పట్టు తప్పి.. ప్రమాదపు అంచుల్లో…?

రైతు ఆందోళన దారి తప్పింది. ట్రాక్టర్ల భారీ ర్యాలీతో దేశమంతటికీ రైతన్నలు స్ఫూర్తి నింపుతారు. అన్నదాతల సంఘటిత శక్తిని చాటి చెబుతారని అంతా భావించారు. స్వాతంత్ర్య దినోత్సవం [more]

Update: 2021-01-27 16:30 GMT

రైతు ఆందోళన దారి తప్పింది. ట్రాక్టర్ల భారీ ర్యాలీతో దేశమంతటికీ రైతన్నలు స్ఫూర్తి నింపుతారు. అన్నదాతల సంఘటిత శక్తిని చాటి చెబుతారని అంతా భావించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున డిఫెన్స్ పరేడ్ వంటి ఘట్టాలు భద్రత రీత్యా చాలా సున్నితమైనవి. అయినా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న మద్దతు కారణంగా రైతు ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకతప్పలేదు. జై జవాన్, జైకిసాన్ మన ఆదరణీయ నినాదం. రెండూ ఒకేసారి శాంతియుతంగా ప్రదర్శితమవుతాయని సరిపెట్టుకున్నాం. రైతు నేతలు దీనిని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ యుతంగా నిరసన తెలిపి సర్కారుకు కళ్లు తెరిపించి ఉండాలి. కానీ అనుమతించిన రహదారులను వదిలేసి పోలీసులతో ఘర్షణకు దిగడం ద్వారా శాంతిభద్రతల అంశంగా మార్చివేశారు. దీంతో ప్రభుత్వానికి ఒక చక్కని అస్త్రం దొరికింది. ఆందోళనలోకి ఇతరులు ప్రవేశించారని సంఘర్షణకు నాయకత్వం వహిస్తున్న కిసాన్ సంఘాల బాధ్యులే ప్రకటించాల్సి వచ్చింది. ఈ ఒక్క అంశమే చాలు ప్రభుత్వం తమ ప్ర్తతాపం చూపించడానికి. అధికారపార్టీ వ్యతిరేక రాజకీయ శక్తులు దీనిని ఆలంబనగా చేసుకోవాలని చూశాయనే వాదన బలం పుంజుకుంటోంది. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా గడచిన రెండు నెలలుగా రైతులకు లభించిన సానుభూతి కరిగిపోయేందుకు ఆస్కారం ఏర్పడింది.

రోడ్డెక్కితే రణరంగమేనా…?

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో చేస్తున్న నిరసనలు భారత్ లో ప్రకంపనలు పుట్టించాయి. తొలి దశలో పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల నుంచే ప్రాతినిధ్యం ఉండేది. తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా రైతు ప్రతినిధులు పాల్లొనడం మొదలైంది. తాజాగా దక్షిణభారత దేశం నుంచి సైతం మద్దతు పెరుగుతోంది. క్రమేపీ ఉద్యమం బలపడే వాతావరణం నెలకొంది. మరికొన్ని రోజులపాటు దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తే ప్రభుత్వం ముందరికాళ్లకు బంధం వేసేందుకు అవకాశం ఏర్పడేది. ఇప్పటికే ప్రభుత్వం దిగి వచ్చింది. గత్యంతరం లేక ఏడాదిన్నరపాటు చట్టాలను నిలిపివేస్తానని ప్రకటించింది. తదుపరి నిర్ణయం రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించిన తర్వాతనే తీసుకుంటామని, చట్టాల్లో సవరణలు చేస్తామని హామీ ఇచ్చింది. దాదాపు ప్రస్తుత చట్టాలు అటకెక్కినట్లే. కనీస మద్దతు ధర, రైతు విక్రయాలకు మరింత స్వేచ్ఛ, న్యాయపరంగా పరిహారాలు వంటి వాటిని ప్రతిపాదించి చట్టాల్లో మార్పులు చేసుకొనే వెసులుబాటు వచ్చింది. కానీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు దీనిని ఇంతటితో వదిలేయాలని భావించలేదు. ఎన్డీఏ కొమ్ములు వంచడానికి ఇదే సరైన అదునుగా భావించాయి. అందువల్లనే పరిష్కారం కాకుండా తొక్కిపెట్టాయి. ఇప్పటికే రాజకీయ శక్తుల ప్రాబల్యానికి లొంగిపోయిన రైతు నాయకులు అసలు లక్ష్యాన్ని పక్కనపెట్టేశారు. ఫలితంగా పోరాటం అదుపు తప్పింది. రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ల ర్యాలీ వంటి నిర్ణయమే రాజకీయ ప్రేరేపితంగా చెప్పవచ్చు. అయితే దేశం మొత్తం అటెన్షన్ పొందేందుకు కొంతమేరకు ఈ నిర్ణయాన్ని ఆమోదించినప్పటికీ అవాంఛనీయ సంఘటనలు ఊహించకపోవడం మాత్రం నాయకుల తప్పిదమే.

ప్రభుత్వ అత్యుత్సాహం…..

చట్టాలు చేసే ముందు సంబంధిత వర్గాలను సంప్రతించి చర్చలు జరపాలి. బిల్లులపై పార్లమెంటులో చర్చించాలి. కానీ వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం నియంతృత్వంతో వ్యవహరించింది. పూర్తిగా తన పరిధిలోకి రాని వ్యవసాయాన్ని అంతర్రాష్ట్ర విక్రయాలు, వ్యాపారం అనే ముసుగులో అధీనంలోకి తెచ్చుకుంది. కరోనా వంటి క్లిష్ట సమయంలో పార్లమెంటులో ఓటింగ్ కూడా లేకుండా బిల్లులకు చట్ట రూపం ఇచ్చేసింది. అంబానీలు, అదానీల కోసమే అంటూ తేలికగా రాజకీయ విమర్శలు చేసేయవచ్చు. అయితే ప్రపంచంలోని అతిపెద్ద ఆహార గొలుసులో భారత్ ను ఒకటిగా నిలపాలనే లక్ష్యంతోనే వీటిని రూపొందించామని కేంద్రం చేస్తున్న వాదనను తోసిపుచ్చలేం. లక్ష్యానికి చేరుకునే మార్గం కూడా సక్రమంగా ఉండాలి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు. రైతుల ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధర. దానిని చట్టంలో చేర్చి ఉంటే సమస్య విషమంగా మారేది కాదు. రాజకీయంగా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యవసాయ చట్టాలు ఉపద్రవంగా పరిణమించాయి.

సుప్రీం చేతులెత్తేస్తే….?

నిజానికి రాజ్యాంగ పరంగా ఈ చట్టాల చెల్లుబాటుపై అనేక సందేహాలున్నాయి. సాధారణ పౌరులకు ఉండే ప్రాథమిక హక్కులకే భిన్నంగా ఉన్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయ చట్టాల ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు నష్టం జరిగినట్లు భావిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించకూడదనే నిబంధన చెల్లుబాటు కాదు. న్యాయపరంగా ఏ విషయంపైనైనా కోర్టులను ఆశ్రయించే ప్రాథమిక హక్కు అందరికీ ఉంటుంది. అంతేకాకుండా వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉంది. దానిపై రాష్ట్ర శాసనసభల, ప్రభుత్వాల అంగీకారం అనే విషయాన్ని విస్మరించారు. ఆయా కారణాలతో రాజ్యాంగ పరిధి, పరిమితులను అతిక్రమించినట్లు భావించి చట్టాలను రద్దు చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉంది. అయినా మధ్యవర్తి పాత్ర పోషించడానికే పరిమితమైంది. రాజ్యాంగ పరిధిలోకి వెళ్లి లోతుగా వీటిని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. సుప్రీం కోర్టు కొట్టివేసి ఉంటే సమస్య చల్లారిపోయి ఉండేది. రైతు ఉద్యమం దానంతట అదే సద్దుమణిగిపోయేది. అటు ప్రభుత్వం, ఇటు న్యాయవ్యవస్థ వైఫల్యం చెందడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. జై కిసాన్ నినాదంతో శ్రేయో రాజ్యమైన భారత్ కు ఇది ఏమంత మంచి పరిణామం కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News