ఎరవేసినా చిక్కడం లేదా?

రేపు ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో విశ్వాస పరీక్షకు దిగక తప్పదు. తొలుత కాంగ్రెస్, జేడీఎస్ లు బలపరీక్షను మంగళవారం వరకూ పొడిగించాలని చూసినా గవర్నర్ వాజూబాయి వాలా [more]

Update: 2019-07-21 17:30 GMT

రేపు ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో విశ్వాస పరీక్షకు దిగక తప్పదు. తొలుత కాంగ్రెస్, జేడీఎస్ లు బలపరీక్షను మంగళవారం వరకూ పొడిగించాలని చూసినా గవర్నర్ వాజూబాయి వాలా సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. బలపరీక్షకు సోమవారమే ఆఖరి రోజుగా గవర్నర్ గడువు విధించారు. సోమవారం కూడా నానిస్తే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలనను కర్ణాటకలో పెడతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.

రంగంలోకి దేవెగౌడ….

ఇక కుమారస్వామి విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కడానికి కాంగ్రెస్, జేడీఎస్ లు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి. మానసికంగా రెండు పార్టీలు ఓటమికి సిద్ధమయినప్పటికీ ఎక్కడో ఒక మూల ఆశ. ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడ రంగంలోకి దిగారు. అసంతృప్తితో పార్టీ నుంచి వెళ్లిపోయిన ముగ్గురు జనతాదళ్ ఎస్ సభ్యులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి సత్ఫలితాలు దక్కలేదు. జేడీఎస్ సభ్యులు ముగ్గురూ తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు.

కాంగ్రెస్ రెబెల్స్ పై…..

దీంతో దేవెగౌడ కాంగ్రెస్ కు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారు. ఆయన ఇటీవల అసంతృప్తి గూటికి వెళ్లి తిరిగి సొంత పార్టీకి వచ్చిన రామలింగారెడ్డితో భేటీ అయి చర్చించారు. విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కితే రామలింగారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఆయనతో పాటు ముంబయి వెళ్లిన మరో నలుగురు ఎమ్మెల్యేలను తిరిగి రప్పించే బాధ్యతను రామలింగారెడ్డిపై దేవెగౌడ ఉంచినట్లు తెలుస్తోంది.

రిసార్టుల్లోనే

మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ లు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరినీ రిసార్ట్ ల్లోనే ఉంచారు. ఎవరినీ సొంత పనులు ఉన్నాయని చెబుతున్నా బయటకు వదలిపెట్టడం లేదు. రేపు నేరుగా శాసనసభకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నానికి కుమారస్వామి బలపరీక్ష ఉండే అవకాశముంది. దీంతో రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను కట్టుబాటు చేశారు. భారతీయ జనతా పార్టీ మాత్రం అత్యధిక సభ్యులు తమ చెంతనే ఉన్నారని, విజయం తమదేనన్న ధీమాతో ఉంది. మొత్తం మీద దేవెగౌడ కుమారుడి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో? లేదో? చూడాలి.

Tags:    

Similar News