సాహసులారా..శాల్యూట్...!

Update: 2018-05-10 15:30 GMT

‘ధైర్యే..సాహసే...లక్ష్మీ’ పూర్వీకులు ఇదేదో మాట వరసకు చెప్పిన సామెతగా భావిస్తుంటాం. నూటికి నూరుపాళ్లు నిజమని నిరూపించారు సచిన్ బన్సల్,బిన్నీ బన్సల్. కొత్త ఆలోచన, కష్టించే తత్వం, బృందం కూర్పు, నడిపించే నేర్పు, సంయమనం, సహనం, సహకారభావన వెరసి వారిద్దరి విజయం. ఇది భారతదేశంలోని యువతరం విజయం. ఎక్కడి వాల్మార్ట్..ఎక్కడి ప్లిఫ్ కార్ట్. నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో పదేళ్ల క్రితం ప్రారంభమైన చిన్న స్టార్టప్ ఇంతింతై వటుడింతై నభో వీధిపైనంతై అన్నట్లుగా ఎదిగిపోవడం కేవలం ఒక విజయం కాదు, అద్భుతం. ఆన్ లైన్ లో పుస్తకాలు బుక్ చేసినవారి ఇంటింటికీ స్కూటర్లపై తిరుగుతూ డెలివరీ బోయ్స్ బాధ్యత నిర్వహించిన సచిన్, బిన్నీ లక్షముప్ఫైవేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారంటే నమ్మడం కష్టమే. కానీ కళ్లముందు కదలాడే నిజం. ప్రపంచ వ్యాపార దిగ్గజమైన వాల్ మార్ట్ వారెవ్వా అంటూ సర్టిఫై చేసి ప్లిఫ్ కార్ట్ లో 77శాతం వాటాను కొనుగోలు చేయడమంటే మాటలా? కాదు అక్షరాలా లక్షా ఏడువేల కోట్లరూపాయల మూటలు. నిజానికి ఆర్థిక, వ్యాపార గణాంకాలలోనే చూడాల్సినంత, కుదించాల్సినంతంటి చిన్ని విషయం కాదిది. సచిన్ బిన్నీల ప్రస్థానం యువతరానికొక స్ఫూర్తి మంత్రం. సాహసులైన స్టార్టప్ వ్యవస్థాపకులకు సమధికోత్సాహం.

ఉపాధికి ఊపిరి...

అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలో హాయిగా కాలం గడిపేసి..తమ బతుకేదో తాము చూసుకుంటే సచిన్ బన్సల్, బిన్ని బన్సల్ లు శతకోటి పైబడిన జనాభాలో తామూ ఒకరిగా మిగిలిపోయి ఉండేవారు. కష్టాలకు ఎదురీదే సాహసం చేయకుంటే కాలం ఒడిలో కనిపించకుండా పోయేవారు. ఏదో చేయాలనుకున్న వారి తపన, నూతన అవకాశాలను అన్వేషించిన ముందుచూపు ఫలితంగా ఆవిర్భవించిందే ఇ కామర్స్ వ్యాపార సామ్రాజ్యం ప్లిఫ్ కార్ట్. ఇద్దరితో మొదలైన ఈ నడక ఈరోజున 33 వేల మందికి ఉపాధి వటవృక్షంగా ఎదిగింది. ఈ పదేళ్ల గమనంలో ఎగుడుదిగుడులు ఎన్నెన్నో.. కష్టనష్టాలను చవిచూశారు. లోతుపాతుల్లో పడిలేచారు. పట్టువదల్లేదు. ప్రయత్నం విడిచిపెట్టలేదు. నడక ఆపలేదు. స్టార్టప్ కంపెనీలు చాలా వరకూ మఖలో పుట్టి పుబ్బలో మాయమైపోతుంటాయి. ఆరంభ శూరత్వంతో ఆవిరైపోతుంటాయి. ముందుకు నడవలేమంటూ మూలన పడిపోతుంటాయి. వీటన్నిటికీ అతీతమైన విలువల గమనమే ప్లిఫ్ కార్ట్ ను విజయతీరాలకు చేర్చింది. దాని ఆర్థిక విలువను లక్షల కోట్లకు చేర్చింది. లాభనష్టాల లెక్కలు కాదు. లక్ష్యం ఉంటే మాత్రమే విజయం సాధ్యమవుతుందనేందుకు సచిన్,బిన్నిలు అనుసరించిన వ్యూహాలను గెలుపు పాఠాలుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టాప్ టు బాటమ్ ....

హోదాలు, చిన్నాపెద్దా తేడాలు, ఉద్యోగుల్లోనే స్థాయి వ్యత్యాసాలు పని సంస్కృతిని దెబ్బతీస్తుంటాయి. సరైన వర్క్ కల్చర్ లేకపోవడం వల్లనే వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్న సంగతిని సచిన్, బిన్నీలు గమనించారు. వ్యవస్థాపకులమైన తామే పని విధానంలో మార్పునకు మొదటి చొరవ తీసుకోవాలని భావించారు. సేవారంగంలో వెలసిన కంపెనీ కావడంతో అన్నివేళలా ఖాతాదారుల సర్వీసుకు సంసిద్దంగా ఉంటామన్న సంకేతం పంపాలని ఒక ప్రణాళిక తయారుచేశారు. డైరెక్టర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు తమతో సహా అందరూ ఖాతాదారుల కాల్స్ కు అటెండ్ అయ్యేలా తొలినాళ్లలోనే ఒక ప్రణాళిక తయారు చేశారు. కస్టమర్ ఈజ్ ద మాస్టర్ . తామంతా సేవకులం అన్న భావన ఉద్యోగుల్లో కల్పించడమే దీని ఉద్దేశం. దీనివల్ల ఖాతాదారుల నుంచి నేరుగా సమాచారం స్వీకరించడం సాధ్యమైంది. ఉద్యోగుల్లో అంకితభావం, అప్రమత్తత ఏర్పడింది. బిన్నీ అయితే నేరుగా డెలివరీ బోయ్ తో కలిసి వెళ్లి ఖాతాదారుకు సరుకు అందించిన అనుభవాలూ ఉన్నాయి. ఏ సంస్థలో అయినా టాప్ టు బాటమ్ ఇన్వాల్వ్ మెంట్ పెరిగితే సహకారం సక్సెస్ కు బాటలు వేస్తుందని సచిన్, బిన్నీ తమ చేతల ద్వారా నిరూపించారు. కస్టమర్ కనెక్టు అనేది సేవారంగంలోని సంస్థలకు శిరోధార్యమైన బాధ్యత. దానిని నెరవేర్చిన కారణంగానే ప్లిఫ్ కార్ట్ అంత పెద్ద సంస్థగా ఎదగగలిగింది. ఇండియన్ ఆన్ లైన్ మార్కెట్ రూపురేఖలనే మార్చేసింది. భారత ‘ఇ’ టెయిలింగ్ రంగానికి కొత్త నిర్వచనం చెప్పింది.

ఆకాశమే హద్దు...

బహుళ జాతి సంస్థలు అనేక రకాలుగా మదింపు చేసుకున్న తర్వాతనే విలీనాలు, కొనుగోళ్లు చేస్తుంటాయి. వాల్ మార్ట్ లక్షా ఏడువేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్లిఫ్ కార్ట్ యాజమాన్యాన్ని కొనుగోలు చేస్తోందంటే దాని లెక్కలూ దానికున్నాయి. ప్రస్తుతం 80 లక్షల కోట్ల రూపాయల మేరకు ఉన్న భారత వినియోగదారుల వార్షిక కొనుగోలు సామర్థ్యం రానున్న పదేళ్ల కాలంలో అంటే 2027 నాటికి 200 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. ‘ఇ’ కామర్స్, ‘ఇ’ టెయిలింగ్ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకూ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇక ముందు లాభాల మూటలను దండుకోవడమే. ఎంతగానో ఎదిగిపోతున్న ఈ మార్కెట్ ప్రపంచమే వాల్ మార్ట్ ను ఊరించింది. ప్రపంచంలో అతిపెద్ద ఇ కామర్స్ డీల్ గా పేర్కొంటున్న తాజా కొనుగోలును భారత యువ మేధాశక్తికి నీరాజనంగా చెప్పుకోవాలి. సరసమైన ధరలు, నాణ్యతప్రమాణాలు, అందుబాటు సేవలు త్రిసూత్రాలుగా సచిన్, బిన్నీలు సాధించిన విజయం స్టార్టప్ ల సక్సెస్ కు సాధికార ప్రమాణం. అందుకే వాణిజ్య మండళ్లు శాల్యూట్ చేస్తున్నాయి. సాహో అంటున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News