దుష్యంత్ కు దరువు తప్పదా?

సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేయడం, వాటిని కొనసాగించడం, అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయడం ఒక కళ. ఇందుకు ఎంతో ఓర్పు, నేర్పు, సహనం, సంయమనం వంటి లక్షణాలు [more]

Update: 2019-12-31 17:30 GMT

సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేయడం, వాటిని కొనసాగించడం, అయిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయడం ఒక కళ. ఇందుకు ఎంతో ఓర్పు, నేర్పు, సహనం, సంయమనం వంటి లక్షణాలు అవసరం. ఇవి కొరవడితే వాటి భవిష్యత్ మూణ్ణాళ్ల ముచ్చటే అవుతుంది. 1977లో జనతాదళ్, 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోని నాయకుల మధ్య ఇలాంటి తెలివిడి కొరవడినందువల్లే అవి పేకమేడల్లా కూలిపోయాయి. ఇక రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలకు లెక్కేలేదు. కేవలం రాజకీయ అవసరాలేకాక, ఒకింత సిద్ధాంత సారూప్యం, భావజాలం వివిధ పార్టీల నాయకుల మధ్య ఉన్నప్పుడే సంకీర్ణ సర్కార్లు విజయవంతమవుతాయి. భారతీయ నాయకుల్లో అలాంటి పరిపక్వత, పరిణితి ఇంకా రాలేదనే చెప్పవచ్చు. అందువల్లే సంకీర్ణ సర్కార్లలో ఆరంభం నుంచి అసంతృప్తి రాజ్యమేలుతుంటుంది. ఇందుకు హర్యానా, మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కార్లే నిదర్శనమని చెప్పవచ్చు.

జేజేపీలో ముసలం…..

తాజాగా హర్యానాలో రెండు నెలల క్రితం ఏర్పాటైన బీజేపీ, జేజేపీ సంకీర్ణ సర్కార్ లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఈ విభేదాలు రెండు పార్టీల మధ్యనే కాకుండా బీజేపీ మిత్రపక్షమైన జేజేపీలో ఏర్పడటం విశేషం. సాధారణంగా తమకు తగినన్ని మంత్రి పదవులు కేటాయించలేదని, ప్రాధాన్యం గల శాఖలు ఇవ్వలేదని చిన్న పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేయడం సహజం. కానీ ఈసారి హర్యానాలో బీజేపీ మిత్రపక్షమైన జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) లో అసమ్మతి గళం తీవ్రంగా విన్పిస్తుంది. పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాపై పార్టీ ఉపాధ్యక్షుడు రామ్ కుమార్ గౌతమ్ ధ్వజమెత్తడం విశేషం. మొన్నటి ఎన్నికల్లో నర్నేడ్ స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన దుష్యంత్ చౌతాలా ఏకపక్ష వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. పార్టీని పట్టించుకోవడం లేదని, పదవులన్నీ దుష్యంత్ చౌతాలే అనుభవిస్తుననారని, ఇతరులకు అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో జేజేపీ పది స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ప్రాధాన్యత గల శాఖలన్నీ…..

40 స్థానాల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ చివరి నిమిషంలో జేజేపీ మద్దతుతో సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసింది. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనవడైన దుష్యంత్ చౌతాలా ఒప్పందంలో భాగంగా ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని పొందారు. అంతేకాకుండా కీలకమైన పది మంత్రి పదవులను పొందారు. రెవెన్యూ, ఎక్సైజ్, గ్రామీణాభివృద్ధి, పన్నులు, పంచాయతీ రాజ్, పరిశ్రమలు, వాణిజ్యం, ప్రజాపనులు, పౌరసరఫరాల శాఖ, కార్మిక ఉపాధి కల్పన, పునరవాస తదితర పదవులను దుష్యంత్ చౌతాలకు అప్పగించారు. అంటే హోం, ఆర్థికం తప్ప అన్నీ ఇతర కీలక శాఖలకు దుష్యంత్ చౌతాలా సారధిగా ఉన్నారు. తాను మంత్రివర్గంలో చేరుతున్న సంగతి కనీసం పార్టీకి కూడా తెలియదని రాజ్ కుమార్ గౌతమ్ ధ్వజమెత్తారు. గుర్ గావ్ లోని ఓ షాపింగ్ మాల్ లో దుష్యంత్ చౌతాలా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తొలుత కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశం ుందని పార్టీకి చెప్పి రాత్రికి రాత్రిి ప్లేటు ఫిరాయించారని, అధిక మంత్రి పదవుల కోసమే దుష్యంత్ చౌతాలా స్వార్థపూరితంగా వ్యవహరించారని గౌతమ్ ఆరోపిించారు. చౌతాలా ఏకపక్ష వైఖరికి నిరసనగా రామ్ కుమార్ గౌతమ్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాల తీవ్రతకు ఈ సంఘటన నిదర్శనమని చెప్పవచ్చు.

పార్టీ నిర్ణయం తీసుకోకుండా…..

మందుగా పార్టీ చర్చించుకున్న మేరకు పార్టీ ఎమ్మెల్యే అనూప్ థనాక్ కు సహాయ మంత్రి పదవి కేటాయించారు. మరో కేబినెట్ పదవిని పార్టీకి కేటాయించాల్సి ఉంది. దానిపై ఇంతవరకూ ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ విషయంపై దుష్యంత్ చౌతాలా స్పందించడం లేదు. ఇక అనూప్ కు కేటాయించిన శాఖ కూడా అప్రధానమైనది. ఆయనకు కార్మిక, ఉపాధి కల్పన శాఖతో పాటు ప్రాధాన్యత లేని ఆర్కియాలజీ మంత్రిత్వ శాఖను కేటాయించారు. దీనిని రామ్ కుమార్ గౌతమ్ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. తన పదవిలోనే దుష్యంత్ సంతృప్తి కరంగా ఉన్నారని, ఇతర ఎమ్మెల్యేల గురించి, వారికి మంత్రిపదవులపై మాట్లాడటం లేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. తన వద్ద గల పది మంత్రిత్వ శాఖల్లో ఒక్కటి కూడా పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు సుముఖంగా లేరని ఆయన ఆరోపంచారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రామ్ కుమార్ గౌతమ్ ఆషామాషీ నాయకుడు కాదు. పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నర్నేడ్ నియోజకవర్గంలో బీజేపీ దిగ్గజం, ఆర్థిక మంత్రి కెప్టెన్ అభిమన్యు ను గౌతమ్ ఓడించారు. గౌతమ్ వాదనను ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తోసిపుచ్చారు. సీనియర్ నాయకుడైన గౌతమ్ స్వార్థంతో వ్యవహరిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. బీజేపీ రాష్ట్ర సుభాష్ బరాలాను ఓడించిన తమ పార్టీ నాయకుడు దేవేందర్ బాబ్లీ పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారని దుష్యంత్ చౌతాలా గుర్తు చేశారు. అంతిమంగా పార్టీలో అసంతృప్తిని, రామ్ కుమార్ గౌతమ్ రాజీనామాను దుష్యంత్ చౌతాలా తేలిగ్గా తోసి పుచ్చారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News