విధేయ‌త‌కు వీర‌తాడు… అందుకే బాధ్యతలు

విధేయ‌త‌కు వీర‌తాడు.. అన‌ద‌గిన విధంగా టీడీపీలో కీల‌క నాయ‌కుడు.. ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతోపాటు పార్టీకి విధేయుడిగా ఉన్న ఏలూరి సాంబ‌శివ‌రావుకు [more]

Update: 2020-10-05 09:30 GMT

విధేయ‌త‌కు వీర‌తాడు.. అన‌ద‌గిన విధంగా టీడీపీలో కీల‌క నాయ‌కుడు.. ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధించ‌డంతోపాటు పార్టీకి విధేయుడిగా ఉన్న ఏలూరి సాంబ‌శివ‌రావుకు టీడీపీ అధినేత చంద్రబాబు మంచి గుర్తింపు ఇచ్చారు. తాజాగా ప్రక‌టించిన పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్యక్షుల జాబితాలో ఏలూరి సాంబ‌శివ‌రావుకు చోటు క‌ల్పించారు. గుంటూరు-ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం జిల్లాటీడీపీ అధ్యక్షుడిగా ఆయ‌న‌ను నియ‌మించారు.

అంకితభావంతో….

ఇది నిజంగా ఆయ‌న చేసిన కృషికి, పార్టీ ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న అంకిత భావానికి మంచి గుర్తింపేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ హ‌వాను కొన‌సాగించ‌డంలోను.. గ‌త ఏడాది వైసీపీ సునామీని సైతం త‌ట్టుకుని పార్టీని గెలుపు గుర్రం ఎక్కించ‌డంలోను ఏలూరి సాంబ‌శివ‌రావు పూర్తిగా స‌క్సెస్ అయ్యారు. అదే స‌మ‌యంలో ఆయ‌న పార్టీ మారిపోతార‌ని భావించిన స‌మ‌యంలోనూ ఆయ‌న చూపిన నిబ‌ద్ధత కూడా ఎన్నద‌గిన‌దే. తాను టీడీపీలోనే పుట్టాన‌ని, టీడీపీలోనే ఉంటాన‌ని చెప్పి.. పార్టీ శ్రేణుల్లో ఆయ‌న ధైర్యం నింపారు.

జెయింట్ కిల్లర్ గా….

ద‌గ్గుబాటి వెంకటేశ్వర‌రావు లాంటి సీనియ‌ర్ నేత వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన‌ప్పుడు ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప్రస్తావ‌నే లేకుండా పోయింది. అలాంటి స‌మ‌యంలో ప‌రుచూరులో టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టిన ఏలూరి సాంబ‌శివ‌రావు 2014 ఎన్నిక‌ల‌తో పాటు గ‌త యేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. ఏ ద‌గ్గుబాటిని త‌ట్టుకుని ప‌రుచూరులో టీడీపీని నిల‌బెట్టాడో అదే ద‌గ్గుబాటిని ఢీకొట్టిన ఏలూరి సాంబ‌శివ‌రావు సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఇక ప్రకాశం జిల్లాలో పార్టీ త‌ర‌పున గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేల్లో క‌ర‌ణం బ‌ల‌రాం పార్టీ మారిపోగా మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల విష‌యంలోనూ అనేక సందేహాలు ఉన్నాయి.

ఎన్ని వత్తిళ్లు వచ్చినా….

కొండ‌పిలో గెలిచిన డోలా బాలా శ్రీ వీరాంజ‌నేయ‌స్వామి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇక అద్దంకిలో గెలిచిన గొట్టిపాటి ర‌వికుమార్ ఎప్పటి వ‌ర‌కు పార్టీలో ఉంటారో చెప్పలేని ప‌రిస్థితి. ప‌రుచూరులో వైసీపీకి స‌రైన క్యాండెట్ లేక‌పోవడంతో పార్టీ మారాల‌ని ఏలూరిపై ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా ఏలూరి సాంబ‌శివ‌రావుమాత్రం పార్టీ మార‌లేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఏలూరికి కీల‌క ప‌ద‌వి ఇచ్చార‌ని ప్రచారం జ‌రుగుతోంది. అనూహ్యంగా ల‌భించిన ఈ ప‌ద‌వితో పార్టీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. వైసీపీ దూకుడుకు క‌ళ్లెం వేయ‌డంతోపాటు టీడీపీని ప‌రుగులు పెట్టించేందుకు కూడా ఈ నిర్ణయం సానుకూలంగా ప‌నిచేస్తుంద‌ని అంటున్నారు.

బ్యాలెన్స్ చేశారంటూ…..

ఇక‌, ఒంగోలు పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుడిగా బీసీ వ‌ర్గానికి చెందిన‌ నూక‌సాని బాలాజీకి అవ‌కాశం ఇచ్చారు చంద్రబాబు. వాస్తవానికి ఇప్పటి వ‌ర‌కు ఉమ్మడి ఒంగోలు నుంచి దామ‌చ‌ర్ల జ‌నార్దన్ ఉన్నారు. ఈ బాధ్యత‌ల‌ను ఇప్పుడు నూక‌సాని బాలాజీకి ఇవ్వడం కూడా ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామ‌మేన‌ని అంటున్నారు సీనియ‌ర్లు. గుంటూరు, ప్రకాశం జిల్లాల ప‌రిధిలో ఉన్న బాప‌ట్ల పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ పార్టీ బాధ్యత‌లు ఏలూరి సాంబ‌శివ‌రావుకి అప్పగించ‌డం వెన‌క బాబు సామాజిక ఈక్వేష‌న్లు బ్యాలెన్స్ కూడా చేసిన‌ట్లయ్యిందన్న చ‌ర్చలు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News