నిర్మలమ్మ పద విన్యాసాలు.. అంతకు మించి?

సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పదే పదే పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ముట్టడితో దేశాలు అల్లకల్లోలమైపోయాయి. ఆయా దేశాల నుంచి అందివచ్చే అవకాశాలను ఆహ్వానించడం , [more]

Update: 2020-05-18 16:30 GMT

సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పదే పదే పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ముట్టడితో దేశాలు అల్లకల్లోలమైపోయాయి. ఆయా దేశాల నుంచి అందివచ్చే అవకాశాలను ఆహ్వానించడం , సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడమే ప్రధాని పిలుపులోని సారాంశమని చాలా మంది భావించారు. కానీ కేంద్రం దృష్టిలో ఇది మరోరకంగానూ ఉపయోగపడుతోంది. పూర్తిస్థాయిలో ఈ ఘట్టాన్ని తన లక్ష్యాలకు అనుగుణంగా వాడేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటి వివిధ అంశాలకు కోవిడ్ ప్యాకేజీ పేరిట తెర తీసింది. ప్రధాని 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ వివరాలను అయిదు విడతలుగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతమున్న సంక్షోభంలో వివిధ వర్గాలకు ప్రత్యక్షంగా అందించే సాయంగా ప్యాకేజీ ఉంటుందని ప్రజలు భావించారు. ప్రభుత్వం మాత్రం మరోవిధంగా యోచించింది. ఫలితంగా ఆర్థిక ప్యాకేజీ సంస్కరణల బాట పట్టింది.

చక్కగా కుదిరింది…

తెలివైన రాజకీయ వేత్త ప్రతి సందర్భాన్ని చక్కగా వాడేసుకుంటాడు. ఎటువంటి విపత్కర పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మలచుకుంటాడు. పాలన వ్యవస్థలు సైతం ఆ రకంగానే ముందుకు వెళ్లాలనుకోవడం దారుణం. వివిధ రకాల పద విన్యాసాలతో ప్రభుత్వం ప్రజలకు ఏదేదో చేసేస్తుందనే భ్రమ కల్పించాలనే ప్రయత్నం పెద్ద ఎత్తున చేశారు. రకరకాల రుణాలు,రాయితీలు, బడ్జెట్ హామీలను కలగాపులగం చేసేసి ఆర్థిక ఉద్దీపన అంటూ నరేంద్రమోడీ చాటి చెప్పారు. బడ్జెట్ లో భాగంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలను సైతం ఇందులో కలిపేశారు. కరోనా తో డీలాపడిన ప్రజలకు ఎంతో కొంత ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష ఆర్థిక సాయం అందుతుందని ఆశించారు. అంతగా ఆశించాల్సిన అవసరం లేదని ప్యాకేజీలో అయిదు విడతలు స్పష్టంగానే తేల్చి చెప్పేశాయి. గతంలో ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ , రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలతో తొమ్మిది లక్షల కోట్లు తాజాగా 11 లక్షల కోట్లు మొత్తంగా 20 లక్షల కోట్లకు ఉద్దీపన చేరిందని కేంద్రం చెబుతోంది. నిజానికి కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేసిన విధంగా హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ ప్రవేశ పెడితే భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుందని నిపుణుల అంచనా. నోట్లు ముద్రించి ప్రజల చేతిలో పెడితే వస్తువుల రేట్లు పెరిగిపోయి రూపాయి మారకం విలువ దారుణంగా దెబ్బతింటుంది. దేశం అంతర్గత సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే తెలివైన ఎత్తుగడతో ప్యాకేజీ రూపంలో రుణాలకే పెద్ద పీట వేశారనేది ఆర్థికవేత్తల అభిప్రాయం.

సంస్కరణల బాటలో…

భారత దేశంలో సంస్కరణలు ప్రవేశ పెట్టడం అంత సులభం కాదు. చౌకగా మానవ వనరులు, సరళమైన కార్మిక చట్టాలు ఉండటంతో చైనా అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ఉత్పత్తి రంగంలో వరల్డ్ లీడర్ గా ఎదిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం కారణంగా కఠినమైన కార్మిక చట్టాలు అమలవుతున్నాయి. వీటిని సంస్కరించాలని చాలా కాలంగా కార్పొరేట్ సంస్థలు కోరుతున్నాయి. ఓటు బ్యాంకు కోల్పోతామని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. అందుకే కార్మిక సంస్కరణలు అనేవి పెండింగు సబ్జెక్టుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కరోనా ను సాకుగా చూపుతూ రాష్ట్రప్రభుత్వాలు సంస్కరణలకు పచ్చ జెండా ఊపేస్తున్నాయి. చైనా నుంచి పరిశ్రమలు వస్తున్నాయి. అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే కార్మిక చట్టాలను కొంత కాలం సస్పెండ్ చేయాలనే నినాదాన్ని రాష్ట్రప్రభుత్వాలు ఎత్తుకున్నాయి. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. కేంద్రం పరోక్ష మద్దతుతోనే నిర్ణయాలు అమలవుతున్నాయి. కోవిడ్ ప్యాకేజీ పేరు చెప్పి ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ మొదలు అంతరిక్షంలో ప్రయివేటీకరణ వరకూ నిర్ణయాలను కేంద్రం ప్రకటించేసింది. సామాన్యుడిని ఆదుకోవాల్సిన ప్యాకేజీకి , వీటికి సంబంధమేమిటో ఎవరీకి అంతుచిక్కదు. ప్రజలు అర్థం చేసుకోలేరు, కాబట్టి ఇదీ ప్యాకేజీనే అనే భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేశారు.

చాప చుట్టేసినట్లేనా….?

మొత్తమ్మీద 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎత్తుగడే వాతలు పెట్టుకున్నట్లుందనే విమర్శకులున్నారు. అమెరికా వంటి దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో పదిశాతం మేరకు ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించాయి. తాము కూడా అదే స్థాయిలో ఉన్నామని చెప్పేందుకే భారత్ తాపత్రయపడింది. నిజానికి ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్ష సాయం లభిస్తే చాలని భారత పరిశ్రమల సమాఖ్య, భారతీయ రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వంటి సంస్థలు అభిప్రాయపడ్డాయి. కానీ రాజకీయ ప్రయోజనం ఆశించే కేంద్ర ప్రభుత్వం వాటి సూచనలకు మించిన ప్రకటనను రూపకల్పన చేసింది. ఉపాధి కోల్పోయిన వారికి ప్రత్యక్ష ఆర్థిక సాయానికి విదేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అమెరికా, కెనడా వంటి దేశాలు మన కరెన్సీలో చూస్తే లక్ష రూపాయల వరకూ పౌరులకు నెలసరి నగదు అందేలా ఏర్పాట్లు చేశాయి. మన దేశంలో మాత్రం వలస కూలీలకు అందించే ఆహారాన్ని కూడా డబ్బుల రూపంలో లెక్క కట్టి ప్యాకేజీలో ప్రకటించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి చెప్పడం కంటే అంకెల గారడీకే అధిక ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ ఎత్తుగడ దీర్ఘకాలిక ఫలితాలను అందించదు. రాష్ట్రప్రభుత్వాలు ఈ ప్యాకేజీపై తీవ్రంగా ధ్వజమెత్తకుండా వాటికి రాజకీయ తాయిలాన్ని అందించారు. ద్రవ్యనిర్వహణ బాధ్యత (ఎఫ్ ఆర్ బీఎం) చట్టాన్ని సడలించి రాష్ట్రాలు మరో నాలుగు లక్షల కోట్ల రూపాయల వరకూ అప్పులు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. విపత్తు నిర్వహణ నిధిని సైతం వారికి నచ్చినట్లు వినియోగించుకునే వెసులుబాటు నిచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు నోరెత్తడం లేదు. కేంద్రం సరి, రాష్ట్రాలూ సరి సరి అంటున్నాయి. చేతిలో చిల్లి గవ్వ లేక, ఉపాధి లేక , తినడానికి తిండి లేక ప్రజల నోళ్లు మాత్రం ఎండిపోతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News