ఈటల భయానికి అదే కారణమా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భయపడుతున్నారా? ఉప ఎన్నికల్లో విజయంపై ఆయనకు అనుమానాలున్నాయా? అంటే ఆయన వ్యవహార శైలి చూస్తే అవును అనక తప్పదు. పదే పదే [more]

Update: 2021-07-14 11:00 GMT

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భయపడుతున్నారా? ఉప ఎన్నికల్లో విజయంపై ఆయనకు అనుమానాలున్నాయా? అంటే ఆయన వ్యవహార శైలి చూస్తే అవును అనక తప్పదు. పదే పదే కోట్లాది రూపాయలు అధికార పార్టీ హుజూరాబాద్ లో డంప్ చేస్తుందని, నేతలను కొనుగోలు చేస్తుందని ఈటల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యల వెనక భయమే కనపడుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకముందే ఆయన నియోజకవర్గాన్ని వదలిపెట్టకపోవడానికి కూడా కారణమిదే.

టీఆర్ఎస్ ట్రాక్ రికార్డు…..

అధికార పార్టీ ట్రాక్ రికార్డు చూసినా అదే అనిపించక మానదు. ఈటల రాజేందర్ ఊహించని పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే ఆత్మగౌరవంతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఈటల ఎమ్మెల్సీ పదవికి కూడా కొంత గ్యాప్ తీసుకుని రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన గంటల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపారు. అంటే ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో సన్నద్దమయిందన్న మాట.

నేతలను ట్రాప్ చేస్తుండటంతో….

ఇక వరసగా నేతలు తనను వీడి పోతుండటం కూడా ఈటల రాజేందర్ ను కలవర పరుస్తుంది. ఈటల విధిలేని పరిస్థితుల్లోనే బీజేపీలో చేరారు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంత అండ ఉంటుందని ఆయన భావించారు. కానీ హుజూరాబాద్ లో పార్టీకి ఏమాత్రం ఓటు బ్యాంకు లేదు. ఏమున్నా తన వ్యక్తిగత ఇమేజ్ తోనే ఓట్లు సంపాదించాల్సి ఉంటుంది. అధికార పార్టీ దూకుడు ముందు తాను నిలబడగలనా? అన్న సందేహం ఆయనకు మొదటి నుంచి ఉంది.

సింబల్ కూడా….

అందుకే ఈటల రాజేందర్ ముందు నుంచే హుజూరాబాద్ లో కోట్లు కుమ్మరిస్తున్నారని, నేతలను ప్రలోబపెడుతున్నారని, ప్రజలను మాత్రం కొనుగోలు చేయలేరని పదే పదే చెబుతున్నారు. ఆరుసార్లు టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన ఈటల రాజేందర్ కు ఈసారి కమలం సింబల్ కాపు కాస్తుందా? అన్నది అనుమానమే. అందుకే ఆయనలో ఆ భయం, తొట్రుపాటు కన్పిస్తున్నాయి. కేసీఆర్ వ్యూహాలు తెలిసిన వాడు కావడంతో ఈటల రాజేందర్ భయానికి అర్థముంది.

Tags:    

Similar News