పార్టీ గడప తొక్కేదే లేదంటున్న గంటా ?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టుదలకు మారుపేరు. ఆయన అనుకున్నదే చేస్తారు. ఆయన అలిగితే ఒక పట్టాన రాజీకి రారు. అది. 2018లోనే ఒకసారి రుజువు అయింది, [more]

Update: 2021-01-30 06:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టుదలకు మారుపేరు. ఆయన అనుకున్నదే చేస్తారు. ఆయన అలిగితే ఒక పట్టాన రాజీకి రారు. అది. 2018లోనే ఒకసారి రుజువు అయింది, మంత్రి హోదాలో ఉంటూ అలిగిన గంటాను బుజ్జగించడానికి నాటి సీఎం హోదాలో చంద్రబాబు నానా తంటాలు పడాల్సివచ్చింది. ఏకంగా నాటి విశాఖ ఇంచార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్పను గంటా శ్రీనివాసరావు ఇంటికి పంపించి మరీ సముదాయించారు. అయితే అది అలా మనసులోనే ఉంది. ఇంతలోనే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడింది. నాటితో గంటా కూడా ఫుల్ సైలెంట్ అయ్యారు.

ఎవరికి అవసరం …?

గంటా శ్రీనివాసరావు రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ గా బిగ్ షాట్ గా ఉంటున్నారు. ఆయన టీడీపీ అధికారంలో ఉన్నపుడు మంత్రిగా అర్బన్ రూరల్ తేడా లేకుండా విశాఖను శాసించారు. ఇంచార్జి మంత్రి హోదాలో విజయనగరంలో పూసపాటి రాజు అశోక్ కి కూడా చుక్కలు చూపించారు. ఇంతటి పవర్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న గంటా శ్రీనివాసరావును ఏమీ కాకుండా బాబు తీసిపారేయడంతోనే గంటా రగులుతున్నారని అంటున్నారు. తనకు జనం బలం ఉంది. ఎక్కడ నుంచి అయినా గెలవగలను అని గంటా శ్రీనివాసరావు ఇప్పటికి నాలుగు ఎన్నికలు, నాలుగు నియోజకవర్గాల ద్వారా నిరూపించారు. అందువల్ల తన అవసరమే రాజకీయాల్లో ఎవరికి అయినా ఉంటుంది అని ఆయన భావిస్తున్నారుట.

తమ్ముళ్ళకు ఝలక్ ….

గంటా శ్రీనివాసరావు తాజాగా చేసిన పనికి విశాఖ తమ్ముళ్ళు ఖంగు తిన్నారు. ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన గంటా శ్రీనివాసరావు పార్టీ ఆఫీస్ కి మాత్రం వెళ్లలేదు. దాంతో తమ్ముళ్ళు షాక్ అయ్యారు. గంటా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మారాక ఇప్పటిదాకా పార్టీ ఆఫీస్ కి రాలేదు. దానికి కారణాలు కూడా తెలియదు. ఆయనకు ఎందుకో పార్టీ ఆఫీస్ గడప తొక్కాలనిపించడంలేదు అని అనుచరులు అంటున్నారుట. అయితే తన కంటే జూనియర్లకు పార్టీ పదవులు ఇచ్చి తనను ఒక మామూలు ఎమ్మెల్యేగా ఉంచిన అధినాయకత్వం మీద గుస్సాతోనే గంటా ఇలా చేస్తున్నారు అంటున్నారు.

టైమ్ డిసైడ్ చేసేనా…?

గంటా శ్రీనివాసరావుకు బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మంచి దోస్త్. పైగా ఆయన ఉభయగోదావరి, ఉత్తరాంధ్రాలోని కాపు నాయకులను అందరికీ ఒక గూటికి చేరుస్తున్నారు. మాజీ మంత్రి కళా వెంకటరావు తో భేటీ అన్నది తృటిలో తప్పింది కానీ బీజేపీ కన్ను ఆయన మీద ఇప్పటికీ ఉందనే అంటున్నారు. అలాగే గంటా శ్రీనివాసరావు లీడ్ తీసుకుంటే ఉత్తరాంధ్రా అంతా ఒక త్రాటి మీదకు వచ్చి కీలక‌ నేతలు బీజేపీలోకి వస్తారని కూడా అంటున్నారు. అయితే దానికి తగిన టైమ్ ఉందనే గంటా శ్రీనివాసరావు శిబిరం నుంచి వస్తున్న మాట. బీజేపీ అండ లేకుండా తాను గెలిచినా తనతో వచ్చిన వారు గెలవాలి అంటే ఆ పార్టీకి కొంత బేస్ ఉండాలి కదా అని గంటా ఆలోచిస్తున్నారుట. ఆ నమ్మకం తిరుపతి ఉప ఎన్నిక కలిగిస్తే గంటా శ్రీనివాసరావు గడప తొక్కే ఆఫీస్ అదే అవుతుందని కూడా ప్రచారం అయితే సాగుతోంది.

Tags:    

Similar News