రాజకీయ స్నేహమే కదా?

ఎవరి అవసరాలు వారివి. అంతర్జాతీయ సంబంధాలు, దేశప్రయోజనాలు ముడిపడి ఉన్నప్పుడు ఆ అవసరాలకు కూడా సార్థకత ఏర్పడుతుంది. భారత్ లో ట్రంప్ పర్యటన తొలి రోజు విశేషాలను [more]

Update: 2020-02-24 15:30 GMT

ఎవరి అవసరాలు వారివి. అంతర్జాతీయ సంబంధాలు, దేశప్రయోజనాలు ముడిపడి ఉన్నప్పుడు ఆ అవసరాలకు కూడా సార్థకత ఏర్పడుతుంది. భారత్ లో ట్రంప్ పర్యటన తొలి రోజు విశేషాలను చూసినప్పుడు చాలా ఆసక్తి కలుగుతుంది. రాజకీయ స్నేహం దేశాల సంబంధాలను ప్రభావితం చేసే సందర్భాలు అరుదుగా వస్తుంటాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనను ఈ కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా తానెంత పెద్ద నాయకుడో చాటుకోవాలనే తహతహ భారత ప్రధానిది. స్వదేశంలో ఎన్నికలలో గట్టెక్కేందుకు ఎంతోకొంత ఈ పర్యటన ఉపయోగపడకపోతుందా? అనే ఆశ ట్రంప్ ది. వ్యక్తిగతంగా తమ మధ్య మంచి స్నేహం ఉందని ఇరువురు నేతలు చాటుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది రాజకీయ స్నేహంగానే చెప్పుకోవాలి. ఎంతెంత లాభం చేకూరిందన్న అంచనాలను మాత్రం వివిధ కోణాల్లో పరిశీలించాలి.

దేశమే ఫస్టు…

మోడీ, ట్రంప్ ల లో కనిపించే సారూప్యతలే వారిరువురిని ఒకే గాటన కట్టడానికి కారణంగా చెప్పాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దేశానికి ప్రాధాన్యత అంటూ ఇద్దరూ బహిరంగంగా చెప్పడమే కాకుండా భారీ ప్రచారానికి సైతం పూనిక వహిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో నాయకులిద్దరూ ఆయా దేశాల ప్రజల అభిమానం చూరగొన్నారనే చెప్పాలి. అయితే అమెరికా ఫస్ట్ నినాదంతో భారత్ వంటి దేశాలకు కొంత ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. వీసాలు, దిగుమతి సుంకాల వంటి విషయాల్లో విభేదాలు, వివాదాలు ఉన్నాయి. తెగేదాకా లాగకుండా సాధ్యమైనంతవరకూ సర్దుకుపోయే ధోరణిలోనే ఇంతవరకూ వ్యవహారాలు నడుస్తూ వస్తున్నాయి. వీసాల సంఖ్య కు పరిమితులు, సంక్షేమ పథకాల వినియోగంపై ఆంక్షలు, వాణిజ్య ఎగుమతులపై అలక అమెరికా నుంచి భారత్ కు ఎదురవుతున్న ఒత్తిడి. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ వివాదాలు ఇరుదేశాల సంబంధాలు దెబ్బతినేందుకు కూడా అవకాశం ఉండేది. కానీ ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాల్లో నెలకొని ఉన్న రాజకీయ వాతావరణం ఇరుదేశాల బంధాన్ని విడిపోకుండా చేస్తోంది.

ఇరువురి అవసరం…

చైనా భారీ ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చింది. మహత్తర సైనిక శక్తిగానూ నిలుస్తోంది. అమెరికా 21 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంటే, చైనా ఇప్పటికే 14 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరింది. మరో పదేళ్లలో అమెరికాను తలదన్నుతుందనే అంచనాలున్నాయి. జనాభారీత్యా ఇప్పటికే చైనా అతిపెద్ద దేశం. ఆర్థికంగాను, సైనిక శక్తి పరంగా చైనా బలపడితే ప్రపంచంలో అగ్రరాజ్య హోదా దానిదే. ఆర్థిక, సైనిక శక్తి పరంగా తనకు దీటు కాకపోయినా ఆవిష్కరణలలో ముందంజలో ఉంటూ పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలు నెరపుతున్న భారత్ ను కట్టడి చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ ను మచ్చిక చేసుకుంటూ అండదండలిస్తోంది. భారత్ ను నియంత్రించేందుకే ఈ ఎత్తుగడ. అంతర్జాతీయంగా భారత్ ఎదగకుండా దాయాది గొడవలతోనే తనను తాను కుదించుకోవాల్సిన అనివార్యతను భారత్ కు కల్పిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ తో అత్యంత సత్సంబంధాలు నెరిపే అమెరికాకు ఆ దేశం గుదిబండగా మారింది. పాకిస్తాన్ ద్వంద్వ పద్ధతిని పాటిస్తోంది. అటు చైనా, ఇటు అమెరికా రెంటినీ వాడుకోవాలని చూస్తోంది. అందుకే ఆసియా ఖండంలో చైనాకు దీటుగా భారత్ ఎదగాలని అమెరికా ఆశిస్తోంది. ప్రాంతీయంగా ఈ రెండు శక్తులు ఎదురెదురుగా నిలిస్తే తమ అగ్రరాజ్య పీఠానికి ఎదురుండదనేది అమెరికా భావన. ఈ క్రమంలోనే అమెరికా, భారత్ లు కలిసి నడవక తప్పని ఒక అనివార్యత రెండు దశాబ్దాలుగా ఏర్పడుతూ వస్తోంది. ట్రంప్, మోడీ ల హయాంలో ఇది మరింతగా పెరిగి పెద్దదైంది.

అంతర్జాతీయంగా…

గతంలో దౌత్య సంబంధాలు, రక్షణ సంబంధాలు, సంప్రదాయ స్నేహాల వంటివి అంతర్జాతీయ కోణంలో ప్రముఖంగా ఉంటూ వచ్చేవి. ఆధునిక రాజనీతిలో ఆర్థిక సంబంధాలు కీలకంగా మారాయి. ఇవే పేచీలకు కారణమవుతున్నాయి. అనివార్య మిత్రత్వాలు కొన్నిచోట్ల తప్పనిసరి అవుతున్నాయి. అమెరికా దేశానికి వివిధ రకాల వస్తువులను ఎగుమతి చేసే ఎనిమిదో పెద్ద దేశంగా భారత్ స్థానాన్ని ఆక్రమించింది. అలాగే భారత్ , అమెరికాల మధ్య రెండువేల సంవత్సరం వరకూ 16 వందల కోట్ల డాలర్లమేరకు ఉన్న వాణిజ్య బంధం ఇప్పుడు 14 వేల కోట్ల డాలర్ల పైచిలుకు కు చేరింది. అంటే దాదాపు తొమ్మిది రెట్లు. అందుకే 21 వ శతాబ్దిలో పదవి స్వీకరించిన ప్రతి అమెరికా అధ్యక్షుడు భారత్ ను సందర్శించారు. భారత్ ఎదిగితే తనకు అండగా నిలుస్తుందని అమెరికా ఆశిస్తోంది. అయితే దేశీయంగా ఉన్న రాజకీయాల కారణంగా భారత్ అమెరికా అవకాశాలను సక్రమంగా అందిపుచ్చుకోలేకపోతుందనే వాదన ఉంది. భారత్ ను రక్షణ పరంగా బలోపేతం చేసే క్రమంలో భాగంగా భారీగా ఆయుధాలను ఎగుమతి చేసి తాను లాభపడాలని అమెరికా యోచిస్తోంది. ఇప్పటికే రక్షణ భాగస్వామి స్థాయికి చేరింది. భారత్, అమెరికాలు రెండూ కలిసి వివిధ అంశాల్లో సహకరించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా దాని ప్రభావం అంతర్జాతీయ సమాజంపై పడుతుంది. ముఖ్యంగా భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం, వీసాల విషయంలో కొన్ని అదనపు సౌకర్యాలు, వాణిజ్య వెసులుబాటులు కల్పిస్తే భారత్ కచ్చితంగా బలపడుతుంది. కానీ ఇందుకు అమెరికా కొంతమేరకు సొంత ప్రయోజనాలు వదులుకోవాలి. అందుకు సిద్ధంగా ఉందా? అంటే సందేహమే. ‘ యత్ర విశ్వాసం..తన్మిత్రం ’ అంటూ ట్రంప్ పర్యటనలో మోడీ పేర్కొన్నారు. విశ్వాసం ఉన్నచోటనే స్నేహం ఉంటుందని దాని అర్థం. అది నిజమో, కాదో ఈ రెండు దేశాల మధ్య కుదిరే ఒప్పందాలే గుట్టు విప్పాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News