ఫస్ట్ టైం గెలిచి బ్యాడ్ చేస్తున్నారా?

అధికార వైసీపీలో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు అనేక మంది వరకూ ఉన్నారు. వీరిలో దాదాపు డెబ్భయి మంది వరకూ కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యలే. అయితే వీరి [more]

Update: 2019-12-20 05:00 GMT

అధికార వైసీపీలో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు అనేక మంది వరకూ ఉన్నారు. వీరిలో దాదాపు డెబ్భయి మంది వరకూ కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యలే. అయితే వీరి మాట ఎవరూ వినడం లేదట. అధికారులు పూచిక పుల్ల సమానంగా తీసిపారేస్తున్నారట. తమను కనీసం ఎమ్మెల్యేగా గుర్తించడం లేదని వీరి ఆవేదన. ముఖ్యమంత్రి జగన్ కు తమ బాధను చెప్పుకుందామనుకుంటే కుదరడం లేదు. దీంతో తమకు వచ్చిన సందర్భాలను వారు వినియోగించుకంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలమని విస్మరించి విపక్ష ఎమ్మెల్యేలుగా మారిపోతున్నారు.

ఇదే ఉదాహరణ….

ఇక సంక్షేమ పథకాల అమలుకూడా సక్రమంగా లేదని వారు ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా ఎమ్మెల్యేలయిన వారు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందే అక్కసును వెళ్లగక్కారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు తప్ప ఎవరూ టీడీపీ నుంచి గెలవకపోవడంతో ఈ సమావేశంలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. కొత్తగా ఎమ్మెల్యేలయిన వారయితే తాము అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయారు.

రైతు భరోసా సక్రమంగా లేదంటూ…..

చిత్తూరు జిల్లాలో రైతు భరోసా పథకం సక్రమంగా అమలు జరగడం లేదని, అర్హులెవరికీ అందలేదని సీనియర్ నేత, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శలను ప్రారంభించారు. ఇది చూసిన మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులు లబ్ది పొందలేదని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం విరుచుకుపడ్డారు. ఇక పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాధ్ రెడ్డి కూడా తంబళ్లపల్లి నియోజవకర్గంలో వైద్యులు, నర్సుల కొరతతో పాటు అంబులెన్స్ కూడా లేదని, పోస్ట్ మార్టం కోసం మదనపల్లె వెళ్లాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మదనపల్లెలో వైద్యుల తీరు బాగాలేదని, ఫిర్యాదు చేసినా ఎవరూ ఖాతరు చేయడం లేదని ఎమ్మెల్యే నవాజ్ భాషా సమావేశంలో ఫైరయ్యారు.

స్పందన కూడా తుస్ అట…

జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారం కావడం లేదని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. రోడ్ల విస్తరణ ఎందుకు చేయడం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ అయితే తనను కలెక్టర్ పట్టించుకోవడం లేదన్నారు. ఇలా తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు విపక్ష నేతలుగా మారడంతో అక్కడే ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం తర్వాత వారికి క్లాస్ పీకినట్లు తెలిసింది. ఏ సమావేశంలో ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలా అని మందలించినట్లు సమాచారం. మొత్తం మీద తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారాల పట్ల అంత సంతృప్తికరంగా లేరన్నది ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతోంది.

Tags:    

Similar News