గంటా సేఫ్ గేమ్ లో ఉన్నారా?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ ప్లాన్ మెల్లగా అర్ధమవుతోంది. ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఇంకా స్పష్టత రాకపోయినా సేఫ్ గేం ఆడేందుకు మాజీ మంత్రి గంటా [more]

Update: 2019-08-31 02:00 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ ప్లాన్ మెల్లగా అర్ధమవుతోంది. ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఇంకా స్పష్టత రాకపోయినా సేఫ్ గేం ఆడేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సిధ్ధపడుతున్నారని అంటున్నారు. ఏపీలో రాజకీయం ఇప్పటికైతే ఓ విధంగా ఉంది. ఇంకా అయిదేళ్ళ కాలం సాగాలి. అప్పటికి ఎవరు ఎలా ఉంటారో ఏమిటో తెలియదు. దాంతో ఎటువైపు వెళ్ళినా సరే నష్టపోకుండా ఉండేదుకు గంటా శ్రీనివాసరావు పక్కా వ్యూహంతో ముందుకు వస్తున్నారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇప్పటికిపుడు ఏ పార్టీలోకి మారే ఆలోచన లేదని అంటున్నారు. అలాగనీ టీడీపీలో ఉంటారని కూడా చెప్పలేమని చెబుతున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా గంటా శ్రీనివాసరావు తన పదునైన వ్యూహాలను అమలుచేస్తున్నారు. అందులో భాగంగా ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు అయిన గంటా రవితేజ బీజేపీలోకి చేరుతారని అంటున్నారు.

బెర్త్ కోసమే…..

ఏపీలో చూస్తే ఇపుడు బీజేపీ ఏమాత్రం బలంగా లేదు, ఎవరో ఇద్దరు ముగ్గురు నాయకుల చేరిక తప్ప ఆ పార్టీకి పెద్దగా బలం వచ్చినది లేదు. ఫలానా సీటు గెలుస్తామని గట్టిగా చెప్పే పరిస్థితి కూడా లేదు. దాంతో గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి ఇపుడే వెళ్ళి ఏంచేయగలమని ఆలోచిస్తున్నారని అంటున్నారు. అలాగని బీజేపీని తక్కువ అంచనాను కూడా ఆయన వేయడంలేదంటున్నారు. ఆ పార్టీతో మంచి సంబంధాలను ఆయన నెలకొల్పుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, కొన్ని రాష్ట్రాలో ఒక్క ఎమ్మెల్యే బలం కూడా లేకపోయినా రాత్రికి రాత్రి అధికార పార్టీనే కాషాయ దళంగా మార్చిన చరిత్ర బీజేపీకి ఉంది. దీంతో బీజేపీ గేం అన్నది ఎలాగైనా ఉండొచ్చు. అందువల్ల ఆ పార్టీలో బెర్త్ ఉండడం మంచిదన్న ఉద్దేశ్యంతో తాను డైరెక్ట్ గా కాకుండా కుమారుడు రవితేజను బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు పంపిస్తున్నారని టాక్. రవితేజ జయదేవ్ అనే ఓ సినిమాలో హీరో నటించారు. ఆయన మాజీ మంత్రి నారాయణకు అల్లుడు. యువనేతగా గతంలో టీడీపీ భీమిలీ వ్యవహారాలు చూశారు. తాజా ఎన్నికల్లో చోడవరం నుంచి పోటీ చేయలనుకున్నారు కూడా.

టీడీపీలోనే వుంటూ….

ఇక గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే కొనసాగుతారా అంటే గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఆయన అధినేత చంద్రబాబు చెప్పినట్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకోవడంలేదు. అలాగని ఖాళీగా కూర్చోవడం లేదు. తనకు నచ్చినపుడు మీడియా ముందుకు వచ్చి నొప్పించక తానొవ్వక అన్న తీరున కామెంట్స్ చేస్తుంటారు, అదే సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతోనూ సఖ్యత చెడగొట్టుకోవడంలేదు. హాట్ కామెంట్స్ ఎక్కడా చేయడంలేదు. ఏమో ఒకవేళ టీడీపీ మళ్ళీ పుంజుకుంటే అన్న ఆలోచన కూడా గంటా శ్రీనివాసరావుకు ఉంది. అదే టైంలో జగన్ ని కూడా తక్కువ అంచనా వేయడంలేదు. జగన్ చెప్పినట్లుగా కొన్ని టెర్ములు వైసీపీ అధికారం లో ఉన్నా తనకు సేఫ్ గా ఉండే రూట్ నే గంటా శ్రీనివాసరావు ఎంచుకున్నారు. మరో వైపు బీజేపీని అడ్డం పెట్టుకుంటున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు తన కొడుకుని ఆ పార్టీలోకి పంపడం ద్వారా రెండు పడవల మీద కాలు వేస్తున్నారు. లోపాయికారిగా వైసీతో స్నేహం కొనసాగిస్తూ మరో పడవలోనూ కులాసా చేస్తున్నారు. దాంతో దటీజ్ గంటా శ్రీనివాసరావుఅంటున్నారంతా.

Tags:    

Similar News