మళ్లీ దూరం పెరిగిందా?

తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే టీఆర్ఎస్ లో కొందరు కీలక నేతలు దూరంగా ఉన్నట్లే కనపడుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ [more]

Update: 2020-12-31 11:00 GMT

తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే టీఆర్ఎస్ లో కొందరు కీలక నేతలు దూరంగా ఉన్నట్లే కనపడుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా రిజల్ట్ రావడంతో టీఆర్ఎస్ నేతల్లో అంతర్మధనం ప్రారంభమయిందంటున్నారు. అందుకే తాము అధినాయకత్వంతో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లే కనపుడుతుంది. అందులో ఈటల రాజేందర్ ఒకరు.

కీలకనేతగా….

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈటల రాజేందర్ కీలకమైన నేత. ఉద్యమ సమయం నుంచి ఆయన పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కీలక భూమిక పోషించారు. కేసీఆర్ చెప్పిన వెంటనే పదవులకు రాజీనామా చేశారు. అందుకే ఈటల రాజేందర్ అన్నట్లుగానే తెలంగాణ ఉద్యమంలోనూ, టీఆర్ఎస్ జెండా మోయడంలోనూ ఆయన భాగస్వామ్యం ఏమాత్రం తీసివేయలేనిదనే చెప్పాలి.

అదే జిల్లాకు చెందిన నేతగా….

గత కొద్దిరోజులుగా బీజేపీ టీఆర్ఎస్ పై ఒంటికాలి మీద లేస్తుంది. ప్రధానంగా కరంనగర్ జిల్లాకు చెందిన బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన నాటి నుంచి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ ఫాం హౌన్ మీద, ప్రగతిభవన్ ల మీద ఆయన నిత్యం విమర్శలు చేస్తున్నారు. కానీ అదే జిల్లాకు చెందిన ఈటల రాజేందర్ మాత్రం కేసీఆర్ మీద మాటల దాడి చేస్తున్నా కనీసం ఖండించిన పాపానపోలేదు.

మౌనం అందుకనేనా?

కరోనా సమయంలో నిత్యం ప్రగతి భవన్ కు వెళ్లిన ఈటల రాజేందర్ కు గత మూడు నెలల నుంచి మళ్లీ నో ఎంట్రీ బోర్డు పెట్టారంటున్నారు. నిత్యం మీడియా సమావేశాలు కరోనా సమయంలో నిర్వహించిన ఈటల రాజేందర్ కేసీఆర్ పై రాజకీయ ఆరోపణలు చేస్తున్నా స్పందించడం లేదు. కరీంనగర్ రాజకీయాల్లోనూ ఆయన జోక్యం చేసుకోవడం లేదట. మొత్తం మీద ఈటల రాజేందర్ వ్యవహారం పార్టీలో మరోసారి చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News