అయ్యో అనడంలేదే?

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఆయన పెద్ద దిక్కు. నిజానికి కింజరాపు కుటుంబం టీడీపీలో ఉండడమే పసుపు పార్టీకి కొండంత బలం. తన జీవిత కాలంలో ఒకే [more]

Update: 2020-02-24 08:00 GMT

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఆయన పెద్ద దిక్కు. నిజానికి కింజరాపు కుటుంబం టీడీపీలో ఉండడమే పసుపు పార్టీకి కొండంత బలం. తన జీవిత కాలంలో ఒకే ఒకసారి ఎర్రన్నాయుడు ఓడారు. అదీ 2009 ఎన్నికల్లో. నాడు కొన్ని సమీకరణలు తప్పడం వల్లనే ఆయన ఓడారు అంటారు. అంతకు ముందు ఆ తరువాత కూడా కింజరాపు ఫ్యామిలీకి ఓటమి అనేదే లేదు. అనేకసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎర్రన్నాయుడు పనిచేస్తే, ఆయన వారసుడిగా సోదరుడు అచ్చెన్నాయుడు ఇప్పటికి అయిదు పర్యాయాలు ఓటమి లేకుండా గెలుస్తూ వస్తున్నారు. అయిదేళ్ళ పాటు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఇక ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన‌నాయుడు, కుమార్తె ఆదిరెడ్డి భవానీ కూడా గెలుస్తూ వస్తున్నారు. ఓ విధంగా ఉత్తరాంధ్రాలో పెద్ద రాజకీయ కుటుంబంగా కింజరపు ఫ్యామిలీ ఉందని చెప్పాలి.

మాట సాయం లేదే…?

అటువంటిది అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణలో చిక్కుకుని విలవిలలాడుతూంటే ఆయన పక్షాన మాట్లాడేందుకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నేతలు ముందుకు రాకపోవడం విశేషంగా చెప్పుకోవాలి. సొంత జిల్లా శ్రీకాకుళం విషయానికి వస్తే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు ఈ విషయంలో దాదాపుగా మౌనమే దాల్చారు. ఆయనకూ కింజరపు కుటుంబానికి ఉన్న విభేదాలే ఇందుకు కారణమని అంటున్నారు. పైగా తొందరలోనే తన పదవిని అచ్చెన్నకు కట్టబెడతారన్న ప్రచారం నేపధ్యంలో కళా సైలెంట్ గా ఉండడాన్ని అర్ధం చేసుకోవాల్సిందే.

మాజీలేమయ్యారో…?

మరోవైపు చూసుకుంటే విజయనగరం జిలాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఉన్నారు. ఆయన సైతం అయ్యో అచ్చెన్నా అనలేదు, కనీసం ఆయనకు మద్దతుగా ఒక ప్రకటన కూడా చేసింది లేదంటున్నారు. ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పలుకే బంగారమా అన్నట్లున్నారు. ఆయన నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్లుగా పూర్తిగా నోరు కట్టేసుకున్నారు. మరో వైపు ప్రతీ దానికీ పెద్ద గొంతు వేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అయ్యన్నపాత్రుడు సైతం అచ్చెన్న విషయంలో సైలెంట్ గా ఉండడమే విడ్డూరమని అంటున్నారు. ఇలా పెద్ద తలకాయల మద్దతు లేకపోవడం ఒక్క అచ్చెన్న విషయంలోనే జరిగిందా అన్న చర్చ కూడా సాగుతోంది.

అదేనా కారణం…?

ఇపుడు అచ్చెన్నాయుడు వ్యవహారంలో గోదావరి జిల్లాల నుంచి కోస్తా వరకూ ఉన్న టీడీపీ నేతలు మద్దతు ఇస్తూ మాట్లాడారు. అచ్చెన్న మీద జగన్ కక్ష కడుతున్నారని వారు వ్యాఖ్యానించారు. మా అచ్చెన్న మేలిమి బంగారం అని కూడా వెనకేసుకువచ్చారు. సరే సొంత పార్టీ నేత ఇబ్బందుల్లో ఉంటే ఇలా గట్టిగా మాట్లాడి నైతిక మద్దతు ఇవ్వడం సాటి తమ్ముళ్ళ బాధ్యత. మరి ఉత్తరాంధ్రాలో ఇలా తమ్ముళ్ళు పట్టనట్లుగా ఉండడమేంటన్న డౌట్లు పుట్టుకువస్తున్నాయి. దానికి కారణాలు కూడా ఒకటి రెండు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రలో అచ్చెన్న బిగ్ షాట్ గా పార్టీలో ఎదగడం ఒకటైతే. మరోటి ఎందుకొచ్చిన తంటా. నోరు విప్పితే మన కధలు ఏవైనా బయటపడతాయన్న ముందు జాగ్రత్త కూడా కావచ్చు అంటున్నారు. మొత్తానికి అచ్చెన్న ఇంట గెలవలేకపోయారని అంటున్నారు .

Tags:    

Similar News