కలసినా ప్రయోజనం లేదుగా?

పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో హోరా హోరీ పోరు జరగనుంది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్యనే [more]

Update: 2020-11-17 17:30 GMT

పశ్చిమ బెంగాల్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో హోరా హోరీ పోరు జరగనుంది. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉందన్నది విశ్లేషకుల అంచనా. తృణమూల్ కాంగ్రెస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాలను సాధించాలనుకుంటుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలని గత మూడేళ్ల నుంచి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఇక కాంగ్రెస్, కమ్యునిస్టులు ఇక్కడ నామమాత్రంగా మారాయనే చెప్పాలి.

నాడు ఆధిపత్యం….

ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్, కమ్యునిస్టులదే ఆధిపత్యం. కాంగ్రెస్ ను కూలదోసి కమ్యునిస్టులు దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్ ను ఏలారు. అయితే కాంగ్రెస నుంచి బయటకు వచ్చిన మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించి బెంగాల్ అప్రతిహత విజయాలను అందుకుంటున్నారు. టీఎంసీ రాకతో క్రమంగా కాంగ్రెస్, కమ్యునిస్టులు కనుమరుగయ్యాయనే చెప్పాలి. వారికి పట్టున్న ప్రాంతాల్లో కూడా జెండా కన్పించని పరిస్థితిని కల్పించారు మమత.

ఆ నేతలేరీ?

పశ్చిమ బెంగాల్ లో ఒకప్పుడు జ్యోతిబసు, బుద్ధవేవ్ భట్టాచార్య వంటి నేతలు కమ్యునిస్టు పార్టీకి అండగా ఉన్నారు. వీరి నేతృత్వంలోనే ఎర్ర జెండా బెంగాల్ లో రెపరెప లాడింది. అయితే బూజు పట్టిన సిద్ధాంతాలు పార్టీకి క్యాడర్ ను దూరం చేశాయనే చెప్పాలి. కమ్యునిస్టుల పాలనలో బెంగాల్ ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్న వాదనకు వారి వరస పరాజయాలే అద్దం పడుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని నేతలు, క్యాడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయింది.

రెండు కలసి….

ఇక కాంగ్రెస్ కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. కాంగ్రెస్ అరకొర స్థానాలను దక్కించుకునే స్థితికి చేరుకుంది. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యునిస్టులు జట్టు కట్టాలని నిర్ణయించాయి. బలమైన మమత బెనర్జీని, బీజేపీని ఎదుర్కొనాలంటే కూటమిగా ఏర్పడటమే ముఖ్యమని భావించి రెండూ కలసి బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయంచాయి. అప్పుడైనా కొన్ని సీట్లు వచ్చే అవకాశముందన్న అంచనాతోనే కమ్యునిస్టులు ఒకప్పుడు తమకు కంచుకోట అయిన బెంగాల్ లో పొత్తుతో వెళుతున్నారు. మొత్తం మీద బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎంలది నామమాత్రమే అయినా వీరు ఎవరు ఓటు బ్యాంకు గండి కొడతారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News