చిక్కుల్లో శీనన్న….. ఆదుకునేదెవరో…?

పదవీ కాలం ముగిసాక మాజీ అయ్యాక అయ్యవారి అసలు వైభవం చూడమంటారు. అంతవరకూ ఎదురుపడితే కొట్టే సలాములు ఎన్నో. ఇచ్చే కితాబులు మరెన్నో. కానీ ఒక్కసారి కుర్చీ [more]

Update: 2020-11-12 15:30 GMT

పదవీ కాలం ముగిసాక మాజీ అయ్యాక అయ్యవారి అసలు వైభవం చూడమంటారు. అంతవరకూ ఎదురుపడితే కొట్టే సలాములు ఎన్నో. ఇచ్చే కితాబులు మరెన్నో. కానీ ఒక్కసారి కుర్చీ కిందకు జారితే మాత్రం అసలు పట్టించుకోరు అంతే. ఇపుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదే అనుభవిస్తున్నారు. ఆయనకు అన్ని వైపుల నుంచి వరసగా ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. గంటా రాజకీయంగా దెబ్బ తిన్నారు, ఇపుడు ఆర్ధికంగా కూడా చిక్కులు వస్తున్నాయి. ఆయన ఆస్తులను నడి రోడ్డు మీద వేలానికి పెట్టేశారు. అంటే ఆయన పరువు కూడా బజారున పడిందని అర్ధమే కదా.

మొదట వ్యాపారిగానే…?

గంటా విశాఖలో మొదట వచ్చింది ఒక చిరుద్యోగిగా. ఆయన మీడియా సంస్థలో పనిచేశారు. ఆ తరువాత ఆయన వ్యాపారంలోకి దిగారు. ప్రత్యూష పేరిట ఒక సంస్థను ప్రారంభించి తొలి అడుగులు వేశారు. ఇదంతా ముప్పయేళ్ళ క్రితం మాట. ఆ విధంగా ఆయన చకచకా త్వరగా ఎదిగారు. రాజకీయ నేతలతో పరిచయాలు అయ్యాయి. అలా అప్పటి సీనియర్ నేత, అనాటి మంత్రి అయ్యన్నపాత్రుడితో స్నేహం కుదిరి చివరికి రెండు దశాబ్దాల క్రితం టీడీపీ టికెట్ సంపాదించారు. ఎంపీగా అనకాపల్లి నుంచి గెలిచారు. ఆ తరువాత గంటా శ్రీనివాసరావు రాజకీయం చాలా దూకుడుగా ముందుకే సాగింది

సంబంధం లేదన్నా…?

తనకు అచ్చి వచ్చిన ఇంతటి అందలాలు అందించిన ప్రత్యూష సంస్థతో తనకు ఇపుడు సంబంధం లేదని గంటా శ్రీనివాసరావు అనవచ్చు కానీ ఎవరూ మాత్రం అలా అనలేరు, గంటాను ఆ సంస్థతో విడదీయలేరు. అది వ్యాపారపరంగా సాంకేతిక అంశంగానే చూస్తారు. ఇక గంటా బంధువులు ఆ సంస్థలను చూసుకుంటున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చేశాను కాబట్టి ఆ లావాదేవీలు తనకు సంబంధం లేదని ఆయన చెప్పుకున్నా అది కుదిరే పని కాదు. గంటా శ్రీనివాసరావు రాజకీయ పలుకుబడితో మరింత ఎత్తుకు ఎదిగిన ఆ సంస్థ ఇపుడు ఇబ్బందుల్లో ఉంటే ఆ మరకలు కూడా అంటించుకోవాల్సిందే. ఇదే ప్రత్యూష సంస్థ కోసం కాంగ్రెస్ మంత్రిగా గంటా విశాఖ గ్రంధాలయ‌ భూములను లీజు మీద తీసుకున్న సంగతిని కూడా అంతా గుర్తు చేస్తున్నారు.

అదే జరిగితే…?

ఇండియన్ బ్యాంక్ గంటా ఆస్తులను వేలానికి ప్రకటించింది.అవి విశాఖ నలుమూలలా ఉన్న భవనాలు, భూములు ఇంకా విలువైనవి. వాటిని కుదువ పెట్టి 248 కోట్ల దాకా గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష సంస్థ రుణాలు తీసుకుంది. ఇక ఆ రుణాలకు భారీ ఎత్తున వడ్డీలు పెరిగాయి. అసలు కూడా తీర్చలేదు. దాంతో ఇపుడు తడిసి మోపెడు అయింది. ఈ ఆక్షన్ విధానంలో ఈ ఆస్తులను ఈ నెల 25న అమ్మేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి నాలుగేళ్ళ క్రితమే డిమాండ్ నోటీసులు పంపి ఆ తరువాత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంక్ కి వాటిని వేలం వేయడం చిటికలో పని. మరి ఈ మధ్యలో ఏమైనా అద్భుతాలు జరిగి ఈ ఆక్షన్ ఆగుతుందా లేక అమ్మకానికి అవి వెళ్ళిపోతాయా అన్నది చూడాలి. అదే జరిగితే గంటా పరువు ప్రతిష్టలకు తీరని భంగమే వాటిల్లుతుంది. రాజకీయంగా కూడా అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. మరి టీడీపీకి వైసీపీకి పొలిటికల్ గా కూడా చెడిన స్థితిలో శీనన్న ఉన్నారని కూడ అనుచరులే చెబుతున్నారు

Tags:    

Similar News