థర్డ్ వేవ్ మామూలుగా ఉండదట

కరోనా సెకండ్ వేవ్ కే భారత్ వణికిపోతుంది. అయితే ధర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే థర్డ్ వేవ్ [more]

Update: 2021-05-12 18:29 GMT

కరోనా సెకండ్ వేవ్ కే భారత్ వణికిపోతుంది. అయితే ధర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే థర్డ్ వేవ్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు అల్లాడి పోతున్నారు. రోజుకు దాదాపు నాలుగు లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు. మూడు వేల మంది వరకూ మరణిస్తున్నారు.

దీన్నుంచి బయటపడటమే…?

సెకండ్ వేవ్ నుంచి భారత్ బయటపడటమే కష్టంగా ఉంది. మే నెలాఖరు వరకూ సెకండ్ వేవ్ తీవ్రత ఉంటుందని చెబుతున్నారు.ప్రధానంగా పది రాష్ట్రాల్లో ఈ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కేసులు ఆగడం లేదు. ఇప్పటికే కరోనా బారిన పడి రెండున్నర లక్షల మంది వరకూ చనిపోయారు. అనేక నగరాల్లో ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ ను అందించేందుకు ప్రభుత్వాలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి.

పది రాష్ట్రాల్లో…..

ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, చత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజారత్, రాజస్థాన్ లలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వీకెండ్ లాక్ డౌన్ ను ప్రకటించింది. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. పూర్తి స్థాయి లాక్ డౌన్ పెట్టకపోతే వైద్య సిబ్బంది చేతులెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముందు జాగ్రత్తగా….?

సెకండ్ వేవ్ తీవ్రత ఇంత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సయితం ఊహించలేదు. తొలిదశ కరోనా నుంచి తేలిగ్గా బయటపడ్డామని భావించి కంటితుడుపు చర్యలు తీసుకుంది. దీంతో సెకండ్ వేవ్ లో ఫలితం అనుభవించాల్సి వస్తుంది. అందుకే థర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకోవడంతో పాటు ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు కూడా థర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

Tags:    

Similar News