దుర్మార్గపు రాతలే రాస్తారా?

రాజధాని పెట్టమని ఎవరూ కోరలేదు, గుక్కెడు నీళ్ళను అడిగారు, సాగుకు నీరుని కోరారు. వలసలు ఆపాలని కూడా అర్ధించారు. రాజధాని పెడతామని పాలకులు అంటే పోనీలే అభివృధ్ధి [more]

Update: 2020-02-05 02:00 GMT

రాజధాని పెట్టమని ఎవరూ కోరలేదు, గుక్కెడు నీళ్ళను అడిగారు, సాగుకు నీరుని కోరారు. వలసలు ఆపాలని కూడా అర్ధించారు. రాజధాని పెడతామని పాలకులు అంటే పోనీలే అభివృధ్ధి చేస్తారేమోనని కొంతవరకూ సంబరపడ్డారు. కానీ ఇపుడు అక్కడ ఏమీ పెట్టవద్దు, ఏమీ చేయవద్దంటూ విపక్షాలు విషం కక్కుతూంటే మాత్రం ఉత్తరాంధ్ర తట్టుకోలేకపోతోంది, తల్లడిల్లిపోతోంది.

కష్టమే తప్ప….

నిజానికి ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని విధాలుగా నష్టపోయిన సంగతి ఎవరికి తెలుసు. రాయలసీమలా మరో బాధిత ప్రాంతం ఈ గడ్డ. నిజంగా బంగారు పంటలు పండే ప్రాంతాలకు ఇక్కడ ప్రజల గోడు తెలియదు. ఇక్కడ ప్రజలు ఒంటి నిండా బట్ట కట్టుకోవడం కూడా ఎరుగరని తెలిస్తే ఇంతటి విషం కక్కే పరిస్థితి ఉండదేమో. విభజన కష్టాలను ఆంధ్ర ప్రదేశ్ గత అయిదేళ్ళుగానే అనుభవిస్తోంది. ఉత్తరాంధ్రా జిల్లాల విభజన కష్టాల కధ వయసు అచ్చంగా 85 ఏళ్ల పై మాటే. ఇక్కడ నదీ జలాలకు ఒకనాడు లోటు లేదు. ఒడిషా కూడా ఉత్తరాంధ్రలో భాగంగా ఉన్నపుడు సస్యశ్యామలంగానే ఉండేది

ఉత్త ఆంధ్రాగా ..:

ఎపుడైతే ఒడిషా వేరుపడి ప్రత్యేక రాష్ట్రమైందో నాటి నుంచే ఉత్తరాంధ్ర ఉత్త ఆంధ్రాగా మారిపోయింది. ఉత్తరాంధ్రాలో ప్రవహిస్తున్న నదుల మూలాలు అన్నీ కూడా ఒడిషాలోనే ఉన్నాయి. వారి వైపు నదులు ఉంటే ఇక్కడ పాయలు ఉన్నాయి. దాంతో నీటికి కటకటలాడే పరిస్థితి ఈ జిల్లాలది. ఇక సాగునీటి పరిస్థితులను గమనిస్తే శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నదిపైన నారాయణం పురం ఆనకట్ట, మహేంద్ర తనయ నదిపైన పైడిగాం ఆనకట్టలను 1965లో నిర్మాణం చేశాక మళ్ళీ ఈ వైపుగా ఎవరూ తొంగి చూడలేదు, వంగి వాలలేదు. అటువంటి దుర్భరమైన వాతావరణం ఉన్న ఈ జిల్లాల మీద పాలకులు సవతి కన్ను వేసి తరాలు గడచిపోయాయి.

గిరిజనుల సీమగా….

మరో వైపు చూసుకుంటే 12 రకాల గిరిజన తెగలతో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఉత్తరాంధ్రాలో అంతకు మించి అంటే 17 గిరిజన తెగలు ఉన్నాయి. మరి ఓ విధంగా గిరిజన ప్రాంతంగా కూడా ఉత్తరాంధ్రాను చెప్పుకోవచ్చు. ఇక్కడ అనారోగ్య పరిస్థితులు దారుణంగా ఉంటాయి. బాలింతలు, శిశు మరణాల రేటింగులో ఉత్తరాంధ్ర అగ్ర స్థానంలో ఉందంటేనే ఇక్కడ జనం ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో అర్ధమవుతుంది. ఎటు చూసిన అడ్డు గుడారాలు, అర్ధ నగ్న దేహాలతో ఈ ప్రాంత జనం తిరిగుతూంటే నాగరికత ఇంకా ఇక్కడ పుట్టలేదా, బతికి బట్ట కట్టలేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి.

వలసలకు సెలవు లేదా…?

ఇక్కడ జనం వలసలు పడుతున్నారు. బతుకుతెరువు కోసం దేశాలు పడుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మత్స్యకారులు కూడా ఇతర దేశాలకు వేటకు వెళ్ళి అక్కడ చిక్కి జైళ్ళల్లో బంధీలుగా మారిన ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయంటేనే ఈ ప్రాంతం ఎంతటి వెనకబాటుతనంతో ఉందో అర్ధం చేసుకోవాలి. అటువంటి ఉత్తరాంధ్ర అభివృధ్ధి కోసం పరిపాలనా రాజధాని ఇస్తామంటే విపక్షాలు ఎందుకు ఇంతలా రాధ్ధాంతం చేస్తున్నాయని జనం ప్రశ్నిస్తున్నారు.

కూలి అయినా దక్కేనని….:

రాజధాని వస్తే బతుకులు ఏమీ మరవు, కనీసం వలసలైనా ఆగి ఇక్కడైనా కూలి పుడుతుందన్న చిన్న ఆశ. దాన్ని కూడా కాలరాసి, కూలదోయాలనుకునే వారిపైన మాత్రం ఉత్తరాంధ్ర మండిపడుతోంది. తమ నుదుటిన ఇంకా దుర్మార్గపు రాతలే రాద్దామనుకుంటున్న రాజకీయం మీద కత్తికడుతోంది. ఎప్పటికి ఈ తీరు మారేను, ఎప్పటికి మా బతులుకు వెలిగేను అంటూ గద్దిస్తోంది. గర్జిస్తోంది.

Tags:    

Similar News