మొండి vs జగమొండి

ప్రకృతి ఒకవైపు విరుచుకు పడుతోంది. లోతట్టు ప్రాంతాలను కృష్ణమ్మ ముంచెత్తుతోంది. వేలమంది నిరాశ్రయులై, నిర్భాగ్యులుగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొంపాగోడు మునిగిపోయి గొల్లు మంటున్నారు. తిండీ [more]

Update: 2019-08-16 15:30 GMT

ప్రకృతి ఒకవైపు విరుచుకు పడుతోంది. లోతట్టు ప్రాంతాలను కృష్ణమ్మ ముంచెత్తుతోంది. వేలమంది నిరాశ్రయులై, నిర్భాగ్యులుగా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొంపాగోడు మునిగిపోయి గొల్లు మంటున్నారు. తిండీ తిప్పలు లేని దైన్యం ఒకవైపు. ఇల్లూ వాకిలి ఏమైపోతాయోనన్న బెంగ మరొక వైపు. పార్టీలకు అతీతంగా అంతా ఒకటై కదలాల్సిన తరుణం. చేయి చేయి కలపాల్సిన సమయం. మానవతా సాయాన్ని అందించాల్సిన ఘట్టం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రతి సందర్బాన్ని రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టి కాట్లాడుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. దీంతో అసలు సమస్య మరుగున పడుతోంది. రాజకీయ రచ్చే రోడ్డెక్కుతోంది. బాధితుల వేదన కృష్ణమ్మ నీటిలో కలిసిపోతోంది.

కృష్ణమ్మ సాక్షిగా…

కరకట్టపై ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు ఇంటి పరిసరాలకు వరద ప్రవాహం తన్నుకొస్తోంది. ఇది నిబంధనలకు విరుద్దంగా నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖే చెబుతోంది. అది కొత్త విషయం కాదు. దాని చుట్టూ అధికార విపక్షాలు చేస్తున్న రాజకీయం మాత్రం బాధితుల సమస్యను పక్కదారి పట్టిస్తోంది. డ్రోన్లతో ప్రతిపక్ష నేత గృహాన్ని చిత్రీకరించారనే అంశం తాజాగా వివాదానికి తెర తీస్తోంది. తమ పార్టీ అధినేతపై భౌతిక దాడికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ టీడీపీ ఆందోళనలకు దిగింది. ప్రతిపక్ష నాయకుడు అక్రమ కట్టడంలో నివసిస్తూ కరకట్ట భద్రతకు ప్రమాదం కలిగిస్తున్నాడని ఎస్టాబ్లిష్ చేయాలనేది అధికార పార్టీ యోచన. తమ అధినేత చంద్రబాబుపై దాడికి కుట్ర చేస్తున్నారంటూ దీనిని తిప్పికొట్టాలనేది టీడీపీ ఎత్తుగడ. ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు గృహం పైనే వ్యవహారమంతా కేంద్రీకృతం కావడంతో దిగువన మునిగిపోయిన వేలమంది ప్రజల ఇళ్లకు సంబంధించిన విషయాలు, వారిని ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు చిన్నవైపోయాయి. ఎప్పుడైతే అక్రమ కట్టడమని ప్రభుత్వం ముద్ర వేసిందో ఆ క్షణమే చంద్రబాబు ఖాళీ చేసి ఉంటే హుందాగా ఉండేది. ఈరోజున ఇంత యాగీ చేయాల్సిన అవసరమే వచ్చేది కాదు. ధర్నాలు చేసి పోలీసు లాఠీల రుచి చూడాల్సి వచ్చేది కాదు. అధికారపార్టీ సైతం ప్రభుత్వ పక్షంగా బాధితులకు ఆపన్న హస్తం అందించడమే తమ మొదటి బాధ్యతగా గుర్తించాలి. ప్రతిపక్షనాయకుని నివాసం అన్నది చిన్న అంశం మాత్రమే. అధికారప్రతిపక్షాలు వరద బాధితుల సహాయపునరావాస కార్యక్రమాల్లో పోటీ పడాల్సిన సందర్భమిది. దానికంటే డ్రోన్లు నిఘా, భద్రత , మునిగిపోతున్న కరకట్టపై వీఐపీ గెస్టు హౌస్ ముఖ్యమై కూర్చున్నాయి. చంద్రబాబు నాయుడి ఇల్లు మునిగిపోయినా హైదరాబాద్, విజయవాడల్లో ఆయన ఆవాసాలకు కొరత లేదు. చంద్రబాబు బాధితుడూ కాదు. వంద ఇళ్లు సమకూర్చుకోగలిగిన ఆర్థిక సామర్థ్యం ఉంది. సమస్యను మింగేస్తున్న రాజకీయమే అసలు సమస్యగా మారుతోంది.

ప్రమాదంలో భద్రత..?

రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రి తర్వాత ప్రొటోకాల్, భద్రతల రీత్యా అత్యంత ముఖ్యమైన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు. నేషనల్ సెక్యూరిటీ గ్రూపు రక్షణలో ఉన్న వ్యక్తి. వ్యక్తిగత భద్రతా విభాగానికి, ఎన్ఎస్ జీకి సమాచారం ఇవ్వకుండా ఆయన నివాసాన్ని చిత్రీకరించడం నిబంధనలకు విరుద్దమనే చెప్పాలి. ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో చిత్రీకరించాల్సి వచ్చినా దానిని రహస్యంగానే ఉంచాలి. అదంతా పెద్ద మీడియా ఈవెంట్ గా మార్చకూడదు. అలా చేస్తే దురుద్దేశాలు ఆపాదించేందుకు అవకాశం ఉంటుంది. భద్రత ప్రమాదంలో పడుతుంది. ప్రజావేదికను కూల్చి వేసినప్పటికీ ఆ పరిసరాల్లోనే నివాసముంటున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మొండి పట్టుదలను ఎత్తి చూపడానికే చిత్రీకరణకు పెద్ద ప్రచారం ఇచ్చినట్లుగా భావించాలి. సున్నితమైన ఈ అంశంలో తమ తప్పిదం కూడా ఉందని గ్రహించకుండా టీడీపీ నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. పరిస్థితి శ్రుతిమించి రాజకీయ రగడ మొదలైంది. సాధారణంగా కృష్ణా ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ బరాజ్ దిగువకు నీటిని విడుదల చేస్తుంటారు. ఈసారి మాత్రం నాగార్జున సాగర్ నుంచి నీటి ప్రవాహం విరుచుకుపడుతున్నా జాప్యం చేయడం ప్రస్తుత వరద తీవ్రతకు కారణంగా చెప్పుకోవాలి. దీని చుట్టూ కూడా రాజకీయ కోణాలు చిలువలు పలువలుగా వినవస్తున్నాయి.

చాలించండి….

ఎన్నికలు ముగిశాయి.. ఎవరి పాత్ర ఏమిటో ప్రజలు నిర్దేశించేశారు. అయినా ఇంకా వేడి చల్లారలేదు. రాజకీయాల రచ్చ సద్దుమణగలేదు. ప్రజాసమస్యల పరిష్కారంలో పోటీ పడాల్సిన అధికార విపక్షాలు ప్రతి అంశాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవాలని చూస్తే నష్టపోయేది రాష్ట్ర ప్రజలే. సమర్థమైన పాలనను అందించడం వైసీపీ బాధ్యత. లోటుపాట్లను నిలదీసి ప్రజలకు మేలు జరిగేలా చూడటం టీడీపీ అధినేత చంద్రబాబు కర్తవ్యం. ఈ రెంటినీ పక్కనపెట్టి వరద సమయంలో ఒడ్డున కూర్చుని కోట్లాడుకోవడం ఏ తరహా రాజకీయం? ఎవరికి మేలు చేస్తుంది? రెండు పార్టీలు రంగంలోకి దిగి వరద బాధితులకు ఆపన్న హస్తం అందించడం తక్షణ కర్తవ్యం. ఒకానొక సందర్భంలో ధర్మరాజును గంధర్వులు ప్రశ్నిస్తే రాజనీతి ఏమిటో స్పష్టంగా చెబుతాడు. కౌరవులు వందమంది. పాండవులు అయిదుగురు. మాలో మేము దాయాదులుగా కొట్టాడుకొంటాం. కానీ బయటనుంచి ఎవరైనా వస్తే మా సంఖ్య 105 అన్నది మరిచిపోవద్దు అని హెచ్చరిస్తాడు. బయట్నుంచి ప్రకృతి దాడి చేసినప్పుడు అధికార, ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఒకటై పనిచేయడమే ఇందులో దాగి ఉన్న నిజమైన రాజనీతిజ్ణత.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News