస్త్ర సన్యాసం చేసినట్లే అంటున్నారు. హరిరామజోగయ్య లాంటి వారు వృద్ధులయ్యారు. దాంతో కాపులను ఏకీకృతం చేస్తే రాజకీయంగా మంచి ఫలితాలు ఉంటాయని గంటా శ్రీనివాసరావు ఆలోచిస్తున్నారా అన్న డౌట్లు అయితే పుడుతున్నాయి.

ఈ భేటీలేంటి ….

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావు ఈ మధ్య తరచూ భేటీలు అవుతున్నారు. ఈ భేటీలకు వారు చెప్పే కారణాలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా పోరాటం చేయడానికి అని. కానీ దానికి మించి మరేదో ఉందని అంటున్నారు. అలా అనుకోవడానికి ఇద్దరి సామాజిక వర్గాలు ఒక్కటి కాకపోయినా మరిన్ని అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. మరో వైపు మంత్రిగా పనిచేసినప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు ఏపీలో కీలక నేతగా ఫోకస్ అవుతూ వచ్చారు. ప్రత్యేకించి కాపులలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో ఇపుడు ఖాళీగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఆ వైపు నుంచి నరుక్కు రావాలని అనుకుంటున్నారు.

అప్పటికి బలంగా….

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు 2024 లో జరుగుతాయి. అప్పటికి సామాజికవర్గం పరంగా బలంగా ఉండాలని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ఆనాటికి రాజకీయంగా సమీకరణలను బట్టి ఈ బలాన్ని, బలగాన్ని అనుకూలంగా మార్చుకోవాలని కూడా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే బీజేపీ జనసేన కూటమి కాపుల మద్దతు కోసం ఆశగా చూస్తోంది. అయితే ఈ కూటమి పట్ల కాపుల స్పందన ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. ఒకవేళ వచ్చే ఎన్నికల సమయానికి ఈ కూటమి వైపే కాపులు నిలిస్తే వారి తరఫున తాను ముందువరసలో ఉండి కూటమి రాజకీయాన్ని కూడా మలుపు తిప్పాలన్నది ఒక ఆశ కూడా గంటా శ్రీనివాసరావుకు ఉందని ప్రచారం సాగుతోంది. మొత్తానికి రాజకీయాల్లో కులం కంటే బలమైనది ఏదీ లేదు. దాంతో గంటా రూట్ అటు వైపేనా అన్న చర్చ మాత్రం వేడిగా సాగుతోంది.

Tags:    

Similar News