భారీ మూల్యం తప్పదా…?

ఆర్థిక మాంద్యం అలజడి రేకిత్తిస్తోంది. కనుచూపు మేరలో భయకంపితం చేస్తోంది. కేంద్ర సర్కారు పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నప్పటికీ దాని ప్రభావం ప్రజాజీవితంపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానిగా [more]

Update: 2019-08-31 15:30 GMT

ఆర్థిక మాంద్యం అలజడి రేకిత్తిస్తోంది. కనుచూపు మేరలో భయకంపితం చేస్తోంది. కేంద్ర సర్కారు పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నప్పటికీ దాని ప్రభావం ప్రజాజీవితంపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధానిగా నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పెనుసంక్షోభాన్ని చవిచూస్తోంది. అటు కశ్మీర్, ఇటు విదేశీ దౌత్యం, సుస్థిరమైన పాలన, అవినీతి రహిత విధానాలతో దేశప్రజల మద్దతును , విశ్వాసాన్ని ఎన్డీఏ చూరగొంది. అందుకే నాలుగు నెలలక్రితం నాటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో పట్టం గట్టారు. కానీ ప్రజల జీవనప్రమాణాలతో , దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన అంశాల్లో సర్కారు తప్పటడుగులు వేసిందనే భావన బలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజకీయాలు, పొలిటికల్ పోలరైజేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టి ఆర్థిక రంగాన్నినిర్లక్ష్యం చేసిందని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు నిపుణుల నుంచీ వత్తాసు లభిస్తోంది. రకరకాల కారణాలతో సెంటిమెంటును రంగరించి ప్రజలను సంఘటితం చేసి అనూహ్య రీతిలో బీజేపీ బలపడింది. ఒక పార్టీగా అది తప్పుకాదు. కానీ ఆర్థిక రంగంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కోట్ల మంది ప్రజల జీవితాలపై పడుతున్నాయి. గతంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాల పర్యవసానాలు ప్రస్తుతం చర్చనీయమవుతున్నాయి.

సంఘటితంపై సెగలు…

దేశంలోని వివిధ రంగాలు సంక్షోభ సెగల తాకిడిని ఎదుర్కొంటున్నాయి. 2016 లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ఆర్థిక నిపుణులు భవిష్యత్తులో దీని ప్రభావం చాలా చెడుగా ఉంటుందని చెప్పారు. ఆర్థిక నిపుణుడైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు రెండు శాతం జీడీపీ పడిపోతుందన్నారు. నల్లధనాన్ని నిరోధించడానికి, అవినీతిని అరికట్టడానికి నోట్లరద్దు చేశామంటూ ప్రధాని మోడీ ప్రకటించారు. రోజుల తరబడి డబ్బుల కోసం రోడ్లపై కునారిల్లినా ప్రజలు సహనంతో భరించారు. దేశానికి మంచి జరుగుతుందన్న ప్రధాని మాటను విశ్వసించారు. అయితే నల్లధనం మాత్రం కనిపించలేదు. ఎవరికి వారు జాగ్రత్త పడిపోయారు. చెలామణిలో ఉన్న రద్దయిన నోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చి చేరాయి. దాంతో క్యాష్ రూపంలోని నల్లధనం బ్యాంకులకు తిరిగి జమ కాదన్న భ్రమలు తొలగిపోయాయి. ఈలోపు ఆర్థిక వ్యవస్థకు జరిగిన డ్యామేజీ అంతా ఇంతాకాదు. దీర్ఘకాలంలో దాని ప్రభావం తాజా పరిణామాల్లో తేటతెల్లమవుతోంది. సాధారణంగా ఆర్థిక ఒడిదుడుకులను కొంతమేరకు సంఘటిత రంగం తట్టుకోగలుగుతుంది. ప్రస్తుతం వాహనాల ఉత్పత్తి వంటి సంఘటిత రంగాలు కూడా కుదేలైపోయాయి. ఇతర రంగాల పెనుప్రభావం దానిపై పడటమే అందుకు కారణం.

సేవలు..వ్యాపారం..సన్నగిల్లి…

దేశంలోని స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి అయిదు శాతానికి పడిపోయింది. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వ్యాపారస్పర్థతో భారతదేశానికి అపారమైన అవకాశాలు లభిస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ దానిని సద్వినియోగం చేసుకోవడం లో భారత్ విఫలమైంది. ఫలితంగా మొదట అనుకున్నరీతిలో కూడా స్థూలజాతీయోత్పత్తి కనిపించడం లేదు. ఏడుశాతం వ్రుద్ధిరేటు ఉంటుందనుకుంటే దానికంటే రెండు శాతం తక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని దృష్టిలోపెట్టుకుంటే రెండుశాతమంటే దాదాపు నాలుగు లక్షల కోట్లరూపాయల మేరకు నష్టపోయినట్లే లెక్క. దీనివల్ల ఎన్నికోట్లమంది ఉపాధి కోల్పోయారో లెక్క గడితే సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి అయిదు కోట్ల మంది ఉపాధికి విఘాతం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నేరుగా ఉపాధి కోల్పోవడం, ఆదాయం పడిపోవడం, వ్యాపారం మందగించడం, వస్తువులకు డిమాండ్ తగ్గిపోవడం, సేవల పరిమాణం కుదించుకుపోవడం వంటి వివిధ రూపాల్లో దీని ప్రభావం ఉంటుంది.

రంగాలవారీగా…

కొనుగోళ్లు మందగించడంతో వాహనతయారీ, విక్రయ రంగంలోనే ప్రత్యక్షంగా 50 లక్షల పైచిలుకు ఉపాధి కోల్పోయి ఉంటారని అంచనా. ఆటోమోబైల్ సెక్టార్ ఇప్పట్లో కోలుకోలేనంతగా దెబ్బతింది. నోట్ల రద్దు నుంచి అసంఘటిత రంగం అస్తవ్యస్తంగా మారింది. నిర్మాణరంగంలో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు వ్యవసాయ,మైనింగ్, రియాల్టీ రంగాలన్నీ అభివ్రుద్ధిరేటులో వెనకబాటు తనం కనబరుస్తుండటంతో జీడీపీ క్షీణించింది. బ్యాంకుల విలీనం వంటి చర్యలు కొంతమేరకు నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు , ఆర్థిక సేవల మెరుగుదలకు తోడ్పడతాయి. కానీ పరిమితమే. కోట్లాదిగా ఉండే మధ్యతరగతికి ఇవేమీ పెద్దగా ఉపకరించే చర్యలు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిధుల లేమి, నిరర్థక ఆస్తులతో బ్యాంకులు కుప్పకూలకుండా పరిరక్షించే చర్యల్లో భాగంగానే విలీనాన్ని చూస్తున్నారు.

రాజకీయ రంగులు…

దేశంలో వివిధ రంగాలు దెబ్బతినడంతో ప్రభుత్వానికి లభించే ఆదాయం కూడా పడిపోతుంది. ప్రజల కొనుగోలు, సేవల వ్యయం ఎక్కువగా ఉంటే ప్రత్యక్ష,పరోక్ష పన్నులు, సెస్ ల రూపంలో సర్కారుకు ఆదాయం వస్తుంది. అంచనాకు తగిన విధంగా ఆదాయం రాకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక రంగం పటిష్టంగా లేకపోతే ప్రభుత్వ అప్పులకు సైతం రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తం పర్యవసానాలన్నీ చూసుకున్న తర్వాతనే కొంతలో కొంత వెసులుబాటు పొందేందుకు ఒక లక్షా 76 వేల కోట్ల రూపాయల మేరకు రిజర్వ్ బ్యాంకు కంటింజెన్సీ నిధులను తన కాతాకు మళ్లించుకుంటోంది. ప్రభుత్వ వ్యయాలకు, అదే విధంగా కొంతమేరకు బ్యాంకులకు ఫండింగ్ చేయడానికి ఈ సొమ్మును వెచ్చిస్తారు. ప్రస్తుత పరిస్థితిని చూసి ప్రభుత్వంలో గుబులు పుడుతోంది. అయితే గడచిన ఏడాది కాలంగా మాంద్యం స్థితి కనిపిస్తూ వస్తోంది. కానీ పూర్తిగా రాజకీయ ప్రాధాన్యతలకే పెద్ద పీట వేసిన ఎన్డీఏ ప్రభుత్వం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన వ్యూహ, ప్రతి వ్యూహాల్లోనే మునిగిపోయింది. ఫలితంగా సంక్షోభం ముదురుపాకాన పడింది. అంతర్జాతీయంగా కలిసి వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకోవాల్సి వచ్చింది. మొత్తమ్మీద పొలిటికల్ ప్రయారిటీ ముందు ఆర్థిక రంగం ఓడిపోయింది. దిద్దుబాటు చర్యలు ఎంతమేరకు సత్ఫలితాలనిస్తాయో వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News