ఆప్షన్లు ఓపెన్ చేసి పెట్టుకున్నారా?

మెగాస్టార్ చిరంజీవి ఆలోచనలు, అడుగుల మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన వర్తమాన సామాజిక అంశాలను, రాజకీయ అంశాలను జాగ్రత్తగా పరిశీలించడమే కాదు, తనదైన [more]

Update: 2019-12-14 12:30 GMT

మెగాస్టార్ చిరంజీవి ఆలోచనలు, అడుగుల మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆయన వర్తమాన సామాజిక అంశాలను, రాజకీయ అంశాలను జాగ్రత్తగా పరిశీలించడమే కాదు, తనదైన శైలిలో స్పందిస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి ఒక మారు రాజ్యసభకు నెగ్గారు, అదే విధంగా తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. ఆయన మొత్తం పొలిటికల్ కెరీర్ 2008లో మొదలై 2918తో ముగిసింది. చిరంజీవి సినిమాల్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చినా కూడా సామాజిక అంశాలనే కధాంశంగా చేసుకుని నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. చిరంజీవి వయసు ఇపుడు 65 ఏళ్ళు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు డెబ్బయ్యేళ్ళు వస్తాయి. అయితే శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉన్న చిరంజీవికి ఈ వయసు అడ్డంకి ఏదీ లేదని అంటున్నారు.

తమ్ముడికి భిన్నంగా…..

చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు విరామం మాత్రమే ప్రకటించారు తప్ప ఫుల్ స్టాప్ పెట్టలేదని సన్నిహితులు అంటున్నట్లుగా సమాచారం. విభజన తరువాత రాజకీయాలు కొంత గందరగోళంగా మారడంతో అప్పట్లో చిరంజీవి కొంత చురుకుగా ఉండలేకపోయారని అంటున్నారు. ఇపుడు మాత్రం ఆయన సమయం చూసి తనదైన పంధాలో మరో మారు అరంగేట్రం చేస్తారని అంటున్నారు. అయితే చిరంజీవి రాజకీయ అడుగులు తమ్ముడుకు భిన్నంగా సాగడం విశేషం. ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారు. జగన్ సర్కార్ మంచి చేస్తే మెచ్చుకుంటున్నారు. దిశ చట్టాని ఏపీ ప్రభుత్వం తీసుకురావడం పట్ల మెగాస్టార్ మనస్పూర్తిగా స్పందిస్తున్నారు. ఆయన ఘర్షణ పూరిత రాజకీయాలు కాకుండా పెద్ద తరహాలో ఉండాలనుకుంటున్నారు. అది జనసేనాని పవన్ కి కొంత ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు.

రూట్ ఎటువైపో….?

నిజానికి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తానంటే రెడ్ కార్పెట్ పరచే పార్టీలు చాలానే ఉన్నాయి. బీజేపీ అందులో మొదటిగా ఉంటుంది. ఆ మధ్య బీజేపీ పెద్ద నాయకులు సైతం చిరంజీవికి టచ్ లోకి వెళ్ళి తమ పార్టీలోకి ఆహ్వానించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే చిరంజీవి నిదానమే ప్రదానమని భావిస్తున్నారుట. గతంలో చేసిన తప్పులను ఆయన సరిదిద్దుకోవడం ద్వారా ఈసారి పక్కా ప్రణాళికతో రావాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. 2024 నాటికి రాజకీయాలు ఇలా ఉండవని, బాగా మారుతాయని చిరంజీవితో పాటు ఆయన సన్నిహితులు అంచనా వేసుకుంటున్నారుట. అంటే కాంగ్రెస్ కి కూడా మంచి రోజులు వస్తాయని వారు భావిస్తున్నారుట. అందువల్ల ఆప్షన్లు అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే అప్పటికి తగినట్లుగా రంగంలోకి రావచ్చునన్నది ఒక ఎత్తుగడగా ఉందని అంటున్నారు.

జనసేన నుంచేనా….?

ఇకపోతే చిరంజీవికి సొంత ఇంట్లోనే ఒక పార్టీగా జనసేన ఉంది. చిరంజీవి అంటే అభిమానించే పవన్ కళ్యాణ్ అన్నయ్య తన పార్టీలో చేరుతాను అంటే స్వాగతించడ‌మే కాదు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేందుకు కూడా వెనకంజ వేయడన్నది తెలిసిందే. ఇక జనసేనలో మెగాస్టార్ చేరితే ఆ పార్టీ రూపమే మారుతుందని కూడా అంటున్నారు. పవన్ కంటే ఎక్కువ అనుకూలత చిరంజీవికి అన్ని వర్గాల్లో ఉండడమే దీనికి కారణం. ఇపుడు టీడీపీ, వైసీపీల్లో ఉన్న ఒకనాటి ప్రజారాజ్యం మాజీలు అంతా కూడా మళ్ళీ చిరంజీవి కేంద్రంగా కొత్త రాజకీయాలు చేస్తారని కూడా అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా కొంత వరకూ పుంజుకుంటే చిరంజీవికి పెద్ద పీట వేస్తుందని అంటున్నారు. ఇలా చాలా వైపుల నుంచి చిరంజీవికి రాజకీయ స్వాగతాలు ఉంటాయని చెబుతున్నారు.

అదే నమ్మకమా…?

చిరంజీవి అయినా పవన్ అయినా రాజకీయాలపై పెద్ద ఆశలు పెట్టుకోవడానికి ఏపీ రాజకీయ పరిస్థితులే కారణం అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం వేగంగా క్షీణించడంతో పాటు వైసీపీకి గట్టి ప్రత్యర్ధి పార్టీ లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. ఇక జాతీయ పార్టీలు ఉనికి పెద్దగా లేని చోట సరైన వ్యూహంతో ముందుకు వస్తే వైసీపీని ఢీ కొట్టవచ్చునన్న ఆశలే ఇపుడు మెగాస్టార్ అలోచనలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. 2024 నాటికి తన సినిమా కమిట్ మెంట్స్ పూర్తి చేసుకుని పొలిటికల్ రీ ఎంట్రీ మెగాస్టార్ ఇస్తారని ప్రచారం మాత్రం జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News