గంటా శ్రీనివాసరావు కోసం ఆ మంత్రి రాయబారం

గంటా శ్రీనివాసరావు పదవి లేకుండా ఆయన్ని అసలు వూహించలేరు. ఆయన సైతం బుగ్గ కారుకు బాగా అలవాటు పడ్డారు. ఒకటా రెండా ఏడేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు. [more]

Update: 2019-06-17 08:30 GMT

గంటా శ్రీనివాసరావు పదవి లేకుండా ఆయన్ని అసలు వూహించలేరు. ఆయన సైతం బుగ్గ కారుకు బాగా అలవాటు పడ్డారు. ఒకటా రెండా ఏడేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఒక్కసారిగా మాజీగా అయిపోయారు. ఈ పోరాటాలు, ఉద్యమాలు అసలే అలవాటు లేవు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. యువ నాయకత్వం, జగన్ దూకుడు సరిగ్గా అంచనా వేసిన గంటా టీడీపీలో ఉంటే శాశ్వతంగా ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతామేమోనని బెంగటిల్లుతున్నారు.

మిత్రుడి సాయం :

ఇక గంటా నిన్నటి మిత్రుడు అవంతి శ్రీనివాసరావు వైసీపీలో ఉన్నారు. ఆయనకు జగన్ పెద్ద పీట వేసి మరీ మంత్రి పదవితో గౌరవించారు. విశాఖ నగరంలో వైసీపీని బలోపేతం చేయమన్నారు. సరిగ్గా ఇక్కడే అవంతి చొరవ తీసుకుంటున్నట్లుగా భోగట్టా. గంటా సైతం తన మిత్రుడు అవంతి సహాయం కోరినట్లుగా తెలుస్తోంది. బేషరతుగానే వైసీపీలో చేరేందుకు గంటా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. విశాఖ సిటీలో గంటా లాంటి వారు ఉంటే వైసీపీకి ఎదురు ఉండదని అవంతి ఈసరికే వైసీపీ పెద్దలకు వివరించినట్లుగా తెలుస్తోంది. గంటా అంగబలం, అర్ధబలం కలిస్తే ఇక ఉత్తరాంధ్ర మొత్తం మీద పది కాలల పాటు వైసీపీ గట్టిగా నిలబడుతుందని చెబుతున్నారని టాక్.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా :

గంటా ఓటమి ఎరుగని వీరుడు. ఆయన తాజా ఎన్నికల్లో కూడా విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన ఇప్పటికి అయిదు ఎన్నికలు చూశారు, రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎపుడూ ఓటమి పాలు కాలేదు. దాంతో తాను టీడీపీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అయినా వైసీపీలో చేరేందుకు రెడీ అంటున్నారని టాక్. మళ్ళీ వైసీపీ తరఫున పోటీ చేసినా ఇంతకు ఇంత బంపర్ మెజారిటీతో గెలిచి తీరుతానన్న ధీమాతో ఆయన ఉన్నారని టాక్.

ఇక తనతో పాటు మరికొందరికి వెంటబెట్టుకుని కూడా వచ్చేందుకు గంటా ప్రయంత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గంటా విషయానికి వస్తే జగన్ మీద ఆయన ఇప్పుడు పెద్దగా మాట్లాడడంలేదు. ఓ వైపు అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే మనవడి బర్త్ డే అంటూ ఇంట్లో గడుపుతున్నారంటే ఆయన మనసు ఎంతలా వైసీపీ వైపు వుందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి తొందరలోనే సంచనలమైన సంగతులు విశాఖ రాజకీయాల్లొ నమోదు అవుతాయని అంటున్నారు

Tags:    

Similar News