నలుదిక్కులూ..వారేనా...??

Update: 2018-11-24 14:30 GMT

ప్రజాకూటమిగా పేరు మార్చుకున్న మహాకూటమి, తెలంగాణ రాష్ట్రసమితి ప్రధాన పోటీదారులుగా అసెంబ్లీ బరిలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తలపడబోతున్నాయి. హైదరాబాదు పాత బస్తీ పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాలు మినహా రాష్ట్రమంతా అదే పరిస్థితి కనిపించబోతోంది. టీఆర్ఎస్ బలహీనమైన క్యాండిడేట్లను బరిలోకి దించి బీజేపీకి కొంత వెసులుబాటు కల్పించాలని భావించిన నియోజకవర్గాల్లో మాత్రం కొంత విరుద్ధమైన వాతావరణం నెలకొంటోంది. రాష్ట్రంలో అటువంటి స్థానాలు నాలుగైదుకు మించి లేవు. అటువంటి చోట్ల బీజేపీ వర్సస్ కూటమి అభ్యర్థులు హోరాహోరీగా తలపడనున్నారు. ముందుగానే ప్రచారంలోకి దిగిన టీఆర్ఎస్ అధినాయకత్వం తాజాగా తమ వ్యూహాలను ఫైన్ ట్యూన్ చేస్తోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా కుటుంబసభ్యులు నలుగురూ ఈ ఎన్నికల్లో కీలకం. కేసీఆర్ తోపాటు హరీశ్, కేటీఆర్, కవిత ప్రచార రథాన్ని పరుగులు తీయిస్తున్నారు. విమర్శలు మొదలు ఎత్తుగడల వరకూ పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో ఎవరి బాధ్యతలు వారు పంచుకున్నారు.

కేసీఆర్ వర్సస్ చంద్రబాబు...

రాష్ట్రముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత తనకు సమ ఉజ్జీని ప్రధాన ప్రత్యర్థిగా ప్రచారంలో ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు నేరుగా ఇంతవరకూ ప్రచారంలోకి దిగలేదు. కానీ కేసీఆర్ మాత్రం ఆయన పేరును ప్రస్తావించకుండా ఏ సభనూ ముగించడం లేదు. బాబు వర్సస్ తెలంగాణ అన్న రీతిలో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. రాజకీయ వ్యూహకర్తగా చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజలు కూడా గుర్తిస్తారు. ఇప్పుడు ఆ పాయింట్ ను పట్టుకునే కేసీఆర్ చంద్రబాబు కేంద్రంగా ప్రచారాన్ని మలుపు తిప్పుతున్నారు. కూటమికి విజయం లభిస్తే చంద్రబాబు తెలివిగా తెలంగాణను తన గుప్పెట్లో పెట్టుకుంటారంటూ ప్రజలలో భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా కూటమి ఓటు బ్యాంకు పోలరైజ్ కాకుండా పావులు కదుపుతున్నారు. సెంటిమెంటుతో తెచ్చుకున్న రాష్ట్రం తిరిగి ఆంధ్రాపాలకులకు గులాంగిరి చేయాల్సి వస్తుందంటే స్థానికులు సహించలేరు. దానిని ఆసరాగా చేసుకుంటూ కాంగ్రెసు పెద్ద నాయకులను వదిలేసి చంద్రబాబునే టార్గెట్ చేస్తూ కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. కనిపించని ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకోవడమనేది పక్కా వ్యూహంగానే పరిశీలకులు భావిస్తున్నారు.

కేటీఆర్ పట్టణవాసి...

కేసీఆర్ వారసుడు కేటీఆర్ పట్టణాల్లో ఓటర్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారు. అయితే అది స్థానికం. ఇప్పటి వాతావరణంతో దానిని పోల్చలేం. అయినప్పటికీ కేటీఆర్ కు కొన్ని అడ్వాంటేజీలు ఉన్నాయి. గ్రేటర్ లోగతంలో విస్త్రుతంగా పర్యటించారు. పురపాలక మంత్రిగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. జీహెచ్ ఎంసీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీమాంధ్రులతోనూ, విద్యావంతులు, యువతతోనూ సత్సంబంధాలున్నాయి. వారి ఓట్లను రాబట్టడమే లక్ష్యంగా కేటీఆర్ తన ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో తెలుగుదేశం, కాంగ్రెసు కలిస్తే ప్రభావవంతమైన జట్టుగా ప్రజలు గుర్తిస్తారు. హైదరాబాదులో పట్టు నిరూపించుకోకపోతే టీఆర్ఎస్ మిగిలిన నియోజకవర్గాల్లో గెలుపు సాధించినా అదేమంత ఘనతగా చెప్పుకోలేదు. పాతబస్తీ ఎలాగూ ఎంఐఎందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ పట్టణ ఓటర్ల నాడి పట్టుకునే పనిలో పడ్డారు. వారిని ఆకట్టుకొని కూటమి వైపు వారి ఓట్లు మళ్లకుండా చూడటమే బృహత్తర కర్తవ్యంగా ప్రచారం సాగిస్తున్నారు. హైదరాబాదుతో పాటు పట్టణాల్లో టీఆర్ఎస్ ను గెలుపు గుర్రం ఎక్కించాల్సిన బాధ్యత ఆయనదే.

హరీశ్ ..కాంగ్రెసు

మాస్ ఇమేజ్ కలిగిన నాయకునిగా హరీశ్ కు ఒక ప్రత్యేకత ఉంది. పార్టీ క్యాడర్ తోనూ , ద్వితీయ శ్రేణి నాయకత్వంతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. దీనిని ద్రుష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ ఫస్టు ఫ్యామిలీలో చిచ్చుపెట్టడానికీ కొందరు ప్రతిపక్షనాయకులు ప్రయత్నించారు. హరీశ్ కు, కేసీఆర్ కు మధ్య అనుమాన మేఘాలు కమ్ముకునేలా సందేహాలు లేవనెత్తారు. కేటీఆర్ ను వారసునిగా కేసీఆర్ ప్రొజెక్టు చేయడంతో హరీశ్ రావు అసంతృప్తితో రగిలిపోతున్నారనేది ఇందులో ప్రధానమైన ఆరోపణ. అందువల్ల అవకాశమొస్తే టీఆర్ఎస్ ను చీల్చి బయటికి వచ్చేసి కాంగ్రెసుతో చేతులు కలిపేస్తారనే అనుమానం లేవనెత్తారు. దీనినుంచి బయటపడేందుకు , కాంగ్రెసును బద్నాం చేసేందుకు ద్విముఖ వ్యూహంగా కాంగ్రెసు పార్టీ లక్ష్యంగా హరీశ్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి తాను దూరమని నిరూపించుకోవడమూ, టీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చడమూ ఆయన ప్రచారంలో ప్రధాన లక్ష్యాలుగా ఉంటున్నాయి. మరోవైపు కవిత జోక్యం పెరిగిపోతోందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ విడత ఆమెను నిజామాబాద్ జిల్లాకే పరిమితం చేసి అక్కడి గెలుపు బాధ్యతలను అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. ఏదేమైనప్పటికీ మిగిలిన నాయకులెవరూ ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. అంతా తామై ఆ నలుగురే పార్టీ బాధ్యతలను భుజస్కంధాలపై మోస్తున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News