గంటా వైలెంట్ అయితే లబ్ది ఎవరికి ?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చాలా బాలన్స్ గా ఉండే వ్యక్తి అని చెబుతారు. సాధారణంగా రాజకీయంగా చాలా మంది నేతలు నోరు జారుతారు. టంగ్ స్లిప్ [more]

Update: 2020-11-28 00:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చాలా బాలన్స్ గా ఉండే వ్యక్తి అని చెబుతారు. సాధారణంగా రాజకీయంగా చాలా మంది నేతలు నోరు జారుతారు. టంగ్ స్లిప్ అన్నది కామన్. కానీ గంటా కూల్ పర్సనాలిటీ. ఆయన చేతలలో తప్ప మాటలకు ఎక్కువ విలువ ఇవ్వరు. అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు గంటా శ్రీనివాసరావు. అయితే గంటాకు ఇపుడు అసలైన తంటా వచ్చిపడింది. ఆయన మౌనాన్ని భగ్నం చేసే చర్యలు వరసగా విశాఖలో జరిగిపోతున్నాయి.

దగ్గరగా వచ్చి మరీ….

గంటా శ్రీనివాసరావును అధికార వైసీపీ గట్టిగానే టార్గెట్ చేస్తోంది. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలూ అవసరం లేదు. గంటా బిగ్ షాట్. ఆయనకు అంగబలం, అర్ధం బలం ఉన్నాయి. ఆయన్ని చూసుకునే చంద్రబాబు ఇన్నాళ్ళూ ధీమాగా ఉన్నారు. ఇపుడు గంటాను టీడీపీ కాకుండా చేయడంలో వైసీపీ తనదైన మార్క్ పాలిటిక్స్ చేస్తోంది. అలాగనీ తమ వైపు రానీయకుండా, ఉన్న పార్టీలో ఉండనీయకుండా వైసీపీ ఆడుతున్న చెలగాటానికి గంటా శ్రీనివాసరావు శిబిరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక గంటాకు చాలా దగ్గరగానే అధికార పార్టీ వచ్చేసింది. ఆ సెగలూ పొగలూ కూడా డైరెక్ట్ గానే తాకుతున్నాయి.

ఒక్కోటిగా లెక్కపెట్టి….

పట్టుకోవాలంటే రాజకీయ నాయకుల వద్దనే అన్నీ దొరుకుతాయి. ఏపీలో ఇప్పటిదాకా జగన్ లాంటి నేత సీఎం కుర్చీలో కూర్చోక అన్నీ పచ్చగా, పతివ్రతల్లా కనిపిస్తున్నాయి కానీ పట్టుపడితే సెంటీమీటర్ కి ఒక కుంభకోణం బయటపడుతూనే ఉంటుంది. జగన్ కి ఎలాంటి మొహమాటాలు అసలే లేవు. తాను అవినీతిపరుడిని అని ఇప్పటిదాకా అంతా అంటూ వచ్చారు. మరి వారేమైనా పతివ్రతలా అన్నదే జగన్ ఆలోచన. అందుకే ఎవరి జాతకాలేంటో జనాలకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాడు. అందులో భాగంగా విశాఖలో గంటా శ్రీనివాసరావు, ఆయన అనుచరులు చేసిన కబ్జాల భాగోతం ఒక్కోటిగా బయటకు తెస్తున్నారు. తాజాగా గంటాకు తలలో నాలుకగా ఉన్న రియల్టర్, టీడీపీ నేత కాశీ విశ్వనాధం భూ కబ్జాను కూడా వెలుగులోకి తెచ్చేశారు. ఆ భూమిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది ప్రైవేట్ భూమి అని, తనకు నోటీసులు ఇవ్వకుండా అధికారులు అంతా చేస్తున్నారని విశ్వనాధం ఓ వైపు విమర్శలు చేస్తున్నారు. అది వేరే సంగతి.

బరస్ట్ అవుతారా …..?

గంటా శ్రీనివాసరావు స్వభావం తెలిసిన వారు ఎవరూ ఆయన బరస్ట్ అయి వీధుల్లోకి వస్తారని అనుకోరు. అందునా వైసీపీ అత్యంత బలంగా ఉన్న కాలమిది. ఆదుకునేందుకు కూడా ఎవరూ లేరు, రారు, అందుకే ఆయన మౌనమే నా భాష అంటున్నారు. అయితే సహనానికి కూడా హద్దు ఉంటుంది కదా. గంటా శ్రీనివాసరావుతో సహా అనుచరులను ఒక్కొక్కరినీ పట్టుకుని మరీ టార్గెట్ చేస్తూంటే ఊరుకోగలరా. మరి గంటా బరస్ట్ అయితే అది ఎవరికి లాభం, ఎవరిని నష్టం అంటే కచ్చితంగా టీడీపీకే లాభం. గంటాలోని ఫైర్ బ్రాండ్ ని తట్టిలేపి విశాఖలో బలమైన నాయకుడిని చంద్రబాబుకు కానుకగా అందించిన ఘనత వైసీపీదే అవుతుంది. అదే సమయంలో గంటా వైలెంట్ అయితే వైసీపీకి కూడా అదే కావాల్సింది. తమ పని మరింత సులువు అవుతుంది. మరిన్ని కొత్త కేసులతో ఇరకాటం పెట్టవచ్చునని స్కెచ్ గీస్తోంది. మొత్తానికి గంటా శ్రీనివాసరావుని కార్నర్ చేసి ఆడుతున్న ఈ రాజకీయ పులి జూదంలో బకరాలు అయ్యేది ఎవరో తొందరలోనే తేలుతుంది అంటున్నారు.

Similar News