ఈటల మరో కోదండరామ్…?

అంతా సాఫీగా సాగిపోతున్నప్పుడు అలజడి రేకెత్తిస్తుంటారు కేసీఆర్. చిన్న గీత ముందు పెద్దగీత గీసి చర్చకు తెర తీస్తుంటారు. ఈటల రాజేందర్ ఉదంతం దీనికొక ఉదాహరణ. చేజారిపోతున్నాడు, [more]

Update: 2021-05-13 12:30 GMT

అంతా సాఫీగా సాగిపోతున్నప్పుడు అలజడి రేకెత్తిస్తుంటారు కేసీఆర్. చిన్న గీత ముందు పెద్దగీత గీసి చర్చకు తెర తీస్తుంటారు. ఈటల రాజేందర్ ఉదంతం దీనికొక ఉదాహరణ. చేజారిపోతున్నాడు, ముందుగానే చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈటల ను తీవ్రంగానే అవమానించారు. దాంతో అతని పదవి పోయింది. పరువు పోయింది. పార్టీలో అసంతృప్త వాదులకు ఇదొక హెచ్చరిక. తొలి నుంచి తెలంగాణ ఉద్యమంలో మమైకమై ఉన్న ఈటల రాజేందర్ కొత్త పార్టీతో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారేమోనని కొందరు భావించారు. చక్రబంధంలో ఇరికించి ఆయనను నియోజకవర్గానికే పరిమితం చేయడానికి పక్కా వ్యూహమే రచించింది టీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఉరఫ్ కేసీఆర్. ఉద్యమ కాలం నాటి ఊసులు మరుగునపడిపోయాయి. ఫక్తు రాజకీయమే ఎత్తుగడగా తెలంగాణ రాష్ట్రసమితి నడుస్తోంది. ఉద్యమంలో తన సేవలను గుర్తు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గుదామనుకున్న కోదండరామ్ కు చుక్కలు చూపించారు ప్రజలు. విద్యావంతులే ఆయనను తిరస్కరించారు. ఈ ఒక్క ఉదంతంతోనే ఆనాటి సెంటిమెంటుకు మంగళం పాడేసినట్లేనని తేలిపోయింది. ఈ పరిణామం తర్వాతనే కేసీఆర్ ఈటల రాజేందర్ పై చర్యలకు ఉపక్రమించారు.

అడకత్తెరలో రాజేంద్రుడు..

తాను తొలి నుంచి ఉద్యమంలో ఉన్నాడు. పార్టీ పై తనకూ హక్కులు ఉన్నాయనేది ఈటల రాజేందర్ వాదన. దానిని హీనపక్షం చేసి అధిష్ఠానం చెప్పిందే వేదంగా ఫాలో అయ్యేవారికే టీఆర్ఎస్ లో స్థానముంటుందని కేసీఆర్ చెప్పదలచుకున్నారు. పకడ్బందీగానే ఈటల ను బిగించి వేశారు. అసైన్డ్ భూములు, దేవాదాయ భూముల వంటి అంశాలు కలిసి వచ్చాయి. ఈటల రాజేందర్ అంశం టీఆర్ఎస్ లోనూ, రాష్ట్రంలోనూ ప్రకంపనలు సృష్టిస్తుందని ప్రతిపక్షాలు ఎదురు చూశాయి. కానీ క్రమంగా చల్లారిపోయింది. ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా రాష్ట్రస్థాయి నాయకుడు కాదని తాజా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యమం ఇచ్చిన బలం, కేసీఆర్ అండదండల కారణంగానే రాజేందర్ ప్రముఖ నాయకునిగా వెలుగొందారు. ఇప్పుడు అగ్రనాయకత్వం పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగ బెట్టేసింది. ఈటల రాజేందర్ ఆత్మాభిమానం కలిగిన నాయకుడు. రాజీనామా చేసి బయటకు రావడం మినహా గత్యంతరం లేని పరిస్థితి. అయితే రాజీనామా చేస్తే మళ్లీ గెలుస్తాడా? అనేదే చిక్కు ప్రశ్న. సర్వశక్తులతో అతని ని ఓడించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తారు. ఈటల బలం ప్రభుత్వం ముందు సరిపోక పోవచ్చు. అయినా కేసీఆర్ ఎఫ్పటికప్పుడు సవాళ్లు స్వీకరించడానికి సిద్దంగా ఉంటారు. ఒకవేళ ఈటల రాజేందర్ రాజీనామా చేసి మళ్లీ నెగ్గితే ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ రాజీనామా చేస్తారా? అయితే ఎప్పుడు? అన్న సందేహం వెన్నాడుతోంది. రాజీనామా చేయకపోతే ఒక తంటా, చేస్తే మరో రకమైన ఇబ్బంది. ఒకవేళ రాజీనామా చేసి పోటీలో లేకుండా పోతే పలాయనం చిత్తగించినట్లవుతుంది. పోటీలో ఉండి ఓడిపోతే ఇక తన రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఈ డైలమాలోనే ప్రస్తుతం ఈటల రాజేందర్ అడకత్తెరలో చిక్కుకున్నారు.

అగ్రనాయకుల వ్యూహం..

ఈటల రాజేందర్ ను పెద్ద నాయకుడిని చేయడం కేసీఆర్ కు ఇష్టం లేదు. అందుకే అతని విషయంలో ఎటువంటి ప్రకటనలు చేయడం లేదు. స్పందన కనబరచడం లేదు. అధిష్టానాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా సంయమనం పాటిస్తున్నారు. కేసీఆర్, హరీశ్, కేటీఆర్, కవిత ..ఇలా అగ్రనాయకులెవరూ ఈ విషయంపై పెదవి విప్పడం లేదు. జిల్లా స్తాయిలో , ప్రత్యేకించి ఒక నియోజకవర్గ స్తాయిలోనే ఈటల రాజేందర్ ఇష్యూని డీల్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల క్రమేపీ ప్రజల దృష్టి నుంచి కనుమరుగైపోతుంది. బహిరంగంగానే పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం లేదు. వీటన్నిటిని బట్టి చూస్తే రాజేందర్ కు చెక్ పెట్టే కార్యక్రమం అంతర్లీనంగా సాగిపోతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీ జాక్ నాయకుడు అయిన కోదండరామ్ తరహాలోనే ఈటల రాజేందర్ ఉదంతం సైతం వైఫల్యాలతో ముగిసిపోతుందని టీఆర్ ఎస్ బావిస్తోంది. రాజేందర్ ఇతర పార్టీల నాయకులను పెద్ద ఎత్తున కలవడాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది.

పక్కా హామీ శూన్యం..

రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళితే తనకు అన్నిపార్టీలు మద్దతు ఇచ్చేలా చూసుకోవాలని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. అధికారపార్టీ బలగాలను ఎదుర్కోవడం అంత సులభం కాదని ఆయనకు తెలుసు. అందుకే అటు కాంగ్రెసు, ఇటు బీజేపీ నుంచి సైతం స్నేహహస్తం కోరుకుంటున్నారు వారు బరిలో దిగకుండా తనను బలపరిచేలా ఒప్పించాలని చూస్తున్నారు. కానీ సైద్దాంతికంగా అదంత సులభం కాదు. ఒక స్వతంత్ర అభ్యర్థి కోసం తమకున్న పొలిటికల్ స్టేక్స్ వదలుకోవడానికి బీజేపీ, కాంగ్రెసు సిద్ధపడవు. కేసీఆర్ కు చెక్ పెట్టడానికి ఈటల రాజేందర్ ఉపయోగపడతారని బీజేపీ, కాంగ్రెసుల్లోని కొందరు నాయకులు భావిస్తున్నారు. కానీ పోటీలో లేకుండా అతనిని బలపరిస్తే తమ పార్టీల బలహీనతలు బయటపెట్టుకున్నట్లవుతుంది. అందువల్లనే ఈటల రాజేందర్ కు ఇతర రాజకీయ పార్టీల నుంచి బహిరంగ మద్దతు లభించడం లేదు. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే అతనిని బలపరుస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. తాజా భేటీల్లోనూ ఈటల రాజేందర్ కు కాంగ్రెసు, బీజేపీ నాయకుల నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. అందువల్ల రాజీనామాపై తర్జనభర్జనలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఉద్యమ వాతావరణం లేనప్పుడు వ్యక్తిగతంగా ప్రభావం చూపడం అంత సులభం కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News