జగన్ కి ఆ సెగ తప్పేట్లు లేదే

కాపుల విషయంలో జగన్ కచ్చితంగా ఉంటున్నారు. ఆ సామాజికవర్గం గురించి జగన్ కి బాగా అవగాహన ఉంది. వారి ఆశలు, ఆకాంక్షలు, ఆవేశాలు కూడా ఆయనకు తెలుసు. [more]

Update: 2019-07-30 15:30 GMT

కాపుల విషయంలో జగన్ కచ్చితంగా ఉంటున్నారు. ఆ సామాజికవర్గం గురించి జగన్ కి బాగా అవగాహన ఉంది. వారి ఆశలు, ఆకాంక్షలు, ఆవేశాలు కూడా ఆయనకు తెలుసు. అందుకే జగన్ కాపుల విషయంలో ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు. గత ఏడాది గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్ర పెద్ద ఎత్తున సాగింది. ఆయనకు జనం బ్రహ్మరధం పట్టారు. మరో వైపు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణమది. అయినా జగన్ నిర్భయంగా తన మనసులోని మాటను చెప్పేశారు. కాపులను బీసీలలో చేర్చే అంశం తన పరిధిలో లేదని జగన్ స్పష్టంగా పేర్కొన్నారు. అందువల్ల తాను ఎటువంటి హామీ ఇచ్చినా అది మభ్యపెట్టడమే తప్ప మరోటి కాదని కూడా జగన్ తేల్చేశారు. సరిగ్గా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి దగ్గరలోనే జగన్ మీటింగ్ పెట్టి మరీ ఈ విషయంలో వైసీపీ ఆలోచనలు తేటతెల్లం చేశారు.

మళ్ళీ రగిలిస్తారా….

టీడీపీని తాజా ఎన్నికల్లో జనం ఓడించారు. అలా ఇలా కాదు కేవలం 23 సీట్లే దక్కాయి. గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయంటే కాపు దెబ్బ టీడీపీకి ఎంత గట్టిగా తగిలిందో అర్ధమైపోతోంది. జగన్ అధికారంలోకి రావడానికి కాపులు ఓట్లు చాలా కీలకంగా ఉపయోగపడ్డాయి. కాపు కులానికి చెందిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉన్నా కూడా జగన్ నే అభిమానించారంటేనే ఆయన నిజాయతి పట్ల కాపులకు ఉన్న విశ్వాసమే కారణమని వైసీపీ నేతలు అంటున్నారు. అటువంటిది వైసీపీ నుంచి కాపులను విడదీయాలన కొత్త వ్యూహానికి రంగం సిధ్ధమైపోతోంది. వైసీపీలో ఉంటూ టీడీపీ వైపుగా అప్పట్లో జంప్ చేసిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇపుడు కాపుల రిజర్వేషన్ అంశాన్ని మళ్ళీ తెర మీదకు తెస్తున్నారు. కాపులకు న్యాయం కోరుతూ పోరాటం చేస్తామని కూడా ఆయన గట్టిగా చెబుతున్నారు. ఓ వైధంగా కాపులను రగిలించాలని చూస్తున్నారు.

తెర వెనక ఎవరో…?

బయటకు కనిపించే జ్యోతుల నెహ్రూ కాకుండా కాపులని తమ వైపునకు డ్రైవ్ చేయాలన్న ఆలోచన, జగన్ తో చెడగొట్టాలన్న ప్లాన్ ఉన్న వారు తెర వెనక ఎవరైనా ఉన్నారా అన్న డౌట్లు ఇపుడు వస్తున్నాయి. కాకినాడలో టీడీపీకి చెందిన కాపు నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టినపుడే వెనక ఏదో వ్యూహం ఉందని అర్ధమైపోయింది. అది టీడీపీ మద్దతుతోనా లేక టీడీపీలోనే ఉంటూ పెద్ద వర్గంగా బయటపడాలనుకుంటున్న వారి పన్నాగమా అన్నది ఒక చర్చగా ఉంది. అలాగే, కాపులకు అగ్ర వర్ణాల రిజర్వేషన్లలో అయిదు శాతం ఇమ్మంటూ ముద్రగడ పద్మనాభం కూడా జగన్ కి ఓ లేఖ రాశారు.

జ్యోతుల పోరాటం….

అది కరెక్ట్ కాదని జగన్ నిండు అసెంబ్లీలోనే చెప్పేశారు. ఇక మరో వైపు పవన్ కళ్యాణ్ సైతం కులాన్ని కాదని రాజకీయం చేయలేమంటూ కాపుల పట్ల తన సానుకూలతను గట్టిగా చాటుకుంటున్నారు. అంటే పవన్ ట్రంప్ కార్డ్ కూడా కాపులేనని అర్ధమవుతూంది. మరి వీటన్నిటి మధ్యలో నుంచేనా జ్యోతుల పోరాటం ప్రకటన వచ్చిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబు సైతం తాను కాపులను మోసం చేసినా వారిని జగన్ మీదకు ఎగదోసేందుకు ఎపుడూ రెడీనే, మరిపుడు కాపులు జగన్ కి ఎదురు నిలుస్తారా లేక ఆయన పదివేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కి ఇచ్చిన తీరుకు, ఆయన నిబద్ధతకు మద్దతుగా నిలుస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News