జోబైడెన్ ఆ నిర్ణయాన్ని అమలుపర్చక తప్పదు.. భారత్ కు లాభమేగా?

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత ఆయన చైనా పట్ల ఒకింత సానుకూలంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ అంత దూకుడుగా జో [more]

Update: 2021-01-19 16:30 GMT

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత ఆయన చైనా పట్ల ఒకింత సానుకూలంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ అంత దూకుడుగా జో బైడెన్ ఏనాడూ వ్యవహరించలేదు. ఎన్నికల ప్రచారంలోనూ బీజింగ్ పట్ల సంయమనాన్నే ప్రదర్శించారు. ట్రంప్ మాదిరిగా కోరి కయ్యానికి కాలు దువ్వే విధానానికి దూరంగా ఉండేవారు. తాజాగా అధ్యక్షుడు ట్రంప్ టిబెట్ విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20న బాధ్యతలు చేపట్టనున్న బైడెన్ ఈ నిర్ణయాన్ని అమలు చేయక తప్పదు. తాజా నిర్ణయం భారత్ కు కూడా సానుకూలమైనదే. అదే సమయంలో ఇది కచ్చితంగా చైనాకు మింగుడు పడని నిర్ణయమే. దీనిపై బీజింగ్ కారాలు మిరియాలు నూరుతోంది.

చెక్ పెట్టే నిర్ణయాన్ని….?

టిబెట్ లో చైనాకు చెక్ పెట్టే నిర్ణయాన్ని వాషింగ్టన్ తీసుకుంది. టిబెట్ బౌద్ధమతాధినేత దలైలమా వారసుడి ఎంపికలో చైనా జోక్యాన్ని నివారించే ఉద్దేశంతో ఒక బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం టిబెట్ రాజధాని లాసా నగరంలో తమ దౌత్య కార్యాలయాన్ని తెరిచేందుకు చైనా అనుమతించనంతవరకు అమెరికాలో చైనా కొత్తగా దౌత్య కార్యాలయాలు తెరిచేందుకు అంగీకరించదు. అంతేకాక టిబెట్ లో, భారత్ లో నివసించే టిబెట్ ప్రజలకు ఆర్థిక సహాయం అందించడానికి అమెరికా రూపొందించిన తాజా బిల్లు అవకాశం కల్పిస్తుంది. కొత్త దలైలమా ఎంపికకు అడ్డుపడే చైనా ప్రభుత్వాధికారులు, కమ్యూనిస్టు పార్టీ అధికారులు అమెరికాలో పర్యటించకండా ఆంక్షలు విధించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

స్వతంత్ర దేశమయినప్పటికీ…..

టిబెట్ వాస్తవానికి చైనాలో భాగం కాదు. భారత్ – చైనా మధ్యలో గల ఇది ఓ స్వతంత్ర దేశం. 1949లో ఏర్పడిన చైనా 1950లో టిబెట్ ను ఆక్రమించుకుంది. 1959లో టిబెటన్లు చైనాపై తిరగబడ్డారు. అప్పట్లో టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు, బౌద్ధ మత గురువు దలైలమా శరణార్థిగా భారత్ కు వచ్చారు. అప్పటి నుంచి ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దలైలమాకు ఆశ్రయం ఇవ్వడం, ప్రవాస ప్రభుత్వాన్నినడుపుకునే అవకాశం భారత్ కల్పించడంపై సహజంగానే చైనా గుర్రుగా ఉంది. టిబెట్ చైనాలో అంతర్భాగమని భారత్ అధికారికంగా ప్రకటించినప్పటికీ దలైలమా అంశం రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రతిబంధకంగా మారిందన్న ది చేదునిజం.

నాలుగేళ్లుగా కరకు వైఖరి…..

దక్షిణాఫ్రికా అంతటి వైశాల్యం గల టిబెట్ జనాభా దాదాపు 30 లక్షలే. చైనాలోని వివిధ ప్రావిన్సులు ఆక్రమించిన టిబెట్ భూభాగంలో మరో 30 లక్షల మంది నివసిస్తున్నారు. ఆధునిక చైనా భూభాగంలో 25 శాతం టిబెట్ దే. అయితే చైనా జనాభాలో టిబెటన్ల వాటా కేవలం 0.5 శాతమే కావడం గమనార్హం. ఇప్పటివరకు చైనా పట్ల, ముఖ్యంగా టిబెట్ విషయంలో అగ్రరాజ్యం చూసీచూడనట్లు, ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయంగా బీజింగ్ ఎదుగుదల తనకు ఇబ్బందికరమని గ్రహించిన ట్రంప్ నాయకత్వంలోని వాషింగ్టన్ గత నాలుగేళ్లుగా కరకువైఖరిని అవలంబించింది. తాజాగా టిబెట్ విషయంలోనూ మొండిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. కొత్తగా అధికార పగ్గాలు అందుకోనున్న జో బైడెన్ కూడా ఈ మేరకు ముందుకు సాగకతప్పదు. వాషింగ్టన్ తాజా నిర్ణయం న్యూఢిల్లీకి నైతిక మద్దతు కలిగించేదనడంలో సందేహం లేదు. పరోక్షంగా ఈ నిర్ణయం బీజింగ్ పై ఒత్తిడిని పెంచుతుంది. ప్రభావాన్ని చూపుతుంది. దాని దూకుడుకు ముకుతాడు వస్తుంది. మున్ముందు ఎలా
ఉంటుందో చూడాలి మరి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News