గ‌ద్దె పట్టు జారి కోల్పోతున్నారా?

ఏపీలో ఇప్పుడు టీడీపీకి మిగిలిన వాళ్లే 18 మంది ఎమ్మెల్యేలు. న‌లుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే గోడ దూక‌గా మిగిలిన వారిలో కొంద‌రు పార్టీతో అంటీ ముట్టన‌ట్టు ఉంటున్నారు. [more]

Update: 2020-11-19 15:30 GMT

ఏపీలో ఇప్పుడు టీడీపీకి మిగిలిన వాళ్లే 18 మంది ఎమ్మెల్యేలు. న‌లుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే గోడ దూక‌గా మిగిలిన వారిలో కొంద‌రు పార్టీతో అంటీ ముట్టన‌ట్టు ఉంటున్నారు. మ‌రికొంద‌రు ఎప్పుడు గోడ దూకాలా ? అని కాచుకుని ఉన్నారు. ఇక కొంద‌రు ఎమ్మెల్యేలు ఇంటిపోరుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. చాలా స్ట్రాంగ్ అనుకున్న నేత‌లు కూడా రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ్రిప్ కోల్పోతున్నారు. ఈ లిస్టులో సీనియ‌ర్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కూడా చేరిపోయారు. వివాదాల‌కు దూరంగా ఉండే గ‌ద్దె ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఒంట‌రి అయిపోయారు. గత ఎన్నిక‌ల్లో గ‌ద్దె రామ్మోహ‌న్ తో పాటు గెలిచిన రెండో ఎమ్మెల్యే వంశీ వైసీపీకి చేరువ కాగా.. ఎంపీ కేశినేనితో గ‌ద్దెకు పొస‌గ‌ట్లేదు. ఇక దేవినేని ఉమ లాంటి వాళ్లతో ఆయ‌న‌కు ద‌శాబ్దాల వైరం.

అందుకే గెలిచినా…..

గ‌ద్దె రామ్మోహ‌న్ ఎవ‌రి విష‌యాల్లో త‌ల‌దూర్చక‌పోయినా.. అనేక కార‌ణాల వ‌ల్ల ఆయ‌న‌కు జిల్లా పార్టీలోనే కాకుండా.. అటు రాష్ట్ర పార్టీలోనూ చాలా మంది కీల‌క నేత‌ల‌తో తెలియ‌ని గ్యాప్ పెరుగుతూ వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తూర్పులోనే ఆయ‌న ప‌ట్టు కోల్పోతున్న ప‌రిస్థితి. 1999లో విజ‌య‌వాడ ఎంపీగా గెలిచిన ఆయ‌న 2004లో కంకిపాడులో, 2009లో విజ‌య‌వాడ తూర్పులో ఓడిపోయారు. ఎట్టకేల‌కు 2014లో వంగ‌వీటి రాధాను ఓడించి ఇర‌వై ఏళ్ల త‌ర్వాత ఆయ‌న అసెంబ్లీ మెట్లెక్కారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో బొప్పన భ‌వ‌కుమార్ స‌రైన క్యాండెట్ కాక‌పోవ‌డంతో గ‌ద్దె గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కే అయ్యింది.

దూరమయిన క్యాడర్……

వైసీపీ అధికారంలోకి రావ‌డం.. అటు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీలో స‌మీక‌ర‌ణ‌లు మార‌డంతో గ‌ద్దె రామ్మోహ‌న్ అధికార ప‌క్షానికి బాగా టార్గెట్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాల‌ని జ‌గ‌న్ యువ‌నేత దేవినేని అవినాష్‌ను పార్టీలో చేర్చుకున్న వెంట‌నే తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు అప్పగించారు. ఓ వైపు అవినాష్ దూకుడుతో టీడీపీ కేడ‌ర్‌లో చాలా మంది గద్దెకు దూర‌మయ్యారు. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత‌ల‌ను కూడా అధికారంలో ఉండ‌గా గ‌ద్దె రామ్మోహ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డం… అటు నెహ్రూ పాత అనుచ‌రులంతా ఇప్పుడు అవినాష్‌కు ద‌గ్గర‌వుతున్నారు.

సొంత పార్టీ నుంచే…..

ఇక తూర్పు టీడీపీలో గ్రూపుల గోల గ‌ద్దె రామ్మోహ‌న్ కు త‌ల‌నొప్పిగా మారింది. మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీథ‌ర్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై ఆయ‌న మేయ‌ర్‌గా ఉన్నప్పటి నుంచే క‌న్నేసి కాచుకుని ఉన్నారు. ఇక ఎంపీ కేశినేని నానికి గ‌ద్దె రామ్మోహ‌న్ కు కూడా రోజు రోజుకు గ్యాప్ పెరుగుతోంది. గ‌ద్దె త‌న భార్య, మాజీ జ‌డ్పీచైర్మన్ గ‌ద్దె అనూరాధ‌ను మేయ‌ర్‌గా దింపాల‌ని చూసినా ఎంపీ కేశినేని రంగంలోకి దిగి అధిష్టానంపై ఒత్తిడి చేసి త‌న కుమార్తెకే మేయ‌ర్ పీఠం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అక్కడ కూడా గ‌ద్దె మాట చెల్లుబాటు కాలేదు.

ఎప్పటి నుంచో అనుచరులుగా…..

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో కూడా గ‌ద్దె రామ్మోహ‌న్ ను అభాసుపాలు చేసేందుకు టీడీపీలోనే ఓ వ‌ర్గం చ‌క్రం తిప్పుతూ అవినాష్‌కు స‌హ‌క‌రిస్తోంద‌ట‌. ఇక గ‌ద్దెకు ఎప్పటి నుంచో అనుచ‌రులుగా ఉన్న వారు సైతం పార్టీ అధికారంలో ఉండ‌గా ఆయ‌న ప‌క్కన పెట్టడంతో ఇప్పుడు వారంతా ప‌నుల కోస‌మో.. ఇత‌ర‌త్రా ప్రలోభాల కోస‌మో అవినాష్ చెంత చేరిపోతున్నారు. ఏదేమైనా రెండుసార్లు గెలిచి స‌త్తా చాటినా గ‌ద్దెకు ఇప్పుడు తూర్పులో అటు అధికార‌ప‌క్షమే కాకుండా.. ఇటు ప్రతిప‌క్షం నుంచి కూడా మ‌ద్దెల ద‌రువు త‌ప్పడం లేదు.

Tags:    

Similar News