ఆ వైసీపీ ఎమ్మెల్యే స్లోయే…. ఎంపీయే చ‌క్క పెట్టేస్తున్నారా…?

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడి. ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ త‌ర‌ఫున గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాజీ ఐఆర్ఎస్ అధికారి [more]

Update: 2020-09-15 06:30 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడి. ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ త‌ర‌ఫున గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాజీ ఐఆర్ఎస్ అధికారి వీఆర్‌. ఎలీజా విజ‌యం సాధించారు. ఇక్కడ పార్టీ డెవ‌ల‌ప్ అయ్యేందుకు చాలా స్కోపు ఉంది. వాస్తవానికి 2014లో పీత‌ల సుజాత ఇక్కడ విజ‌యం సాధించారు. త‌ర్వాత చెల‌రేగిన అసంతృప్తి జ్వాల‌ల నేప‌థ్యంలో ఆమెను త‌ప్పించిన చంద్రబాబు.. ఇక్కడ నుంచి క‌ర్రా రాజారావుకు అవ‌కాశం ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి ఎలీజా 36 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఎలీజా ఎమ్మెల్యేగా గెలిచి యేడాదిన్నర కావొస్తున్నా ఇప్పటి వ‌ర‌కు నియోజ‌కవ‌ర్గ అభివృద్ధిలో కాని, పార్టీ ప‌టిష్టం చేయ‌డంలో కాని ఆయ‌న ముద్ర లేద‌నే చెప్పాలి.

ప్లానింగ్ లేకపోవడంతో…..

ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉన్నప్పటికీ.. ప‌నుల‌పై పెద్దగా శ్రద్ధ చూప‌డం లేద‌ని అంటున్నారు. ఆయ‌న ద‌గ్గర‌కు ఏ ప‌నిమీద వెళ్లినా.. క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడ‌తార‌నే చ‌ర్చలే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఇక‌, పార్టీ అధిష్టానం వ‌ద్దకు కూడా ఎలీజా అంతగా చొచ్చుకుపోవ‌డం లేద‌నే అంటున్నారు. పార్టీని ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ‌రింత తిరుగులేని శ‌క్తిగా మార్చే అవ‌కాశం ఉన్నా కూడా ఎమ్మెల్యేలో ఆ దూకుడు లేక‌పోవ‌డం… నాలుగు మండ‌లాలు, జంగారెడ్డిగూడెం న‌గ‌ర పంచాయ‌తీలో కార్యక‌ర్తల‌పై పూర్తిగా గ్రిప్ లేక‌పోవ‌డం కూడా ఆయ‌న‌కు మైన‌స్‌గా మారిందంటున్నారు. ఎలీజా మ‌రింత ప్లానింగ్‌తో ఉంటే అస‌లు ఇప్పట్లో చింత‌ల‌పూడిలో వైసీపీకి తిరుగే ఉండ‌దు.

ఎంపీ జోక్యంతో…..

అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం గ‌తంలో జ‌న‌ర‌ల్‌గా ఉన్నప్పుడు 1985-1999 వ‌ర‌కు టీడీపీ త‌ర‌ఫున కోట‌గిరి విద్యాధ‌ర‌రావు వ‌రుస విజ‌యాలు సాధించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని టీడీపీకి కంచుకోట‌గా మ‌లిచిన చ‌రిత్రను సైతం ఆయ‌న సొంతం చేసుకున్నారు. ఆ కోట‌గిరి కుమారుడు కోట‌గిరి శ్రీథ‌రే ఇప్పుడు ఏలూరు ఎంపీగా ఉన్నారు. ఆయ‌న‌కు ఇది సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీకి కంచుకోట‌గా మార్చేందుకు ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నారు. శ్రీథ‌ర్ రాజ‌కీయంలో పైకి హ‌డావిడి క‌నిపించ‌దు. కాని చాప‌కింద నీరులా ఆయ‌న ప‌నుల‌న్ని చ‌క్క పెట్టేస్తూ ఉంటారు.

ప్రత్యర్థి పార్టీ పుంజుకోకుండా….

త‌న పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ చింత‌ల‌పూడిని ప్రత్యేకంగా ఆయ‌న ట్రీట్ చేస్తున్నార‌ని పార్టీలోనే చ‌ర్చ న‌డుస్తోంది. అభివృద్ధి స‌హా నిధుల స‌ద్వినియోగం, స‌మ‌స్యల ప‌రిష్కారంపై నేరుగా త‌న‌ను సంప్రదించేలా ఆయ‌న ఓ వ్యవ‌స్థ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడ ఎమ్మెల్యే ఎలీజా దూకుడు ప్రద‌ర్శించ‌క‌పోయినా.. ప్రత్యర్థి పార్టీలు పుంజుకోకుండా ఎంపీ చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఇది పార్టీకి మేలు చేసే చ‌ర్యగా భావిస్తున్నారు.

Tags:    

Similar News