పట్టు కోసం.. కట్టుతప్పుతున్న ఎలిమినేటి?

రాజకీయాల్లో ఎప్పుడూ అంతే. తమకున్న పట్టును కోల్పోయేందుకు ఎవరూ ఇష్టపడరు. అందులోనూ దశాబ్దాల పాటు శాసించిన నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు. అదే ఇప్పుడు భువనగిరి [more]

Update: 2020-09-22 09:30 GMT

రాజకీయాల్లో ఎప్పుడూ అంతే. తమకున్న పట్టును కోల్పోయేందుకు ఎవరూ ఇష్టపడరు. అందులోనూ దశాబ్దాల పాటు శాసించిన నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఎవరు మాత్రం ఇష్టపడతారు. అదే ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో జరుగుతుంది. ఎలిమినేటి కుటుంబం మళ్లీ పుంజుకుంటోంది. ఇది ప్రస్తుత ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డికి గిట్టడం లేదు. దీంతో రెండు వర్గాల మధ్య పోరు ప్రారంభమయింది. మధ్యలో క్యాడర్ నలిగిపోతుంది.

దశాబ్దాల పాటు ఏలడంతో…..

భువనగిరి అనగానే ఎలిమినేటి కుటుంబం గుర్తుకొస్తుంది. 1985 నుంచి ఆ కుటుంబం అక్కడ తిష్టవేసింది. 1985 నుంచి భువనగిరి నియోజకవర్గంలో ఎలిమినేటి మాధవరెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మరణానంతరం ఉమా మాధవరెడ్డి మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంటే ఈ కుటుంబం ఏడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. మూడు దశాబ్దాల పాటు ఈ కుటుంబాన్ని నియోజకవర్గ ప్రజలు ఆదరించారు.

జడ్పీ ఛైర్మన్ వర్సెస్ ఎమ్మెల్యే…..

అయితే 2014లో రాష్ట్ర విభజన జరగడం, ఉమా మాధవరెడ్డి టీడీపీలో ఉండటంతో తొలిసారి అక్కడి నుంచి ఆమె ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఫైళ్ల శేఖర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కేసీఆర్ ఉమా మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డికి జడ్పీ ఛైర్మన్ గా చేశారు. అప్పటి నుంచి జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డికి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మధ్య పొసగడం లేదు. ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ఇష్టపడటం లేదు.

కార్యక్రమాల్లోనూ విడివిడిగా….

ఇటీవల చెరువులో మత్స్య శాఖ చేపపిల్లలను వదిలే కార్యక్రమానికి ఇద్దరినీ ఆహ్వానించింది. అయితే ముందుగా ఫైళ్ల శేఖర్ రెడ్డి వచ్చి చేప పిల్లలను వదలివెళ్లిపోయారు. తర్వాత సందీప్ రెడ్డి వచ్చి మరోసారి కార్యక్రమాన్ని నిర్వహించారు. సందీప్ రెడ్డి తమ కుటుంబానికి ఉన్న పట్టును భువనగిరిలో వదులుకోకూడదని ఎమ్మెల్యేకు చెక్ పెడుతున్నారు. అదే సమయంలో ఫైళ్ల శేఖర్ రెడ్డి సయితం తన వర్గాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. 2023 ఎన్నికల టార్గెట్ గా ఎలిమినేటి కుటుంబం పట్టు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తుండటమే ఈ విభేదాలకు కారణమని చెప్పక తప్పదు. మరి వీరిద్దరి మధ్య విభేదాలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Tags:    

Similar News