ఆ డిమాండ్ వెనక….?

విశాఖను ఆర్ధిక రాజధాని చేయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ సర్కార్ ని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిని కొనసాగించాలని ఓ వైపు టీడీపీ అంటూంటే [more]

Update: 2019-09-01 11:00 GMT

విశాఖను ఆర్ధిక రాజధాని చేయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ సర్కార్ ని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిని కొనసాగించాలని ఓ వైపు టీడీపీ అంటూంటే మధ్యలో ఆర్ధిక రాజధాని పేరుతో గంటా శ్రీనివాసరావు చేస్తున్న డిమాండ్ తమ్ముళ్ళకు విస్మయం కలుగచేస్తోంది. విశాఖను ఆయన రాజధాని అని నేరుగా అనకుండా ఆర్ధిక పదాన్ని చేర్చడంతో దీని భావమేంటి అని తలలు పట్టుకుంటున్నారు. విశాఖ విషయంలో అన్ని హంగులు ఉన్నాయని, ఇక్కడ జనం కూడా రాజధాని కావాలని కోరుకుంటున్నారని గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. విశాఖకు రాజధాని అయ్యేందుకు ఉన్న అర్హతలు కూడా గంటా వివరించారు. అయితే విశాఖను రాజధానిగా చేయాలని మాత్రం ఆయన డైరెక్ట్ గా ఎక్కడా చెప్పలేదు.

అపుడేం చేశారో….?

గంటా శ్రీనివాసరావు చంద్రబాబు మంత్రివర్గంలో బలమైన మంత్రిగా ఉన్నారు. ఆయిదేళ్ళ పాటు ఆయన తన మాట చెల్లించుకున్నారు. బాబుకు ఎంతో సన్నిహితుడని కూడా పేరుంది. మరి ఆ సమయంలో గంటా శ్రీనివాసరావు విశాఖను రాజధానిగా చేయమని ఎందుకు చెప్పలేదని అంతా అంటున్నారు. నిజానికి చంద్రబాబు సర్కార్ తొలి సమావేశం విశాఖలోనే నిర్వహించారు. ఆంధ్రా యూనివర్శిటి భవనాల్లో నవ్యాంధ్ర తొలి మంత్రివర్గం జరిగితే అపుడు అంతా విశాఖే రాజధాని అనుకున్నారు. ఇక విశాఖలో ఎన్నో జాతీయ అంతర్జాతీయ సమావేశాలను కూడా టీడీపీ నిర్వహించింది. విశాఖకు అన్ని హంగులూ అపుడూ ఇపుడూ ఉన్నాయి. మరి నాడు నోరు మెదపని గంటా శ్రీనివాసరావు ఇపుడు విశాఖ, ఉత్తరాంధ్ర అంటూ డిమాండ్లు పెట్టడమేంటని కూడా అంటున్నారు. ఆర్ధిక రాజధాని అంటే ఏం చేయాలో కూడా వివరిస్తే బాగుంటుందని కూడా అడుగుతున్నారు.

ఉత్త హామీలేగా…..

గడచిన టీడీపీ హయాంలో విశాఖను ప్రభుత్వం వాడుకుంది కానీ ఈ నగరానికి చేసిందేమీ లేద‌న్న విమర్శలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ సదస్సులకు సరైన వేదిక విశాఖ అని టీడీపీ సర్కార్ గుర్తించింది కానీ దానికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు అభివృధ్ధి చేయలేదని అంటున్నారు. ఐటీ హబ్ గా చేస్తామని చెప్పినా కూడా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదని, పారిశ్రామిక వాడగా రూపకల్పన చెస్తామని చెప్పినా కూడా అది కూడా ఆచరణలో నెరవేరలేదని ప్రజలే గుర్తు చేస్తున్నారు. సినీ రాజధాని, సాంస్క్రుతిక రాజధాని వంటి మాటలను నాడు టీడీపీ మంత్రులు ఎన్నో సార్లు ఉపయోగించారని, కానీ నిధుల వరకూ వచ్చేసరికి ఒక్క పైసా వెచ్చించలేదని, కార్యాచరణ కూడా లేదని అంటున్నారు. ఇపుడు వైసీపీ అధికారంలోకి రాగానే ఆర్ధిక రాజధాని అంటున్నారని, ఇది రాజకీయంగా వ్యూహాత్మక ప్రకటన తప్ప మరేమీ కాదని వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. తాము అధికార వికేంద్రీకరణ చేస్తున్నామని, తప్పకుండా విశాఖకు న్యాయం జరుగుతుందని కూడా అధికార పార్టీ నాయకులు అంటున్నారు. మాజీ అయ్యాక కానీ గంటా శ్రీనివాసరావుకు విశాఖ మీద ప్రేమ పుట్టుకురాలేదని కూడా సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి రాజధాని విషయంలో కొనసాగుతున్న గందరగోళానికి గంటా శ్రీనివాసరావు తాజా డిమాండ్ తొ మరింత అయోమయాన్ని పెంచిందనే అంటున్నారు.

Tags:    

Similar News