గిడ్డి ఈశ్వరిని పక్కన పెడుతున్నారా…?

విశాఖ ఏజెన్సీలో టీడీపీకి ఫిరాయింపుదారులే ఇంపు అవుతున్నారు. పాడేరు, అరకు ఎమ్మెల్యేలుగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు గెలిచారు. తరువాత కాలంలో [more]

Update: 2019-02-07 02:30 GMT

విశాఖ ఏజెన్సీలో టీడీపీకి ఫిరాయింపుదారులే ఇంపు అవుతున్నారు. పాడేరు, అరకు ఎమ్మెల్యేలుగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు గెలిచారు. తరువాత కాలంలో ఈ ఇద్దరూ సైకిలెక్కేశారు. గత ఏడాది కిడారి మావోయిస్టుల చేతుల్లో దారుణంగా హత్య కావించబడ్డారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కూడా చనిపోయారు. కిడారి వారసునిగా పెద్ద కుమారుడు శ్రావణ్ ని మంత్రిని చేసిన బాబు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా కేటాయించారు. ఇక్కడ టికెట్ కోసం పోటీ పడిన సివేరి సోమ మరణించడంతో ఆయన కుటుంబానికి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక పాడేరులో చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మళ్లీ టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. దీంతో మాజీ మంత్రి మణికుమారి ఈ పరిణామాలతో నిరాశ చెందుతున్నారు.

బాబు మెప్పుకోలు కోసం

ఈ నేపధ్యంలో గత కొంతకాలంగా ఆమె చంద్రబాబు మెప్పు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తన బలాన్ని చూపించుకుని మరీ టికెట్ కోసం గట్టిగానే పైరవీలు చేసుకుంటున్నారు. తాను గతంలో సమర్ధంగా మంత్రి పదవిని నిర్వహించానని, మరో మారు అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని ఈ మధ్య తరచూ ఆమె చెబుతున్నారు. అంటే పాడేరు నుంచి తనకే టికెట్ ఇవ్వాలని ఆమె చెప్పకనే చెబుతున్నారన్నమాట. ఇక తన రాజకీయ ప్రస్థానం గురించి ఆమె చెబుతూ ఓ సాధారణ డ్వాక్రా మహిళగా ఉన్న తనను బాబు ఆదరించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేశారని ఆమె పొగడ్తలతో ముంచెత్తుతున్నారు మరి ఆమె మొర బాబు విని టికెట్ ఇస్తారా అనందే ఇక్కడ చూడాలి.

గిడ్డికి వ్యతిరేకత

గత ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరి వైసీపీ నుంచి గెలిచినా ఆమె టీడీపీలోకి రావడంతో తన వర్గం వారికే ప్రాధ్యాంత ఇస్తూ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని పక్కన పెడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా ఆమె గెలిచింది టీడీపీ మీద. వైసీపీలో ఉన్నపుడు వారి మీద ఆమె ఆధిపత్యం చేస్తూ అవమానాలు చేశారని, ఇపుడు ఆమె తమ పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఎలా ఆదరించగలమని తమ్ముళ్లు అంటున్నారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఫరవాలేదని గిడ్డికి ఇస్తే మాత్రం సహకరించలేమని కూడా అంటున్నారు. మణికుమారి ఈ విభేదాలను ఆసరాగా చేసుకుని గిడ్డిని తప్పించి టికెట్ తనకే ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే కిడారి కుటుంబానికి, గిడ్డికి మధ్య బంధుత్వం ఉండడం, సర్వేశ్వరరావు ఒత్తిడి వల్లనే ఆమె టీడీపీలోకి చేరడంతో మంత్రి శ్రావణ్ ఆమెకే టికెట్ దక్కేలా చూస్తున్నారని అంటున్నారు. మరి అటు గిరిజనుల్లో వ్యతిరేకత, ఇటు పార్టీలో సహాయ నిరాకరణ వల్ల గిడ్డిని చివరి నిమిషంలో బాబు పక్కన పెడతారని, మాజీ మంత్రి మణి కుమారికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. చూడాలి మణి కుమారి ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో.

Tags:    

Similar News