కోలగట్ల పట్టు వదలడం లేదే

రాజకీయాల్లో వారసత్వం పెద్ద జబ్బు. ఓ విధంగా నాయకులకు అది మేలు, జనాలకు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఏ నాయకుడూ కడుపు తీపిని చంపుకోలేరు. అందుకోసం [more]

Update: 2019-07-27 12:30 GMT

రాజకీయాల్లో వారసత్వం పెద్ద జబ్బు. ఓ విధంగా నాయకులకు అది మేలు, జనాలకు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఏ నాయకుడూ కడుపు తీపిని చంపుకోలేరు. అందుకోసం ఎంతవరకైనా వెళ్తారు. దీనికి ఎవరూ అతీతులూ కారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు, ఎలాగంటే రాజకీయ ఘనాపాఠి, ఘనమైన వంశ చరిత్ర కలిగిన పూసపాటి అశోక్ గజపతి రాజు చేయలేని పనిని తాను చేసి చూపించాలనుకుంటున్నారు. అవకాశాలన్నీ మలిగిన వేళ అశోక్ తన కూతురు అతిధి గజపతి రాజుని రాజకీయాల్లోకి తెచ్చి అభాసుపాలు అయ్యారు. తనతో పాటు కుమార్తె కూడా తాజా ఎన్నికల్లో ఓడిపోవడానికి కారకులయ్యారు. ఆ తప్పు కోలగట్ల వీరభద్ర స్వామి చేయరట. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు.

తొలి మేయర్ గా రికార్డ్….

విజయనగరం కార్పొరేషన్ గా అవతరించాక త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మేయర్ పదవికి తన కుమార్తె శ్రావణికి బరిలో నిలబెట్టాలని కోలగట్ల వీరభద్ర స్వామి పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో తన పని తాను చేసుకుపోతున్నారు. జగన్ వద్ద కోలగట్ల వీరభద్ర స్వామికి మంచి పేరు ఉండడం కూడా కలసివస్తోంది. ఎటూ మంత్రి పదవి జగన్ ఇవ్వలేదు. దాంతో మేయర్ సీటు కూతురుకి అడిగి ఆ ముచ్చట తీర్చుకుందామని కోలగట్ల వీరభద్ర స్వామి ఆలోచిస్తున్నారుట. ఇక పార్టీ బలంగా ఉంది. దానితో పాటే కోలగట్ల వీరభద్ర స్వామి కూడా విజయనగరం పట్టణంలో గట్టి నేతగా ఉన్నారు. 1989 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆయన ఇప్పటికి అయిదు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. రెండు మార్లు కూడా పూసపాటి కుటుంబం మీదనే నెగ్గడం విశేషం. దాంతో తనకు ఉన్న బలాన్ని చూపించి విజయనగరం కార్పొరేషన్ మీద వైసీపీ జెండా ఎగరేయాలని తాపత్ర్యపడుతున్నారు.

వైరి వర్గానికి ఝలక్ ….

ఇక కోలగట్ల వీరభద్ర స్వామికి సొంత పార్టీలోనే వైరి వర్గం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ అండదండలతో ఆయన అనుచరులు కోలగట్ల వీరభద్ర స్వామిని దిగలాగాలని చేయని ప్రయత్నం లేదు. తాజాగా జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా కోలగట్లను ఓడించాలని ఎంతగానే ప్రయత్నాలు చేశారు. అయితే కోలగట్ల వీరభద్ర స్వామి తనదైన ఎత్తుగడలతో విజయం సాధించారు. ఇపుడు అదే తీరుగా కార్పొరేషన్ కొల్లగొట్టాలని కోలగట్ల పట్టుదలగా ఉన్నారు. ఎమ్మెల్యే కావడమే ఆలస్యం ఆయన నగరంలో పార్టీని పటిష్టం చేయడంపైనే ద్రుష్టి సారించారు. ఇక కుమార్తె శ్రావణి కూడా విద్యాధికురాలు, తండ్రి గెలుపు వెనక ఎంతగానే కృషి చేశారు. దాంతో ఇపుడు ఆమెని ముందుంచి కోలగట్ల వీరభద్ర స్వామి పదునైన వ్యూహాలు రచిస్తున్నారు. ఒక్క దెబ్బకు పార్టీలోని ప్రత్యర్ధులతో పాటు అంతా చిత్తు కావాలన్నదే కోలగట్ల టార్గెట్ గా ఉంది.. చూడాలి మరి.

Tags:    

Similar News