ఈటల రాజకీయం ముగిసినట్లేనా?

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆత్మగౌరవం నినాదం పేరిట ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. [more]

Update: 2021-06-16 11:00 GMT

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆత్మగౌరవం నినాదం పేరిట ఈటల రాజేందర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హుజూరా బాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటం విశేషం. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని చాలా మంది ఇప్పటికీ తప్పుపడుతున్నారు.

ఉద్యమ కాలం నుంచి….

ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయనకు అదే రకమైన గుర్తింపు ఇచ్చింది. శాసనసభ పక్ష నేతగా, మంత్రిగా ఆయనకు అనేక అవకాశాలు కల్పించిందన్నది వాస్తవం. అయితే కేసీఆర్ పోకడలను సహించలేని ఈటల రాజేందర్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఆ గ్యాప్ పెరిగి చివరకు తనను బర్త్ రఫ్ చేసే వరకూ దారి తీసింది. మొన్నటి వరకూ లెక్కలు గురించి మాట్లాడిన ఈటల రాజేందర్ ఇప్పుడు విలువలు మాట్లాడితే అర్థం ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

కొత్త పార్టీ పెడితే?

ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారని అందరూ భావించారు. కొత్త పార్టీకి తెలంగాణలో స్పేస్ ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే ఈటల కొత్త పార్టీ పెడితే అనేక మంది నేతలు వచ్చి చేరేవారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాములు నాయక్ వంటి వారే కాకుండా కోదండరామ్ వంటి వారు కూడా తమ మద్దతును ప్రకటించేవారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకుండా ఉండేది. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయన పక్కన ఉన్న నేతలే జీర్ణించుకోలేక పోతున్నారు.

బీజేపీలో చేరిక…..?

బీజేపీలో చేరితే ఈటల రాజేందర్ రాజకీయ జీవితం ముగిసినట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఉప ఎన్నికలలో గెలిచినా ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కష్టమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని ఉంటే కొంత ఇమేజ్ పెరిగి ఉండేదని, ఇప్పుడే బీజేపీకి దేశ వ్యాప్తంగా ఎదురుగాలులు వీస్తున్న సమయంలో ఈటల రాజేందర్ నిర్ణయం సరైంది కాదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈటల రాజేందర్ బీజేపీలో ఒక సామాన్య నేతగా మిగిలిపోక తప్పదన్న జోస్యాలు వినపడుతున్నాయి.

Tags:    

Similar News