Etala rajender : రఫ్ఫాడించాడు.. రీజన్లు ఇవే…?

గెలుపోటములను కాసేపు పక్కన పెడదాం. ఈటల రాజేందర్ మాత్రం కారు పార్టీకి చుక్కలు చూపించారనే చెప్పాలి. ప్రతి రౌండ్ లోనూ తనదే పైచేయి చూపించుకుని అధికార పార్టీని [more]

Update: 2021-11-02 11:00 GMT

గెలుపోటములను కాసేపు పక్కన పెడదాం. ఈటల రాజేందర్ మాత్రం కారు పార్టీకి చుక్కలు చూపించారనే చెప్పాలి. ప్రతి రౌండ్ లోనూ తనదే పైచేయి చూపించుకుని అధికార పార్టీని అల్లాడించారు. అయితే ఇది బీజేపీ కంటే ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే ఈ ఎన్నికల్లో పనిచేసిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. సానుభూతి బాగా పనిచేసింది. హుజూరాబాద్ ప్రజలు భావోద్వేగాలకు లోనయ్యారని ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీ అనే కంటే ఈటల అనడం సబబు.

అన్ని రకాలుగా….

ఈటల రాజేందర్ కు అన్ని రకాల క్యాలిక్యులేషన్ లు అనుకూలించాయనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఆరుసార్లు ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది. అభ్యర్థి కూడా ఈటల రాజేందర్ మాత్రమే. అయితే ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగించిన విధానం హుజూరాబాద్ ప్రజలను హర్ట్ చేసిందంటున్నారు. ఈటల రాజేందర్ ను ఒంటరి చేసి ఆయనపై కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం కూడా ప్రజలు తప్పుపట్టినట్లే కన్పిస్తుంది.

సానుభూతి కూడా….

ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ లో ఒక నేతగా హుజూరాబాద్ ప్రజలు చూడలేదు. ఆయనలో ఉద్యమ కారుడిని చూశారు. కేసీఆర్ కు ఎదురొడ్డి నిలిచిన ధీరుడిగా భావించారు. అందువల్లనే ప్రతి రౌండ్ లోనూ ఈటలకు ఎంతో కొంత మెజారిటీ లభించింది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ తనతో పాటు టీఆర్ఎస్ ఓట్లను కూడా తీసుకెళ్లగలిగారు. టీఆర్ఎస్ లో కేవలం నేతలు మాత్రమే మిగిలారు. ఈటల పక్కన ఉండే నేతలను టీఆర్ఎస్ ఆకర్షించగలిగినా ఆయనకు పెద్దగా నష్టం వాటిల్లలేదని చెప్పొచ్చు.

వికటించిన ప్రయోగాలు….

మరోవైపు రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయంటున్నారు. కరీంనగర్ జిల్లాలో రెడ్డి వర్సెస్ వెలమ అన్నట్లు ఉంటుంది. దీంతో టీఆర్ఎస్ తెలివిగా కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని బలపడాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయోగం కూడా విఫలమయినట్లే అనుకోవాలి. రెడ్డి సామాజికవర్గంతో పాటు ఇతర కులాలు కూడా ఈటల వైపు చూసేలా చేశాయి. అక్కడ నేతలకు వరస బెట్టి ఇచ్చిన పదవులు కూడా వికటించిన ప్రయోగంగానే చెప్పుకోవాలి. మొత్తం మీద ఈటల రాజేందర్ గెలిచినా, గెలవకపోయినా టీఆర్ఎస్ ను రఫ్ఫాడించాడనే చెప్పాలి.

Tags:    

Similar News