గల్లా ఎఫెక్ట్ తాకిందా …?

అజాత శత్రువుగా సినీరంగంలో వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు పై జీఎస్టీ ఎగవేత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు సినిమాలకు విడతీయరాని అనుబంధం దేశవ్యాప్తంగా [more]

Update: 2018-12-29 05:00 GMT

అజాత శత్రువుగా సినీరంగంలో వెలుగొందుతున్న ప్రిన్స్ మహేష్ బాబు పై జీఎస్టీ ఎగవేత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు సినిమాలకు విడతీయరాని అనుబంధం దేశవ్యాప్తంగా వుంది. మరీ ముఖ్యంగా దక్షిణాది తారలు రాజకీయం వైపు చూపు చూడకపోవటానికి ఆర్ధిక మూలాలు దెబ్బతినకుండా ఉండేందుకే అన్నది అందరికి తెలిసిందే. ఏదో ఒక జాతీయ ప్రాంతీయ పార్టీతో అనుబంధం కొందరు కొనసాగిస్తూ వస్తే మరికొందరు ఏ ఒక్కరితో ఇబ్బంది రాకుండా అన్ని పార్టీలతో సఖ్యతగా సాగిపోవడం కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణాది రాజకీయాల్లో సినిప్రభావం ఉన్నంతగా ఉత్తరాదిన కనిపించదు.

అమితాబ్ దెబ్బవ్వడంతో …

అమితాబ్ వంటి సూపర్ స్టార్ లు రాజకీయంగా రాణించకపోవడంతో సినీ స్టార్ లు ఎవ్వరు అటువైపు చూసేది బహుఅరుదు. శత్రుఘ్న సిన్హా, హేమ మాలిని వంటివారు ఒకరిద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే జయ బాదురి, రేఖ వంటి స్టార్స్ కి రాజ్యసభ లో ఎంపీలుగా ఎంపికయి ఆయా పార్టీలకు బ్రాండ్ గా మెలుగుతూ వచ్చారు. అదే దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక, ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రేంజ్ లో ఉన్నవారంతా తమ ఆస్తులు కాపాడుకోవడానికి ఎదో ఒక పార్టీ గొడుగు కిందకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేరుతూ వుంటారు. అలా చేరినవారిపై కూడా ఒక్కోసారి ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టిన సందర్భాలు వున్నాయి. అయితే కేంద్రంలోని అధికారంలో వున్న పార్టీ ఆశీస్సులు వున్న తారల జోలికి సర్వసాధారణంగా సంబంధిత శాఖలు కన్నెత్తి చూడటం బహుఅరుదు. గతంలో పీఆర్పీ స్థాపించినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన బంధువులపై దాడులు జరిగిన సందర్భాలు వున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వంటివారు అధికారంలో వున్నవారికి విధేయంగా ఉండటం వెనుక తాజాగా పార్టీ స్థాపనకు అడుగులు వేయడం వెనుక ఇలాంటి కారణాలే అధికం.

సినీ పరిశ్రమలో ప్రవహించేది ఆ డబ్బే …

సినీ పరిశ్రమలో చాలా భాగం ప్రవహించేది నల్లధనమన్నది ఆర్ధిక వేత్తలు చెప్పే మాట. నిర్మాత స్టార్ లకు చెల్లించే పారితోషికాలు సగానికి పైగా బ్లాక్ లోనే చెల్లించబడతాయన్నది పబ్లిక్ టాక్. అందుకే సినీ స్టార్స్ ఐటి కి భయపడినట్లు ఎవ్వరికి భయపడరు. సావిత్రి లాంటి మహానటి కూడా ఐటి దెబ్బకు ఆస్తులు హరించుకుపోయి వీధిన పడటంలో ఒక కారణంగా ఇప్పటికి చెప్పుకుంటారు. గతంలో టి సర్కార్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఆక్రమణ అంటూ హడావిడి చేస్తే మొత్తం సినీపరిశ్రమ కిమ్మనకుండా కేసీఆర్ కు జై కొట్టే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇదే దెబ్బ ముందుగా ప్రిన్స్ కి రుచి చూపించి వచ్చే ఎన్నికల్లో స్టార్స్ తోక జాడిస్తే పరిణామాలు ఇలా వుంటాయని చెప్పేందుకే మహేష్ బ్యాంక్ అకౌంట్లు సీజ్ కి ఒక కారణంగా విశ్లేషకులు లెక్కేస్తున్నారు.

టార్గెట్ లో వున్న గల్లా టీం …?

పార్లమెంట్ లో గళం వినిపించిన నాటినుంచి గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ టార్గెట్ అవుతారని అంతా లెక్కశారు. రాజ్యసభ ఎంపిలు సీఎంరమేష్, సుజనా చౌదరి లు ఇప్పటికే దాడులకు గురైన వారిలో ఉండగా మిగిలిన వారు వారి బంధువుల వ్యాపారాలపై దృష్టి సారించాయి కేంద్ర బృందాలు. ప్రిన్స్ మహేష్ బాబు, గల్లా జయదేవ్ లు బంధుత్వం రీత్యా బావా బామ్మర్దులు. తన బామ్మర్ది నటించిన భరత్ అనే నేను చిత్రంలోని డైలాగ్ తోనే జయదేవ్ పార్లమెంట్ లో ఎన్డీయే సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పై ప్రసంగం మొదలు పెట్టి ఆకట్టుకున్నారు. ఒక నేత వాగ్దానం చేస్తే అది అమలు చేసేవాడే లీడర్ గా గల్లా తన ప్రసంగంలో మోడీని వేలెత్తి చూపేలా కించపరిచారు కూడా.

సినీస్టార్స్ నిజాయతీ ప్రజలకు చుపించాలనేనా …?

సినిమాల్లో చూపించే నిజాయితీకి నిజ జీవితంలో స్టార్స్ చూపే నిజాయితీకి తేడా చూపించాలనే మహేష్ తప్పులను జల్లెడ పట్టి ఒక దెబ్బ కొట్టారని ఇప్పుడు టాలీవుడ్ టాక్. వాస్తవంగా సూపర్ స్టార్ కృష్ణ రాజీవ్ గాంధీ తో వున్న సాన్నిహిత్యం కారణంగా 1989లో రాజకీయాల్లో ప్రవేశించి ఏలూరు ఎంపి గా గెలిచి ఎన్టీఆర్ కు సినీ పరిశ్రమ నుంచి ఎదురు నిలిచిన హీరో గా గుర్తింపు పొందారు. 1991 తరువాత రాజీవ్ మరణం కృష్ణ ను రాజకీయాలకు దూరంచేసేలా చేసింది. ఆ తరువాత మహేష్ సైతం ఏ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా ఎక్కడా ఉండకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అయితే టిడిపి, కాంగ్రెస్ లతో కృష్ణ ఆయన బంధువులకు వున్న సాన్నిహిత్యం రీత్యా తమ దెబ్బ రుచి చూపించాలనే మహేష్ కు చిన్న స్ట్రోక్ కేంద్రం ఆదేశాలపై వచ్చి ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

మహేష్ ది శాంపిల్ మాత్రమేనా …?

ప్రస్తుతానికి ఈ కేసును న్యాయపరంగా మహేష్ బాబు ఎదుర్కొన్నా ఇండస్ట్రీ లోని మిగిలిన వారు తమ తప్పులు దాచుకుని తమ కుర్చీలకు ఎసరు తేకుండా ఉండేందుకు ఇలాంటి దాడులు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ఇటీవల సినీనటుడు శివాజీ కూడా రెచ్చిపోయి బిజెపిపై విమర్శల దాడి సాగించి జగన్ పై కత్తి దాడి తరువాత పత్తా లేకుండా పోయారు. ఆయన స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజ టిడిపి అనుకూల, బిజెపి వ్యతిరేక వైఖరి తో సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇలాంటి వారందరి నోళ్లు వీలైనంత మూయించాలంటే మహేష్ వంటి పెద్ద స్టార్ కే షాక్ ఇవ్వాలన్న లెక్కల్లోనే ఇదంతా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. వచ్చేది ఎన్నికల సంగ్రామం కావడంతో దక్షిణాదిలో సినీస్టార్స్ కి కష్టకాలం దాపురించినట్లేనని అంచనా వేస్తున్నారు మరికొందరు. మొత్తానికి మహేష్ జీఎస్టీ ఎగవేత కేసు ద్వారా చిత్ర సీమలో అలజడి మాత్రం పెద్ద ఎత్తునే బయల్దేరింది. చూడాలి ఇంకెంతమందిపై పాతకేసులు బయటకు వస్తాయో.

Tags:    

Similar News