ప్రతిష్టను కాపాడుకోగలిగితేనే మంచిది

ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యూడిషరీ… వ్యవస్థలు మూడూ స్వతంత్రమైనవే. రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంది. దురదృష్టం ఏమంటే ఎగ్జిక్యూటివ్ ఇప్పటికే తన స్వతంత్రాన్ని కోల్పోయింది. లెజిస్లేచర్ కు సబార్డినేట్ [more]

Update: 2020-08-08 09:30 GMT

ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యూడిషరీ… వ్యవస్థలు మూడూ స్వతంత్రమైనవే. రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంది. దురదృష్టం ఏమంటే ఎగ్జిక్యూటివ్ ఇప్పటికే తన స్వతంత్రాన్ని కోల్పోయింది. లెజిస్లేచర్ కు సబార్డినేట్ గా పనిచేస్తోంది. జ్యుడిషియరీ కూడా రాష్ట్రాల్లో స్వతంత్రంగా ఉన్నట్టు కనిపించినా అది ఢిల్లీలో లెజిస్లేచర్ కు తన హైరార్కీ కి కట్టుబడే పనిచేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

ముందూ.. తర్వాత…..

న్యాయమూర్తులు కొందరు ఆ పదవికి ముందూ, ఆ పదవీ విరమణ తర్వాతా లెజిస్లేచర్ ఆధిపత్యంలో భాగస్వాములవుతున్నారు. న్యాయమూర్తుల నియామకంలో, బదిలీల్లో కూడా లెజిస్లేచర్ జోక్యం ఉందనేది అనేక సందర్భాల్లో రుజువైంది. అయినా లెజిస్లేచర్ కు, జ్యుడిషియరీకి తరచుగా ఘర్షణ వస్తోంది. లెజిస్లేచర్ లో ఉన్న రెండు సభలకు తోడు “మూడో సభ”గా పనిచేసేందుకు జ్యుడిషియరీ ప్రయత్నిస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి.

అర్థవంతంగా జరగాలి….

లెజిస్లేచర్ లో స్పీకర్ వ్యవస్థ అధికారంపై అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి. ఈ చర్చలు మరింత విస్తృతంగా, అర్ధవంతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు స్పీకర్ వ్యవస్థపై ఉన్న గౌరవం ఇప్పుడు ఉన్నట్టు లేదు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టు కూడా అనుకోలేం. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో ఎంతమేరకు జోక్యం చేసుకోవచ్చు అనేది స్పష్టంగా నిర్ధారణ జరగాలి.లెజిస్లేచర్ మాత్రమే తప్పులు చేస్తుంది, లెజిస్లేచర్ లో మాత్రమే అవినీతి, బంధుప్రీతి, ఆశ్రీతపక్షపాతం ఉన్నాయని అనుకుంటే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని మిస్ అవుతాం.

ఎన్నకల్లో ప్రత్యర్థి అంటూ…

“ఫలానా స్పీకర్ తన ఎన్నికకు ముందు నాకు రాజకీయ ప్రత్యర్థి” అని ఒక రాజకీయ నేత బహిరంగంగా ప్రకటించే రోజులు చూస్తున్నాం. 2014 లో సత్తెనపల్లి బరిలో ప్రత్యర్థులుగా ఉన్న అంబటి రాంబాబు, కోడెల శివప్రసాదరావు విషయంలో ఇలాంటి చర్చ కొంత జరిగింది. “ఫలానా న్యాయమూర్తి పూర్వాశ్రమంలో (న్యాయవాదిగా ఉన్నప్పుడు) నా రాజకీయ ప్రత్యర్థి” అని ఒక రాజకీయ నాయకుడు ప్రకటించే పరిస్థితి రాకముందే న్యాయవ్యవస్థ మేలుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది. ఇది జరిగితే జ్యుడిషియరీ తన ప్రతిష్టను కాపాడుకోగలుగుతుంది.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News