జగన్ వారికి అలా అర్ధమవుతున్నారా..?

జయప్రకాష్ నారాయణ్. మంచి ఐఏఎస్ అధికారి. అటునుంచి సమాజాన్ని ప్రజలను ఒక సీనియర్ అధికారిగా చూసిన ఆయన రాజకీయాల్లో మార్పు కోరుతూ లోక్ సత్తా పేరిట సామాజిక [more]

Update: 2020-09-11 05:00 GMT

జయప్రకాష్ నారాయణ్. మంచి ఐఏఎస్ అధికారి. అటునుంచి సమాజాన్ని ప్రజలను ఒక సీనియర్ అధికారిగా చూసిన ఆయన రాజకీయాల్లో మార్పు కోరుతూ లోక్ సత్తా పేరిట సామాజిక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తరువాత అది రాజకీయ పార్టీగా మారింది. దాంతో జేపీ వన్ టైం ఎమ్మెల్యే కాగలిగారు. ఆ మీదట 2014 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసినా గెలవలేదు. ఇక తన ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తివాచకం పలికేశారు. జేపీ తెలుగు రాజకీయాలతో పాటు దేశ రాజకీయలను అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎప్పటికపుడు తన అభిప్రాయలను మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన జగన్ సర్కార్ మీద కొన్ని అనుకూల కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా ఉంది.

వికేంద్రీకరణ మంచిదే…

నిజానికి లోక్ సత్తా ప్రెసిడెంట్ హోదాలో జయప్రకాష్ నారాయణ్ 2014 కు ముందు ఒక అధ్యయనం చేశారు. ఏపీ 13 జిల్లాలతో ఏర్పాటు అవుతోంది. రాజధాని ఎక్కడ పెట్టాలి. అభివృధ్ధి ఎలా చేసుకోవాలి అన్నది కేవలం రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం కూర్చుని చేసుకోవాల్సి నిర్ణయం అని దీనికి కేంద్ర పెత్తనం ఎందుకు అని వాదించేవారు. కేంద్రం శివరామక్రిష్ణన్ కమిటీ వేయడాన్ని కూడా ఆయన పరోక్షంగా తప్పుపట్టేవారు. ఆనాడు ఆయన చేసిన ప్రతిపాదనలు ఇపుడు జగన్ అమలుచేస్తున్న మూడు రాజధానుల కధ దాదాపుగా ఒకేలా ఉందని చెప్పాలి. అధికార వికేంద్రీకరణ మంచిదని జయప్రకాష్ వాదించేవారు. ఇపుడు ఆయన తాజాగా ఓ టీవీ డిబేట్ లో కూడా జగన్ చేసిన మూడు రాజధానుల గురించి మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణ మంచిదేనని చెప్పుకొచ్చారు.

మీటర్లకు ఓకే …?

ఏదైతే నానా యాగీ చేసి జగన్ సర్కార్ మీద బురద జల్లాలని చంద్రబాబు, ఇతర విపక్షాలు అనుకున్నాయో దాని మీద కూడా జయప్రకాష్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. రైతులు వాడే పంపుసెట్లకు మీటర్లు బిగించడం తప్పు ఎలా అవుతుంది అని ఆయన అంటున్నారు. ఒక ప్రభుత్వం తాను రైతులకు ఇచ్చే విద్యుతు ఎంత ఖర్చు అవుతోంది. ఎంత వేస్ట్ అవుతోంది ఇలా లెక్కలు చూసుకునే అవకాశం ఉండాలిగా. ప్రభుత్వానికే లెక్కలు తెలియకపోతే ఎలా అంటూ జేపీ జగన్ నిర్ణయానికి మద్దతు ఇస్తూ విపక్షాల గాలి తీశేశారు. అంతే కాదు తాను వైఎస్సార్ టైం లోనే ఇలాంటి సలహా ఇచ్చారని, ఆయన కూడా మీటర్లు బిగించాలని ఆలోచించి చివర్లో ఎందుకో ఆగారని కూడా గత విషయాలు కూడా చెప్పుకొచ్చారు.

ఆయన అంతేగా…?

ఇక జగన్ ఏపీలో తీసుకొస్తున్న కొన్ని విప్లవాత్మకమైన మార్పులను మరో మేధావి కమ్ పొలిటీషియన్, రిటైర్డ్ ఐపీఎస్ లక్ష్మీనారాయణ కూడా గతంలో సమర్ధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆయన కూడా వికేంద్రీకరణ మంచిదేనని చెప్పారు. ఎక్కడ ఏ రకమైన పరిశ్రమకు అనుకూలం ఉంటుందో అది పెట్టాలి, అపుడే ఏపీ అభివృధ్ది సాధిస్తుందన్నది జేడీ లక్ష్మీనారాయణ భావన. అన్నీ ఒకే చోట కుప్ప పోసి ఉంచే హైదరాబాద్ మోడల్ డెవలెప్ మెంట్ మంచిది కాదన్నది ఆయన ఆలోచనగా చెబుతారు. వీరే కాదు, మేధావులు, ఏపీ ప్రగతి కోరే వారంతా జగన్ డేరింగ్ గా తీసుకొస్తున్న ప్రాంతీయ బోర్డులు, కొత్త జిల్లాలు, ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు అన్నింటినీ స్వాగతిస్తున్నారు. మరి రాజకీయం నిండా తలకెక్కిన వారే జగన్ ని వేరేగా చూస్తున్నారు. తన భావజాలాన్ని జనం బుర్రల్లో రుద్దేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు అనుకోవాలి.

Tags:    

Similar News