అజ్ఞాతం వీడినా…?

అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ రెండున్నర నెలల అజ్ఞాత జీవితానికి గుడ్ బై కొట్టారు. ఒక స్థల వివాదంలో న్యాయస్థానాల సముదాయంలో నలభై [more]

Update: 2019-12-14 03:30 GMT

అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జివి హర్ష కుమార్ రెండున్నర నెలల అజ్ఞాత జీవితానికి గుడ్ బై కొట్టారు. ఒక స్థల వివాదంలో న్యాయస్థానాల సముదాయంలో నలభై ఏళ్లుగా ఉంటున్న వారికి ప్రత్యామ్నాయం చూపకుండా రెవెన్యూ పోలీసులు, జ్యుడిషియరీ వ్యవస్థలు దౌర్జన్యంగా వ్యవహరించాయంటూ,బాధితులకు న్యాయం చేయాలంటూ హర్షకుమార్ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి లోని జిల్లా న్యాయమూర్తి పై హర్ష కుమార్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు అయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి జగన్ సర్కార్ పై సోషల్ మీడియా వేదికగా హర్ష కుమార్ విరుచుకుపడుతూ వస్తున్నారు. కొన్ని దళిత సమస్యలపై సైతం ఉద్యమాలు చేశారు.

టైం చూసి దెబ్బకొట్టారు ….

ఈ నేపథ్యంలో అదనుకోసం వేచి చూస్తున్న సర్కార్ కి హర్ష కుమార్ న్యాయ వ్యవస్థతో తలపడటం కలిసొచ్చింది. దాంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయడం ఆయన పోలీసులనుంచి సినీ ఫక్కీలో తప్పించుకుని మాయం కావడం జరిగిపోయాయి. మాజీ ఎంపీ జివి హర్ష కుమార్ మిస్ కావడం పై నాడు రాజమండ్రి త్రి టౌన్ ఇన్స్పెక్టర్ ను సైతం ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ వివాదాల నడుమ అజ్ఞాతంలోకి వెళ్ళిన హర్ష కుమార్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సంచలన వీడియో లు కామెంట్స్ పోస్ట్ చేస్తూ గత రెండు నెలలుగా జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే వచ్చారు. అయితే తాజాగా హర్ష కుమార్ శనివారం రాజమండ్రి విచ్చేశారు.

బెయిల్ వచ్చిందని వస్తే …

హై కోర్టు ఆయన్ను అరెస్ట్ చేయరాదని బెయిల్ మంజూరు చేసింది అన్న సమాచారంతో ఇంటికి వచ్చిన మాజీ ఎంపీ జివి హర్ష కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు హర్ష కుమార్ పై ఏ కేసులో అరెస్ట్ చేశారో స్పష్టం చేయలేదు. గతంలో పలు కేసుల్లో చర్యలు తీసుకోకపోవడంతో పాత కేసుల్లో అరెస్ట్ చూపించి ఉంటారని తెలుస్తుంది. తన కేసులో హై కోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయకుండా అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించి పోలీస్ జీప్ లో మాజీ ఎంపీ జివి హర్ష కుమార్ వెళ్లిపోయారు . జివి హర్ష కుమార్ అరెస్ట్ సందర్భంగా రాజమండ్రిలో దళిత సంఘాల నుంచి స్టేషన్ పై దాడి జరిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఆయన స్టేషన్ కి వెళ్లి లొంగి పోయిన అనంతరం పోలీసులు సెంట్రల్ జైలుకి మాజీ ఎంపి జివి హర్ష కుమార్ ని భారీ బందోబస్తు నడుమ తరలించారు. అజ్ఞాత జీవితం నుంచి తిరిగి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టిన హర్ష కుమార్ తదుపరి ఏమి చేయనున్నారనే అంశం చర్చనీయాంశం గా మారింది.

Tags:    

Similar News