ఇన్నాళ్లకు గుర్తొచ్చామా బాబూ…!!

ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగింది. చంద్రబాబునాయుడు చేతిలోకి వచ్చాక ఆ పార్టీ కొన్ని సార్లు విజయం సాధించినా ఓటములను కూడా ఎక్కువగానే చవి [more]

Update: 2019-07-31 09:30 GMT

ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగింది. చంద్రబాబునాయుడు చేతిలోకి వచ్చాక ఆ పార్టీ కొన్ని సార్లు విజయం సాధించినా ఓటములను కూడా ఎక్కువగానే చవి చూడాల్సి వచ్చింది. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పార్టీపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చే వారు. అందులోనూ పార్టీ అనుబంధ విభాగాలను దగ్గరకు తీసుకునే వారు. వారికి ప్రాధాన్యత కల్పించేవారు. అధికారంలో ఉంటే వారికి పదవుల్లోనూ ప్రయారిటీ ఇచ్చేవారు. కానీ చంద్రబాబునాయుడు హయాంలో ముఖ్యంగా నారా లోకేష్ పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాత వీటిని పట్టించుకోలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

అనుబంధ సంఘాలే…..

ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా…ప్రజల్లోకి పార్టీ మ్యానిఫేస్టోను బలంగా తీసుకెళ్లాలన్నా క్యాడర్ తో పాటు అనుబంధ సంఘాలు కూడా ముఖ్యమే. తెలుగుదేశం పార్టీకి పేరుకే అనుబంధ సంఘాలున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తెలుగురైతు, తెలుగు విద్యార్థి, తెలుగు యువత, తెలుగునాడు కార్మిక సంఘం, తెలుగు మహిళ వంటి అనుబంధ సంఘాలను గత ఐదేళ్ల నుంచి పట్టించుకోలేదు. కార్యకర్తల సంక్షేమానికి తాము ఎప్పుడూ కట్టుబడే ఉన్నామని చెబుతున్న చంద్రబాబు, లోకేష్ లు అనుబంధ సంఘాలను నిర్వీర్యం చేశారంటున్నారు.

నిర్వీర్యం చేయడంతో…..

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. అనుబంధ సంఘాలన్నీ కేవలం పేరుకే ఉన్నాయని, అందులో పనిచేసే వారిని ఎవరినీ నియమించలేదన్న విమర్శలు ఉన్నాయి. సిఫార్సుల మేరకే ఆ పదవులను కట్టబెట్టారన్న వ్యాఖ్యలు కూడా లేకపోలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబునాయుడుకు వీటి అవసరం తెలిసి వచ్చినట్లుంది. అందుకే వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు వాటిపై దృష్టి…..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలన్నా అనుబంధ సంఘాలు యాక్టివ్ గా ఉండటం అవసరమని చంద్రబాబు ఇప్పటికి గుర్తించినట్లుంది. ఆగస్టు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశాలు జరపాలని ఆదేశించారు. అంతేకాకుండా అనుబంధ సంఘాల నియామకాలను కూడా పూర్తి చేయాలని, వచ్చే నెల 9వ తేదీన అమరావతిలో జరిగే రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి కూడా అనుబంధ సంఘాల నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. మొత్తం మీద చంద్రబాబుకు ఇప్పుడు వారు గుర్తొచ్చినట్లుంది.

Tags:    

Similar News