గన్నవరం…. అనుకోని వరమేనా?

గన్నవరం…ఇపుడు ఏపీలో హాట్ టాపిక్. పసుపు పారాణి ఇంకా ఆరకమునుపే తుడిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ పొలిటికల్ సీన్ లో కనిపిస్తున్నారు. ఎన్నికలు జరిగి నిండా [more]

Update: 2019-10-29 08:00 GMT

గన్నవరం…ఇపుడు ఏపీలో హాట్ టాపిక్. పసుపు పారాణి ఇంకా ఆరకమునుపే తుడిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ పొలిటికల్ సీన్ లో కనిపిస్తున్నారు. ఎన్నికలు జరిగి నిండా ఆరు నెలలు కాలేదు, అపుడే రాజీనామా అంటున్నారాయన. కారణాలు ఏవైనా ఇంత తొందరగా ఎన్నికలు రావడం అంటే విడ్డూరమే. సరే ఏపీలో 151 సీట్లతో వైసీపీ పూర్తి కంఫర్ట్ గా ఉంది. ఆ పార్టీకి ఈ రాజీనామా వల్ల వచ్చేది ఏమైనా ఉండాలి తప్ప పోయేది లేదు. కేవలం 23 సీట్లలో మాత్రమే గెలిచిన టీడీపీ సంచికే చిల్లు పడుతుంది. అందువల్ల వల్లభనేని వంశీ రాజీనామాను వెనక్కు తీసుకుంటే మేలు. అలా కాకపోతే మాత్రం ఉప ఎన్నికలు దూసుకువచ్చేస్తాయి. అలా కనుక వస్తే అది ఏపీ రాజకీయాల్లో అన్ని పార్టీల బలాబలాలను తేల్చేస్తుంది. ముఖ్యంగా జగన్ ని ఎన్నుకుని జనం తప్పు చేశామని బాధ పడుతున్నారని అంటున్న చంద్రబాబు మాటకు ఉన్న విలువ ఏంటో తెలియచెబుతుంది. మరో వైపు అదృష్టవశాత్తు వైసీపీ గెలిచిందని సెటైర్లు వేస్తున్న జనసేనకు కూడా వాస్తవం ఏంటో చూపిస్తుంది. జగన్ ముప్పయేళ్ళ సీఎం అని ధీమా పడుతున్న అధికార పార్టీకి అసలైన లెక్కలు చెబుతుంది.

పవన్ కి గోల్డెన్ చాన్స్……

గన్నవరం ఉప ఎన్నిక కనుక జరిగితే మాత్రం జనసేనానికి బంగారు లాంటి అవకాశం అంటున్నారు. ఎందుకంటే ఏ పదవి లేకుండా ఉన్న పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి వస్తే ఆయన పార్టీ మళ్ళీ సేఫ్ పొజిషన్లోకి వచ్చేస్తుందని అంటున్నారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలు అయి పరాభవంతో ఉన్న పవన్ కి గన్నవరం రూపంలో వరమే అందినట్లు అంటున్నారు. పవన్ తన పార్టీకి జనంలో బలం ఉందని పదే పదే చెప్పుకుంటారు. పైగా వైసీపీ సర్కార్ పూర్తిగా జన విశ్వాసం కోల్పోయిందని కూడా వాదిస్తుంటారు. దాన్ని నిరూపించుకోవాలంటే తప్పకుండా పవన్ పోటీ చేయాల్సివుంటుంది. అంతే కాదు, టీడీపీతో ఎటువంటి లాలూచీ లేదని చెప్పుకోవడానికైనా ఈ పోటీ పవన్ కి అవసరం. మరి పవన్ గన్నవరం విషయంలో ఆలోచన చేస్తారా..చూడాలి.

చినబాబుకు మరో చాన్స్ ….

ఇక మంగళగిరి తిరునాళ్ళకు పోయి సొమ్ములు మొత్తం పోగొట్టుకున్న అమాయక ముత్తయిదువ మాదిరిగా వైసీపీ చేతిలో చినబాబు దారుణమైన పరాజయాన్ని పొందారు. ఆ అవమానం అలా ఉండగానే ఇపుడు గన్నవరం ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా టీడీపీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలో సీటు ఇది. టీడీపీ సామాజికవర్గం అధిక సంఖ్యలో ఉన్న సీటు. వైసీపీ మీద జనంలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని నిరూపించడానికి, తాను అసెంబ్లీలో అడుగుపెట్టి పాత పరాభవం రూపుమాపుకోవడానికి లోకేష్ కి గన్నవరం నిజంగా అనుకోని వరమే అవుతుందని అంటున్నారు. వంశీ ఎపిసోడ్ టీ కప్పులో తుపాను గా సమసిపోకపోతే వైసీపీతో సహా అన్ని పార్టీలకు అగ్ని పరీక్షగా కూడా ఇదే సీటు మారిపోయే ప్రమాదం ఉంది. మరి గన్నవరం తనకు శాపం అంటూ దూరంగా జరిగిన వంశీ ఒక వైపు ఉంటే ఇదే సీటు ఎవరికి వరం అవుతుందో చూడాల్సివుంది.

Tags:    

Similar News