బిజినెస్ లే వీళ్ల వీక్ నెస్ లు… అందుకే అలా?

వ్యాపారాలు ఉన్న వాళ్లు రాజకీయాలకు పనికొస్తారా? వ్యాపారాల వల్లనే పార్టీకి దూరంగా ఉంటున్నారా? ఇదే తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం [more]

Update: 2020-08-28 08:00 GMT

వ్యాపారాలు ఉన్న వాళ్లు రాజకీయాలకు పనికొస్తారా? వ్యాపారాల వల్లనే పార్టీకి దూరంగా ఉంటున్నారా? ఇదే తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయి పథ్నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా పార్టీ నేతలు యాక్టివ్ కాలేదు. ఇటు పార్టీని వీడరు. అటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు నేతలను ఉత్తేజపరుస్తున్నా ఫలితం లేదు. ఇందుకు నేతలకున్న వ్యాపారాలే కారణాలని నేరుగా వారు చెప్పకున్నా తమ మౌనాన్ని అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

అందరికీ వ్యాపారాలు…..

ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీల నేతలకు వ్యాపారాలున్నాయి. కొందరికి పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారాలుండగా, మరికొందరికి ఆంధ్రప్రదేశ్ లోనే వ్యాపారాలున్నాయి. ఇందులో విద్యాసంస్థలు నెలకొల్పి వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. వారిలో ముఖ్యులు మాజీ మంత్రి నారాయణ ఒకరు. నారాయణ విద్యాసంస్థలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి. జగన్ ప్రభుత్వం వ్యాపారాలపై కన్ను వేయడంతో నారాయణ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

పల్లె రఘునాధరెడ్డి సయితం….

ఇక మరో మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఆయనకు అనంతపురం జిల్లాలో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. అందుకే పల్లె రఘునాధరెడ్డి తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయిన నాటి నుంచి పత్తా లేకుండా పోయారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పార్టీ యాక్టివిటీస్ ను కూడా పల్లె రఘునాధరెడ్డి పట్టించుకోవడం లేదు. దీనికి సమాధానం ఆయన విద్యా వ్యాపారాలేనన్నది సన్నిహితుల నుంచి వస్తున్న ఆన్సర్.

వ్యాపారాలు లేని వారికి…..

ఈ ఇద్దరు మాజీ మంత్రులు పార్టీకి దూరం కావడానికి వారికున్న వ్యాపారాలే కారణమని తెలుగుదేశం పార్టీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. అందుకే వ్యాపారాలు లేని వారినే నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరు పార్టీ పటిష్టతపై కాకుండా వ్యాపార ప్రయోజనాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఇకపై నేతల ఎంపిక వ్యాపారాలతో సంబంధం లేకుండా జరగాలని ఎక్కువ మంది నేతలు కోరుకుంటున్నారు. మరి అది సాధ్యమేనా? అన్న ప్రశ్నకు కష్టం అన్న సమాధానమే వస్తుంది.

Tags:    

Similar News