అప్పటి నుంచే గల్లా యాక్టివిటీని తగ్గించారా?

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమి పాలయినా తర్వాత గెలుపు కోసం నిరంతరం ప్రయత్నించాలి. అలాగే గెలిచిన వాళ్లు సయితం రెండోసారి నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలి. అయితే తెలుగుదేశం [more]

Update: 2021-01-24 05:00 GMT

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమి పాలయినా తర్వాత గెలుపు కోసం నిరంతరం ప్రయత్నించాలి. అలాగే గెలిచిన వాళ్లు సయితం రెండోసారి నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలి. అయితే తెలుగుదేశం పార్టీలో ఈ రెండు కన్పించడం లేదు. గెలిచిన వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు. ఇక గత ఎన్నికల్లో ఓటమి పాలయిన వాళ్ల పరిస్థితి చెప్పనవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు.

కొద్ది నెలలుగా…..

వారిలో యాక్టివ్ గా ఉన్నది కేవలం కొద్ది మంది మాత్రమే. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని హితబోధలు చేస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ గత కొద్ది నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో తప్పించి గల్లా జయదేవ్ మరే సమయంలో కన్పించరన్న విమర్శలున్నాయి.

కీలక సమయాల్లోనూ…

గల్లా జయదేవ్ చిత్తూరు జిల్లా వాసి అయినా గుంటూరు ప్రజలు రెండు సార్లు విజయాన్ని అందించారు. అయితే ఆయన రెండోసారి గెలిచినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలను పీఏకు అప్పగించి వెళ్లారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇక రాజకీయంగా ఆంధ్ర్ర్రప్రదేశ్ హాట్ హాట్ గా ఉన్నప్పటికీ గల్లా జయదేవ్ మాత్రం కన్పించడం లేదు. ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలకు కూడా గల్లా జయదేవ్ డుమ్మా కొట్టడం పార్టీలోనే చర్చనీయాంశమైంది.

అప్పటి నుంచే…..?

గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన కంపెనీ భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకున్నప్పటి నుంచి ఆయన యాక్టివిటీ తగ్గిందంటున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీనిపై స్టే తెచ్చుకున్నా, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు గల్లా జయదేవ్ అప్పటి నుంచే దూరంగా ఉంటున్నారన్న టాక్ నడుస్తుంది. అయితే గల్లా జయదేవ్ విదేశాల్లో ఉన్నారని ఆయన సన్నిహతులు చెబుతున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో గల్లా జయదేవ్ మళ్లీ వస్తారని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఆశతో ఉన్నారు.

Tags:    

Similar News