గ‌ల్లా కుటుంబానికి రెండు ప‌ద‌వుల వెనుక వ్యూహం?

ఏపీ టీడీపీలో చిత్రం చోటు చేసుకుంది. పార్టీలోను, పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలోనూ ప‌ద‌వులు క్రియేట్ చేసి.. అసంతృప్తుల‌ను సంతృప్తి ప‌రిచేందుకు టీడీపీ అదినేత చంద్రబాబు ప్రయ‌త్నించారు. చాలా [more]

Update: 2020-10-29 08:00 GMT

ఏపీ టీడీపీలో చిత్రం చోటు చేసుకుంది. పార్టీలోను, పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలోనూ ప‌ద‌వులు క్రియేట్ చేసి.. అసంతృప్తుల‌ను సంతృప్తి ప‌రిచేందుకు టీడీపీ అదినేత చంద్రబాబు ప్రయ‌త్నించారు. చాలా మంది నేత‌ల‌కు ప‌ద‌వులు ఇచ్చారు. అనేక మందిని పిలిచి మ‌రీ ప‌గ్గాలు అప్పగించారు. అయితే.. అదే స‌మ‌యంలో ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్న చాలా మంది నేత‌ల‌కు మాత్రం మొండి చేయి చూపించారు. మ‌రి ప‌ద‌వులు లేక పోవ‌డ‌మే కార‌ణ‌మా ? లేక‌.. ప‌ద‌వులు ఉండీ కూడా వారికి ఇవ్వక‌పోవ‌డ‌మే కార‌ణమా ? ఈ విష‌యంలో ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ఒకే కుటుంబానికి రెండే ప‌ద‌వులు ఇచ్చిన విష‌యంపై మాత్రం చ‌ర్చ సాగుతోంది.

కష్టపడుతున్నారు కనుకే…..

రెండేసి ప‌ద‌వులు పొందిన వారిలో కింజ‌రాపు కుటుంబం ఒక‌టైతే.. గ‌ల్లా ఫ్యామిలీ రెండోది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజ‌రాపు అచ్చెన్నాయుడు, ఆయ‌న అన్న కుమారుడు ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. అచ్చెన్నాయుడును ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేశారు. అదే స‌మ‌యంలో రామ్మోహ‌న్‌ను.. జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా ఎన్నుకున్నారు. ఈ ఇద్దరి విష‌యంలోను, ఈ కుటుంబానికి రెండు ప‌ద‌వులు ఇచ్చిన విష‌యంలో ఎక్కడా వివాదం లేదు. దీని వెనుక వ్యూహం కూడా లేదు. ఇద్దరూ క‌ష్ట‌ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని విజ‌యం సాధించారు. సో.. ఇచ్చారంటే.. అర్ధం ఉంది.

వద్దన్న వారికి…..

పైగా ఇటీవ‌ల అచ్చెన్న అరెస్టు నేప‌థ్యంలో ఆయ‌న‌కు ప‌ద‌వి ఇవ్వడం… పార్టీలో సానుభూతి ఒక ఎత్తు అయితే బ‌ల‌మైన వాయిస్ వినిపించే బీసీ నేత కావ‌డం కూడా మ‌రో ఎత్తు. మ‌రి గ‌ల్లా ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఈ ఫార్ములా తిర‌గ‌దిప్పింది. గుంటూరు ఎంపీగా యాక్టివ్‌గా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్‌కు పొలిట్‌బ్యూరోలో అవ‌కాశం ఇచ్చారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌డం లేదు. ఆయ‌న లాంటి వారి అవ‌స‌ర‌మే. కానీ, అదే స‌మ‌యంలో ఆయ‌న మాతృమూర్తి, మాజీ మంత్రి.. గ‌ల్లా అరుణ కుమారికి కూడా ప‌ద‌వి ఇవ్వడమే చ‌ర్చనీయాంశంగా మారింది. ఓ ప‌దిహేను రోజుల కింద‌ట‌.. త‌న‌కున్న పార్టీ ప‌ద‌వినే వ‌దులుకున్నారు. “సార్‌నేను ప‌ద‌విలో కొన‌సాగ‌లేను. నాకు ఆరోగ్యం బాగోడం లేదు“ అని తప్పుకొన్నారు. అలాంటి అరుణను తీసుకువ‌చ్చి.. ఇప్పుడు మ‌ళ్లీ పార్టీ ప‌ద‌విని క‌ట్టబెట్టారు.

అదే ప్లాన్ అటగా…..

దీంతో ఆమె త‌న‌కు బాగోలేద‌ని తెలిపినా.. ప‌ద‌వి ఎందుకు ఇచ్చార‌నేది కీల‌క అంశంగా మారింది. దీనికి ఇప్పుడు క‌నిపిస్తున్న ప్రధాన కార‌ణం.. గ‌ల్లా కుటుంబానికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కుటుంబానికి మ‌ధ్య సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును త‌న పార్టీకి అనుకూలంగా చేసుకునే ప్రణాళిక అయినా ఉండి ఉండొచ్చు… లేదా మ‌హేష్ అభిమానుల్లో చాలా మంది గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి జ‌గ‌న్‌కు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే వీరిని పార్టీ వైపున‌కు తిప్పుకునే ప్లాన్ అయినా అయి ఉండొచ్చంటున్నారు.

మెట్టు దిగి వచ్చి…..

అదే స‌మ‌యంలో ఇటీవ‌ల గ‌ల్లా బాబుపై బెదిరింపు ధోర‌ణితో వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌. క‌మ్మ వ‌ర్గం ఎంపీ.. పైగా ఇప్పటికే విజ‌య‌వాడ ఎంపీ నానితో బాబుకు ఇబ్బందులు త‌ప్పడం లేదు. ఇప్పుడు మ‌ళ్లీ త‌న క‌మ్మ వ‌ర్గానికే చెందిన రెండో ఎంపీ గ‌ల్లా కూడా ఓపెన్‌గా ఫైర్ అయితే బాబుకు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పవు. పైగా ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డంతో పార్టీకి ఫండింగ్‌కు ఇబ్బంది ఉండదు. ఇవ‌న్నీ ఆలోచించే గ‌ల్లా ఫ్యామిలీ విష‌యంలో బాబు ఒక మెట్టు దిగి వ‌చ్చార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News