అచ్చెన్న కొత్త రాజకీయానికి తెరలేపుతారా ?

బోధి వ్రుక్షం వద్ద కూర్చుంటే జ్ణానోదయం కలుగుతుంది. ఎవరేమనుకున్నా అనుకోని విషయాలు కొన్ని జరిగితే వారు వీరు అవుతారు. జగన్ 16 నెలల జైలు జీవితం ఆయనలో [more]

Update: 2020-08-29 12:30 GMT

బోధి వ్రుక్షం వద్ద కూర్చుంటే జ్ణానోదయం కలుగుతుంది. ఎవరేమనుకున్నా అనుకోని విషయాలు కొన్ని జరిగితే వారు వీరు అవుతారు. జగన్ 16 నెలల జైలు జీవితం ఆయనలో కొత్త మార్పు తెచ్చింది. ఇక వైఎస్సార్ పాదయాత్ర చేసిన తరువాత తన కోపం నరాన్ని తెగ్గొట్టుకున్నానని చెప్పేవారు. ఇవన్నీ ఎందుకంటే పెద్ద గొంతు అచ్చెన్నాయుడు ఏకంగా 76 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఇపుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. అచ్చెన్నాయుడు అంటే చంద్రబాబుకు వెన్ను దన్ను అన్న సంగతి తెలిసిందే. అలాగే బాబు అంటే కూడా అచ్చెన్నాయుడు వీర విధేయత. భక్తి ప్రపత్తులు చాలా ఎక్కువే.

అదీ బాధ…..

అయితే ఏదైనా గీటు పెడితేనే బంగారమో ఇత్తడో తెలిసేది. ఇపుడు అచ్చెన్నాయుడు కష్టాలు పడ్డారు. దాదాపుగా మూడు నెలల పాటు ఆయన బయట ముఖం చూడలేదు. ఇపుడు కూడా కేసు అలాగే ఉంది. పైగా గట్టిగా బిగుసుకుని ఉంది. ఈఎస్ ఐ స్కాం లో అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందని ఏసీబీ నిగ్గు తేల్చిన వేళ బెయిల్ వచ్చినా కేసు కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపధ్యంలో అచ్చెన్న తీరు ఎలా ఉంటుంది అన్నది ఒక చర్చగా ఉంది. చంద్రబాబు మీద ఈగ వాలకుండానే నోరు చేసుకునే అచ్చెన్నాయుడు ఇకమీదట కూడా అలాగే ఉంటారా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇలా అరెస్ట్ అయి అలా బయటకు వచ్చేస్తాడు అనుకున్న అచ్చెన్న లాంటి బిగ్ షాట్ కే చుక్కలు కనిపించాయి. ఇక టీడీపీ అధినాయకత్వం తమ‌ వెనక ఉందన్న భరోసా అచ్చెన్నాయుడు, కింజరాపు కుటుంబానికి ఇంతదాకా ఉండేది. అయితే అంతా న్యాయ ప్రకారమే ఒక ప్రొసీజర్ గా జరిగింది. బెయిల్ అలాగే వచ్చింది తప్ప మరేమీ జరగలేదు. పైగా రాజకీయ ప్రకంపనలు కూడా చోటు చేసుకోలేదు. పార్టీ పరంగా కూడా హడావుడి లేదు. ఇది కదా అచ్చెన్నాయుడు సహా కింజరాపు కుటుంబం బాధ.

ఊపు ఉంటుందా ?

ఈ పరిణామాల నేపధ్యంలో మునుపటి అచ్చెన్నాయుడు ఊపూ, దూకుడుని చూడగలమా అని సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. ఇంతదాకా అయినదానికీ కానిదానికీ నోరు పారేసుకునే అచ్చెన్నాయుడు ఇపుడు బాగా తగ్గుతారు అన్న మాట కూడా పార్టీ వర్గాల నుంచి వస్తోంది. పైగా కష్టకాలంలో తనవారెవరో, పరవారెవరో కూడా అచ్చెన్నాయుడుకు తెలిసివచ్చి ఉంటుందని అంటున్నారు. ఇక బీసీ కార్డు కూడా ఎక్కడా వర్కౌట్ కాలేదు. మా నేతలకు ఏమైనా జరిగితే మేము ఊరుకోమంటూ బాబు నాడు చేసిన హెచ్చరికలు కూడా ఎక్కడో కొట్టుకుపోయాయి. రాజకీయంగా చూసుకున్నా అచ్చెన్నాయుడుకు ఈ అరెస్ట్ వల్ల పొలిటికల్ మైలేజ్ ఏదీ రాలేదు సరికదా మైనస్ అయిందని కూడా అంటున్నారు.

అదే జరిగితే …?

ఇక అచ్చెన్నాయుడు వైసీపీ టార్గెట్ అని అర్ధమైపోయింది. ఆయన బెయిల్ మీద వచ్చినా కూడా విపక్షంలోనే ఉన్నారు. పైగా ఇదివరకులా పెద్ద నోరు చేసుకోలేరు. అలా కనుక చేసుకుంటే జగన్ సర్కార్ ఏం చేస్తుందో శాంపిల్ ఒకటి చూపించింది. ఈ పరిణామాల నేపధ్యంలో అచ్చెన్నాయుడు కొత్త రాజకీయమే మొదలెడతారు అంటున్నారు. కర్ర విరగకుండా పాము చావకుండా ఆ రాజకీయం ఉంటుందని కూడా తెలుస్తోంది. మరీ వెర్రి ఆవేశానికి పోయి అధినాయకత్వానికి వీర విధేయత చూపిస్తే తాను బుక్ అవుతాను అన్న సత్యాన్ని కూడా ఆయనకు ఈ అరెస్ట్ ఎపిసోడ్ ద్వారా అర్ధమైపోయిందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అచ్చెన్నాయుడు కనుక కొత్త వేషం కడితే చంద్రబాబుకు, టీడీపీకి భారీ షాక్ గానే చెప్పాలి. మరి రాజకీయ గండర గండడు చంద్రబాబు అచ్చెన్నను ఎలా లైన్లో పెడతారో, మునుపటి ఉత్సాహం ఎలా తీసుకువస్తారో కూడా చూడాల్సిన అంశమే.

Tags:    

Similar News