గంటా తేల్చరు.. ముంచరు.. గప్ చుప్ రాజకీయమేనా?

తెలుగు తమ్ముళ్లంతా మంచికో చెడ్డకో అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తారు. బాబుకు తానా తందానా అంటారు. అయితే ఆయన మాత్రం అలా కాదు, ప్రత్యేకంగా ఉంటారు. పైగా [more]

Update: 2020-06-17 14:30 GMT

తెలుగు తమ్ముళ్లంతా మంచికో చెడ్డకో అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తారు. బాబుకు తానా తందానా అంటారు. అయితే ఆయన మాత్రం అలా కాదు, ప్రత్యేకంగా ఉంటారు. పైగా ఆయనకు ప్రతిపక్షంలో ఉండడం అసలు గిట్టదు, అధికార దర్పంతోనే ఎపుడూ వెలిగిపోవాలని కోరుకుంటారని అంటారు. గంటా శ్రీనివాసరావు రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇది రెండవమారు విపక్ష పాత్ర. ఆయన 2004 నుంచి 2008 వరకూ మాత్రమే టీడీపీలో విపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. అది కూడా పెద్దగా చడీ చప్పుడు చేయకుండానే. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అట్నుంచి కాంగ్రెస్ లో చేరి మంత్రి అయ్యారు. అలా మళ్ళీ టీడీపీలోకి వచ్చి తన స్థాయి పెంచుకున్నారు. మంత్రి పదవి ఇక్కడా అయిదేళ్ల పాటు అనుభవించారు.

మౌనమే భాష……

గంటా శ్రీనివాసరావు ఏడాదిగా మౌనమే నా భాష అంటున్నారు. ఆయన ఏ విషయంలోనూ ఆందోళన చేయడంలేదు. పవన్ లాంగ్ మార్చ్ విశాఖలో జరిగితే దానికి టీడీపీ తరఫున బాబు వెళ్లమంటే గంటా శ్రీనివాసరావు డుమ్మా కొట్టారు. ఇసుక పోరాటం కానీ, ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన కానీ గంటా శ్రీనివాసరావు ఎక్కడా పెదవి విప్పలేదు. అసలు చంద్రబాబు విశాఖ వచ్చినపుడు కూడా గంటా గైర్హాజర్ కావడం అప్పట్లో సంచలనం అయింది. అయితే తమ నేతకు వ్యక్తిగత పనులు వేరే ఉన్నాయని అంటూ గంటా శ్రీనివాసరావు అనుచరులు నాడు సర్దిచెప్పారు.

స్పందనేదీ…?

ఓ వైపు టీడీపీలో పెద్ద తలకాయలు లేచిపోతున్నాయి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చిన్న విషయం కాదు, పైగా ఆయన ఉత్తరాంధ్రాకు చెందిన ప్రముఖ బీసీ నేత. అటువంటి అచ్చెన్న అరెస్ట్ అయితే గంటా శ్రీనివాసరావు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. అదే విధంగా మరో నేత జేసీ ప్రభాకరరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టులను నిరసిస్తూ తమ్ముళ్ళను పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టమని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే గంటా శ్రీనివాసరావు మాత్రం చడీ చప్పుడూ లేకుండా గమ్మున ఉన్నారని సొంత పార్టీలోనే సణుగుడు వినిపిస్తోంది.

ఉన్నట్లేనా….?

అదేంటో గంటా శ్రీనివాసరావు ఏదీ తేల్చరు, ముంచరు, అంతా ఒక వ్యూహం ప్రకార‌మే చేసుకుపోతున్నారులా ఉంది. ఆయన పార్టీలో లేరా అంటే మహానాడు జూమ్ యాప్ మీటింగుకు అటెండ్ అయ్యారు. ఆ తరువాత మళ్లీ కనిపించలేదు. ఇక గంటా శ్రీనివాసరావు బయట కూడా ఎక్కడా మీడియా కంటపడకుండా ఉంటూ వస్తున్నారు. మిగతా తమ్ముళ్ళు కూడా లాక్ డౌన్ పీరియడ్ అంటూ కొన్నాళ్ళు గడిపినా ఇపుడు ఏపీ అంతా రాజకీయం వేడెక్కింది. దాంతో వారంతా నిరసనల పేరిట రోడ్డున పడ్డారు. అయినా గంటా శ్రీనివాసరావు పెదవి విప్పకుండా టైం పాస్ చేస్తున్నారు. మరి ఆయన పార్టీలో ఉన్నారా. బాబు ఆదేశాలు పాటిస్తున్నారా. ఆయన గప్ చుప్ రాజకీయంతో టీడీపీలో కొత్త చర్చ మొదలవుతోంది. చూడాలి మరి గంటా సార్ ఏంచేస్తారో.

Tags:    

Similar News