ఒకే ఒక్కడు… దళంతో ఆయన

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కు ఇక గంటల వ్యవధి మాత్రమే మిగిలింది. రేపు జరగబోయే పోలింగ్ లో ఎవరి భవిష్యత్తు ఏంటో తేలనుంది. దాదాపు పది రోజుల [more]

Update: 2020-02-07 18:29 GMT

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కు ఇక గంటల వ్యవధి మాత్రమే మిగిలింది. రేపు జరగబోయే పోలింగ్ లో ఎవరి భవిష్యత్తు ఏంటో తేలనుంది. దాదాపు పది రోజుల పాటు అన్ని పార్టీలూ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించాయి. మ్యానిఫేస్టోలతో అదరగొట్టాయి. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజల ముందు ఉంచాయి. ఇప్పుడు నేతల భవిష్యత్తు ఢిల్లీ ప్రజల చేతుల్లో ఉంది.

ఒకే ఒక్కడుగా ప్రచారంలో…..

ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు మేరకు కేజ్రీవాల్ ఎన్నికలకు వెళ్లారు. దాదాపు పది మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించారు. కొత్త అభ్యర్థులను రంగంలోకి దించారు. ఒకే ఒక్కడుగా జనంలోకి వెళ్లారు. తాను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమేం చేస్తానన్న దానిపై గ్యారంటీ కార్డును విడుదల చేశారు. అన్ని సర్వేలూ తిరిగి కేజ్రీవాల్ కే అవకాశం ఉందని తేల్చడంతో కొంత ఉత్సాహం ఆ పార్టీలో పోలింగ్ కు ముందే కన్పిస్తుండటం విశేషం.

మోదీతో పాటు ముఖ్యమంత్రులు…..

ఇక భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఢిల్లీ ఎన్నికలను తీసుకుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఏడింటికి ఏడు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా హస్తినలో అధికారంలోకి రావాలని సర్వశక్తులూ ఒడ్డింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు 11రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గానికి ముగ్గురు ఎంపీలను బీజేపీ బాధ్యులుగా నియమించింది. గత శాసనసభ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కడంతో ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించకుండా బీజేపీ ఎన్నికల కదనరంగంలోకి దిగింది.

కాంగ్రెస్ పరిస్థితి……

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇమేజ్ ఉన్న షీలా దీక్షిత్ లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గానే చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో సింగిల్ సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ శాతం ఓట్లను సాధించడం కొంత ఊరట కల్గించిందనే చెప్పాలి. సోనియా గాంధీ అనారోగ్య కారణంగా ప్రచారానికి రాలేదు. దీంతో కాంగ్రెస్ బోణీ కొడుతుందా? లేదా? అన్నది కూడా అనుమానమే. తొలుత త్రిముఖ పోటీ ఉందని భావించినా చివరకు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ల మధ్యనే ఉండనుంది. మరి ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Tags:    

Similar News